చైనా.. ఈపేరు వింటేనే కరోనా మదిలో మెదులుతుంది. ఇంకా ఆ భయాలు వెంటాడుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు డ్రాగన్ కంట్రీలో మరో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఛాయలు దాదాపు తొలగిపోయినా.. చైనాలో ఇంకా ఆ వైరస్ అక్కడక్కడా భయపెడుతూనే ఉంది. అయితే, దానికితోడుమరో కొత్త వైరస్ కూడా ఇప్పుడు బయట పడింది. హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ అని దాన్ని పిలుస్తున్నారు. వాస్తవానికి 2001లోనే ఈ వైరస్‌ను మొదటగా కనుగొన్నారు. కానీ, ఇప్పుడు కరోనా తరహాలో జనాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. దీంతో, ఈ వైరస్ మరోసారి చైనా సహా ప్రపంచ దేశాలను భయపెడతోంది.
హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ అన్ని వయసులవాళ్లనూ వదిలిపెట్టడం లేదు. అయితే, వృద్దులు, పిల్లలు, బలహీనంగా ఉండేవాళ్లు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లకు ఇది ప్రమాదకరంగా పరిణమించింది. దీంతో, ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. శ్మశాన వాటికల దగ్గర రద్దీ పెరిగిపోతోంది. చైనాలో వ్యాపించిపోయిన ఈ వైరస్ గురించి మనం కూడా జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ఇతర దేశాల నుంచి ప్రయాణిస్తున్న వాళ్లతో ఈ వైరస్ ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని WHO వార్నింగ్ ఇస్తోంది.
అయితే, ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాలేంటో చూద్దాం… హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ సోకితే జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జ్వరం వంటి సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. ఒక్కోసారి బ్రాంకైటిస్ లేదా న్యుమోనియా కూడా సోకే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ఒకరి నుంచి మరొకరికి చాలా సులభంగా సోకుతుంది. ఇన్‌ఫెక్షన్ సోకిన వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా ఈ వైరస్ గాలిలో కలుస్తుంది. ఆ గాలిలో చేరిన కణాల ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది. అంతేకాదు.. ఈ వైరస్ ఉన్న వస్తువులను తాకి, ఆ చేతులతో ముక్కు, నోరు, కళ్లను తాకినా వైరస్ సోకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అంటే దాదాపు కరోనా లెవెల్‌లో దీని లక్షణాలు కలవర పెడుతున్నాయి. ప్రధానంగా చలికాలంలో ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతోందంటున్నారు.
మరి.. ఈ వైరస్ నుంచి రక్షించుకోవడం ఎలాగో చూద్దాం… ఈ హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ ఫ్యామిలీకి చెందింది. హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్‌కి ప్రత్యేకంగా చికిత్స అనేది లేదు. ఈ వైరస్ లక్షణాలను బట్టి వైద్యులు చికిత్స చేస్తారు. కాబట్టి, వ్యాధి రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. తరచుగా చేతులు కడుక్కోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, జలుబు, దగ్గు ఉన్నవారికి దూరంగా ఉండటం తప్పనిసరి అని వైద్యులు సూచిస్తున్నారు. మాస్క్‌లు ధరించడం, రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ద్వారా కూడా ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చంటున్నారు. పిల్లలకు పరిశుభ్రత గురించి అవగాహన కల్పించడం అవసరమని చెబుతున్నారు. ఒకవేళ మీకు లేదా మీ కుటుంబ సభ్యులకు జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే, ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని చెబుతున్నారు.
అయితే, ఈ వైరస్‌తో ఆకస్మిక మరణాలు పెరుగుతాయంటున్నారు. హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ లక్షణాలు సాధారణ జలుబు, ఫ్లూ వంటి ఇతర శ్వాసకోశ సంబంధిత వ్యాధుల్లాగే ఉన్నప్పటికీ దీన్ని అంత తేలిగ్గా తీసుకోవద్దంటున్నారు. కానీ టెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ముఖ్యంగా 40 నుంచి 80 ఏళ్ల వారిలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ సహా ఇతర సీజనల్ వ్యాధులు, మరిన్ని వైరస్‌ల కారణంగా చైనాలో అనారోగ్యాల విజృంభిస్తున్నాయని చెబుతున్నారు. ఇన్‌ఫ్లూయెంజా ఎ, హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్, మైకోప్లాస్మా న్యుమోనియా, కోవిడ్-19 వంటి వైరస్‌లు ఒకేసారి వ్యాప్తి చెందడంతో ఆసుపత్రులు, శ్మశాన వాటికలు రోగుల తాకిడిని తట్టుకోలేకపోతున్నాయి. పిల్లల ఆసుపత్రుల పరిస్థితి మరీ దారుణంగా ఉందట. న్యుమోనియా కేసులు, ముఖ్యంగా వైట్ లంగ్ కేసులు విపరీతంగా పెరగడంతో ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయని చెబుతున్నారు. ప్రధానంగా 14 ఏళ్లలోపు పిల్లలు ఈ వైరస్ బారిన పడుతుండటం మరింత కలవరపెడుతోందంటున్నారు. హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ సోకిన 3నుంచి 5 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయట. వైరస్ ఉన్న వస్తువులను తాకి, ఆ చేతులతో ముక్కు, నోరు, కళ్లను తాకినా వైరస్ సోకే ప్రమాదం ఉంది. పిల్లలు ఒకరికొకరు దగ్గరగా ఉండటం వల్ల వైరస్ త్వరగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నా, దీనికి ప్రత్యేకంగా మందులు లేవు. ఇది సాధారణ జలుబు లాంటిదేనట. అందుకే, సొంత వైద్యం వద్దని, డాక్టర్ సలహా లేకుండా యాంటీవైరల్స్ వాడొద్దని సలహా ఇస్తున్నారు. జ్వరం, ఒళ్లు నొప్పులకు పారాసిటమాల్ వాడొచ్చని, దగ్గు, జలుబుకు సాధారణ మందులు పనిచేస్తాయని, అయితే, లక్షణాలు తీవ్రంగా ఉంటే మాత్రం డాక్టర్‌ని కలవడం తప్పనిసరి అని చెబుతున్నారు. కరోనా మాదిరిగానే హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ మొదట చైనాలో కనిపించినా, ఇప్పుడు ప్రపంచమంతా వ్యాపించింది. ఇది ఒక గ్లోబల్ ముప్పు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. అందుకే, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, చేతులు కడుక్కోవడం, మాస్కులు ధరించడం చాలా ముఖ్యమని సూచిస్తోంది.