ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు భేటీ అవుతున్నారు. వాళ్లు ఇద్దరు మాత్రమే కాదు.. వాళ్ల నేతృత్వంలోని ఇరు రాష్ట్రాల అధికారుల బృందాలు కూడా సమావేశమవుతున్నాయి. తిరుపతిలో సోమవారం ఇరు రాష్ట్రాల చీఫ్ సెక్రెటరీల నేతృత్వంలోని రెండు రాష్ట్రాల అధికారుల బృందాలు పలు అంశాలపై చర్చించనున్నాయి. ఈ మేరకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అధికారిక బృందాలను నియమించాయి. తెలంగాణ తరపున చీఫ్ సెక్రెటరీ సీఎస్ శాంతికుమారి సహా ఆర్థికశాఖ స్పెషల్ చీఫ్ సెక్రిటరీ, సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రెటరీ హాజరవుతున్నారు. ఇక, ఆంధ్రప్రదేశ్ తరపున చీఫ్ సెక్రెటరీ నీరబ్‌కుమార్ ప్రసాద్ నేతృత్వంలో.. అధికారుల బృందం ఈ ఉన్నతస్థాయి సమావేశానికి హాజరవుతోంది.
రాష్ట్ర విభజన జరిగి దశాబ్దం గడిచినప్పటికీ ఇంకా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసమే ఈ ఇరు రాష్ట్రాల ఉన్నతస్థాయి అధికారుల సమావేశం జరుగుతోంది. రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారిన తర్వాత.. ఈ ఏడాది జూలైలో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి తొలిసారి హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో సమావేశమయ్యారు. ఆ సమయంలో దశాబ్ద కాలంగా అపరిష్కృతంగా ఉన్న పలు సమస్యల పరిష్కారం కోసం మంత్రులు, అధికారుల స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే, అప్పుడు జరిగిన ముఖ్యమంత్రుల భేటీ తర్వాత ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. తాజాగా ఉన్నతాధికారుల కమిటీ సమావేశం కానుండటంతో విభజన సమస్యల పరిష్కారం కోసం కసరత్తు పుంజుకునే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అధికారుల స్థాయిలో పరిష్కారం అయ్యే సమస్యలను సోమవారం నాటి భేటీలో ప్రధానంగా చర్చిస్తారని తెలుస్తోంది. ఎజెండాలో కూడా అవే అంశాలు ఉన్నాయంటున్నారు. వీటితో పాటు రెండు రాష్ట్రాలకు కీలకమైన, ముఖ్యమంత్రులు విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటే తప్ప.. పరిష్కారం కాని సమస్యలకు సంబంధించి ఇరు రాష్ట్రాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారాలపై కూడా ఇద్దరు సీఎస్‌లు ఫోకస్ చేసే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల నుంచి తెలుస్తోంది. తెలంగాణా నుంచి ఏపీకి ఆరువేల కోట్లకు పైగా విద్యుత్ బకాయిలు రావాల్సి ఉన్నాయి. విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10కి చెందిన సంస్థలు, హైదరాబాద్‌లో ఏపీకి చెందిన భవనాలు, ఆస్తులు ఉన్నాయి. వీటి విషయంలో కూడా పరిష్కార మార్గాలు వెతకాల్సి ఉంది. ఉద్యోగుల బదలాయింపు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కట్టడికి జాయింట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు వంటి ఇతర అంశాలు కూడా ఈ అజెండాలో ఉన్నాయని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది.