టార్గెట్ 265.. నిజానికి సులువైన లక్ష్యం కాదు.. అలాగని.. పెద్ద కష్టమూ కాదు.. కానీ దుబాయ్ పిచ్‌పై మాత్రం ఇది పెద్ద టార్గెటే. ఎందుకంటే మ్యాచ్‌ను టర్న్ చేసేందుకు స్పిన్నర్ వేసే ఓ ఓవర్ చాలు. ఇదే ప్రూవ్ అయ్యింది సెమీస్ ఫైట్‌లో. ఆస్ట్రేలియా, భారత్ మధ్య ఉత్కంఠ భరితంగా సాగిన తొలి సెమీస్ ఫైట్‌లో రోహిత్ సేన 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఫైనల్ బెర్త్ కన్ఫామ్ చేసుకుంది. మరోసారి 2023 వరల్డ్ కప్ ఫైనల్ సీన్‌ను రీపిట్ అవుతుందా? అని అనుమానంలో క్రికెట్ ఫ్యాన్స్ డౌట్స్ క్లియర్ చేస్తూ.. కీలక మ్యాచ్‌లో గ్రాండ్ విక్టరీ సాధించింది టీమ్ ఇండియా. ఇక ఈ నెల 9న జరిగే ఫైనల్స్‌లో గెలిస్తే టీమిండియా ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఛాంపియన్‌గా నిలవనుంది.
265 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. గిల్ 8 పరుగులకే ఔటయ్యాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ కూడా పెవిలియన్ చేరాడు. దీంతో క్రీజులో ఉన్న కోహ్లీ, అయ్యర్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతలను తీసుకన్నారు. ఇక కోహ్లీ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఛేజింగ్‌లో అతను ఒక్కసారి నిలదొక్కుకుంటే ఎలా ఉంటుందో రుచి చూపించాడు. వరుసగా వికెట్లు పడుతున్నా క్రీజుకు అతుక్కుపోయాడు. భారీ షాట్లకు పోకుండా.. ఆచితూచి ఆడుతూ మ్యాచ్‌ను గెలుపు తీరాలకు తీసుకొచ్చారు. నిజానికి కోహ్లీ సెంచరీ చేసి మ్యాచ్‌ను ముగిస్తాడనుకున్నారు. కానీ 84 పరుగుల వద్ద ఔట్ అవ్వడంతో కాస్త నిరాశ కలిగిందనే చెప్పాలి. ఈ 84 పరుగుల్లో 56 సింగిల్స్ తీశాడు కోహ్లీ. దీని బట్టే అర్థం చేసుకోవచ్చు.. కోహ్లీ ఎలా ఆచితూచి ఆడాడో.
కోహ్లీ తర్వాత మ్యాచ్‌ను ముగించే బాధ్యతను తీసుకున్నారు రాహుల్, పాండ్యా. రాహుల్ ఎంట్రీతో ఇన్నింగ్స్‌లోనే వేగం పెరిగింది. చివర్లో పాండ్యా వరుసగా సిక్స్‌లు బాదేశాడు. కానీ మరో భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. చివరికి సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించాడు రాహుల్. దీంతో డ్రెస్సింగ్ రూమ్‌లో సంబరాలు మొదలయ్యాయి.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్264 పరుగులు చేసి ఆలౌటైంది. నిజానికి స్పిన్ బౌలింగ్‌తో ఆసీస్‌ను కంగారు పెడతారనుకున్నా.. అలా జరగలేదు. వరుసగా వికెట్లు కోల్పోయినా.. గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది ఆస్ట్రేలియా. స్మిత్ 73 పరుగులు.. క్యారీ 61, హెడ్ 39 పరుగులు చేయడంతో స్కోర్ అలా అలా పెరుగుతూ పోయింది. ఇక మహ్మద్ షమీ 3 వికెట్లు పడగొట్టి ఆసీస్ బ్యాటర్లను పెవిలియన్‌కు పంపడంలో కీలకపాత్ర పోషించాడు. వరుణ్, జడేజా చెరో రెండు వికెట్లు తీయగా.. అక్షర్, పాండ్యా చెరో వికెట్ తీశారు.
ఈ విజయంతో ఆసీస్‌ను దెబ్బకు దెబ్బ కొట్టింది టీమిండియా. 2023 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు రివేంజ్ తీర్చుకున్నారనేచెప్పాలి. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో గెలవడం మాత్రమే కాదు.. ప్రతీకారం కూడా తీర్చేసుకున్నారు.