భారతదేశంతో తూర్పు సరిహద్దులో ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో పాకిస్తాన్ పశ్చిమ సరిహద్దులో మరో తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. బలూచిస్తాన్‌లో స్వాతంత్ర్యం కోరుతున్న బలూచ్ తిరుగుబాటుదారులు అక్కడి పాకిస్తాన్ భద్రతా దళాలపై దాడులు ముమ్మరం చేశారు. బలూచిస్తాన్‌లోని క్వెట్టా, ఉతల్, సోహ్‌బత్‌పూర్, పంజ్‌గుర్ వంటి ఐదు ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. పాక్ ఆర్మీ స్థావరాలపై మెరుపుదాడులకు పాల్పడిన బలూచ్ యోధులు, అక్కడ పలు సాయుధ సమూహాలు పాకిస్తాన్ సైనికులపై విరుచుకుపడ్డాయి. ప్రస్తుతం కనీసం మూడు ముఖ్యమైన బలూచ్ గ్రూపులు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలపై తమ నియంత్రణను ప్రకటించుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. రెండు రోజులుగా కొనసాగుతున్న దాడుల సమయంలో అనేక పేలుళ్లు, కాల్పుల సంఘటనలు చోటుచేసుకున్నాయి. సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న ఫోటోలు, వీడియోల్లో పాకిస్తాన్ జాతీయ జెండాలను తొలగించి బలూచ్ జెండాలను ఎగురవేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. తిరుగుబాటుదారులు క్వెట్టా ఫైజాబాద్ ప్రాంతంలో పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్‌పై దాడి చేయగా, సిబి ప్రాంతంలోని ఆర్మీ క్యాంప్‌పై గ్రెనేడ్‌లతో దాడి చేశారు. గురువారం నాడు క్వెట్టాలోని నాలుగు వేర్వేరు ప్రదేశాల్లో గుర్తు తెలియని దుండగులు దాడులు జరిపారు.
బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) కెచ్, మస్తుంగ్, కాచిల ప్రాంతాల్లో పాక్ సైన్యంపై కనీసం ఆరు మెరుపు దాడులు జరిపిందని ‘రేడియో జ్రుంబేష్ ఇంగ్లీష్’ తెలిపింది. ఈ దాడుల వివరాలను బలూచ్ రచయిత మీర్ యార్ బలూచ్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. బలూచ్ ప్రజలు ఇప్పుడు తమ జెండాలను ఎగురవేస్తూ, పాకిస్తాన్ జెండాలను తొలగిస్తున్నారని చెప్పారు. అంతేకాదు, ప్రపంచ దేశాలు తమ దౌత్య సంబంధాలను పాకిస్తాన్ నుండి ఉపసంహరించుకుని స్వతంత్ర బలూచిస్తాన్‌ను గుర్తించాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. ఇటీవల పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి షాహిద్ ఖాకాన్ అబ్బాసి బలూచిస్తాన్‌పై పాక్ ప్రభుత్వ నియంత్రణ తగ్గిపోతోందని వ్యాఖ్యానించిన తర్వాత ఈ దాడులు మరింత తీవ్రతరంగా మారాయి. ఆయన ప్రకారం భద్రతా బలగాల సహకారం లేకుండా సీనియర్ అధికారులెవరూ అక్కడ ప్రయాణించలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు కెచ్ జిల్లాలోని దష్టుక్ ప్రాంతంలో బీఎల్ఏ ఉగ్రవాదులు రిమోట్ కంట్రోల్డ్ ఐఇడీ ద్వారా బాంబు నిర్వీర్యం బృందంపై దాడి చేసి ఒక సైనికుడిని హతమార్చారు. భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు పాకిస్తాన్ ప్రతిస్పందించడంలో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ ఘటనలు చోటుచేసుకోవడం గమనార్హం. ఆపరేషన్ సిందూర్ కింద పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత దళాలు సర్జికల్ దాడులు జరిపాయి. అప్పటి నుండి పాకిస్తాన్ పలు డ్రోన్, రాకెట్ దాడులను విఫలంగా ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో బలూచ్ తిరుగుబాటు బలగాల దాడులు పాక్ సైన్యానికి పెద్ద సవాలుగా మారాయి.