బంగ్లాదేశ్‌లో మరోసారి రాజకీయ సంక్షోభం తప్పేలా కనిపించడం లేదు. త్వరలో అక్కడ సైనిక పాలన అమల్లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వ పెద్దగా ఉన్న మహమ్మద్ యూనస్ తీరుపై అక్కడి సైన్యం సంతృప్తిగా లేనట్టు తెలుస్తోంది. నెలలు గడిచిపోతున్నా ఎన్నికలు నిర్వహించకపోవడంపై వారు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది.
బంగ్లాదేశ్ సైన్యాధ్యక్షుడు జనరల్ వఖర్ ఉజ్ జమాన్ ఐదుగురు లెఫ్టినెంట్ జనరల్స్, ఎనిమిది మంది మేజర్ జనరల్స్, ఇండిపెండెంట్ బ్రిగేడ్ కమాండింగ్ అధికారులు, పలువురు ఆర్మీ అధికారులతో భేటీ అయ్యారు. దీంతో ఎప్పుడేం జరుగుతుందో అనే విషయం అర్థం కాని పరిస్థితి. ఎమర్జెన్సీ విధించడమో లేక యూనస్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయ్యడమే ఏదో ఒకటి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అనేక ఆందోళనలు, అల్లర్లతో అట్టుడికించి షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలదొసిన విపక్షాలు.. ఇప్పుడు తాత్కాలికంగా యూనుస్ ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నారు. అయితే అతని హయాంలో కూడా పరిస్థితులు చేజారుతున్నట్టు కనిపిస్తోంది. నిజానికి బంగ్లాదేశ్ సైన్యాధ్యక్షుడు జనరల్ వఖర్ ఉజ్ జమాన్ గతంలోనే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. దేశం మంచి వారి చేతిలో ఉండాలని.. కానీ గడచిన 7, 8 నెలలో చూడకూడనివి చాలా చూశానని చెప్పారు. ఆయన వ్యాఖ్యలను చూస్తుంటే తాత్కాలిక ప్రభుత్వానికి డెడ్లీ వార్నింగ్ ఇచ్చినట్టే కనిపించింది. అంతేకాదు ఆయన మరో కీలక వ్యాఖ్య కూడా చేశారు. తిరుగుబాటు గురించి ముందే చెబుతున్నానని.. తర్వాత ఎందుకు చెప్పలేదని తనను నిందించవద్దన్నారు. ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే బంగ్లాదేశ్‌లో మరోసారి డేంజర్ బెల్స్ మోగినట్టు క్లియర్ కట్‌గా అర్థమైంది. ఇప్పుడు తన వ్యాఖ్యలను నిజం చేస్తున్నారు జమాన్.
దేశంలో త్వరగా ఎన్నికలు నిర్వహించాలన్నది ఆయన డిమాండ్. నిజానికి యూనుస్ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించేవరకు తాత్కాలికంగా అధికారంలో ఉంటుందని మొదట ప్రకటించింది. కానీ నెలలు గడుస్తున్నా.. ఎన్నికలు మాత్రం నిర్వహించ లేదు. దీంతో కొన్ని విదేశీ శక్తులు యూనుస్‌ను అడ్డుపెట్టుకొని చక్రం తిప్పాలని చూస్తున్నాయా? అనే ప్రశ్నలు, అనుమానాలు ప్రజల్లో మొదలయ్యాయి. ఈ విషయాన్నే అక్కడి సైన్యం చెబుతోంది. త్వరగా ఎన్నికలు నిర్వహిస్తే సరే.. లేదంటే సైన్యం అధికారాన్ని చేజిక్కించుకుంటుందని ఇప్పుడు నిఘా వర్గాలు కూడా అక్కడి ప్రభుత్వానికి సమాచారం అందించినట్టు తెలుస్తోంది.