22 C
Hyderabad
Friday, November 6, 2026

Live Video

spot_img

అమిత్‌ షా వన్‌ మ్యాన్‌ షో

  • మోదీ ప్లాన్‌ – షా స్ట్రాటజీ

  • మోదీ-షా సక్సెస్‌ఫుల్‌ ద్వయం

  • ఇద్దరూ స్కెచ్‌ వేస్తే దబిడి దిబిడే!

ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అనుకున్నది సాధించింది. వక్ఫ్ బిల్లును తీసుకురావాలని డిసైడ్ అయిన కేంద్ర సర్కార్.. ఎట్టకేలకు బిల్లుకు ఆమోదముద్ర వేయించుకుంది. ఈ కీలక సమయంలో ప్రధానమంత్రి విదేశీ పర్యటనలో ఉన్నప్పటికీ అమిత్‌ షా అంతా పర్యవేక్షించారు. రాజ్యసభలోనే కూర్చొని మరీ వక్ఫ్‌ బిల్లు పాస్‌ అయ్యేలా తనదైన వ్యూహాలను అమలు చేశారు. చివరకు పార్లమెంటు ఉభయ సభల్లోనూ చారిత్రాత్మక వక్ఫ్‌ బోర్డ్‌ బిల్లుకు ఆమోదం లభించింది.

అటు.. లోక్‌ సభలోనూ, ఇటు రాజ్యసభలోనూ అర్థరాత్రుళ్లు దాటి.. మరుసటిరోజు తెల్లవారు జాము దాకా ఈ బిల్లుపై హాట్‌ డిస్కషన్‌ నడిచింది. విపక్షాలు ఈ బిల్లును అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నించాయి. కానీ, మోదీ-అమిత్‌ షా ద్వయం వ్యూహాలకు విపక్షాల ఎత్తులు చిత్తయ్యాయి. లోక్‌సభలో బిల్లుకు ఆమోదం లభించడం అందరూ ఊహించిందే అయినా.. రాజ్యసభలోనే ఈ బిల్లు గట్టెక్కుతుందా? లేదా? అన్న సందిగ్ధం చివరిదాకా కొనసాగింది. కానీ, భారీగా ఓట్ల తేడాతో రాజ్యసభలో కూడా వక్ఫ్‌ బిల్లుకు ఆమోదం లభించింది. ఇక, ఈ బిల్లు రాష్ట్రపతి వద్దకు వెళ్లడం, రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడం లాంఛనమే.

రాజ్యసభలో ఈ వక్ఫ్‌ బోర్డ్‌ బిల్లుకు మద్దతుగా 128 మంది, వ్యతిరేకంగా 95 మంది సభ్యులు ఓటు వేశారు. అదేవింగా లోక్‌సభలో బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది ఎంపీలు ఓటు వేశారు.

ఆమోదముద్ర పడేదాకా సభల్లోనే షా :

దేశ వ్యాప్తంగా విస్తృతంగా చర్చకు కారణమైన వక్ఫ్ బిల్లు ఆమోదంతో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. వీళ్లిద్దరూ ఘటికులని.. అనుకున్నది సాధించే వరకు అస్సలు విశ్రమించరని రాజకీయ విశ్లేషకులు అభినందిస్తున్నారు. రాజ్యసభలో బిల్లు వీగిపోకుండా ఉండేందుకు బిజూ జనతాదళ్ పార్టీని ఒప్పించడం హైలైట్‌గా నిలిచిందంటున్నారు. 12 గంటల పాటు ఉభయ సభలకు అమిత్ షా హాజరై.. ప్రతిదీ ప్లాన్ ప్రకారం జరిగేలా చూసుకోవడం బాగుందని చెబుతున్నారు. ఎన్‌డీఏ సభ్యులతో పాటు ఇతర పార్టీల ఎంపీల మద్దతు కూడగట్టేందుకు చేసిన ప్రయత్నాలను అందరూ భేష్‌ అంటున్నారు. ప్రధానంగా ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టంగా ప్రకటించిన బీజేడీ పార్టీ సభ్యులను దారికి తెచ్చుకోవడం, ఏకబిగిన పార్లమెంట్‌లోనే కూర్చొని బిల్లుకు ఆమోదముద్ర పడేవరకు పక్కకు జరగకపోవడం, విపక్షాల ప్లాన్లను తిప్పికొట్టడం.. ఇదంతా అమిత్‌ షా వ్యూహాలకు తిరుగులేదని మరోమారు రుజువు చేసిందని విమర్శకులు కూడా ప్రశంసిస్తున్నారు.

ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ థాయ్‌లాండ్ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఈ తరుణంలో ఉభయ సభల్లో అమిత్‌ షా అంతా తానై నడిపించారు. మొదట అనుకున్న ప్లాన్ ప్రకారం వక్ఫ్ బిల్లును పక్కా స్కెచ్‌తో ఆమోదించేలా చేశారు.

అమిత్ షా – ఓ మాస్టర్ స్ట్రాటజిస్ట్ :

భారత రాజకీయాల్లో అమిత్ షా ఒక ప్రత్యేకమైన నాయకుడిగా ఎదిగారు. ముఖ్యంగా కీలకమైన అంశాల్లో ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి అండగా ఉంటూ, వ్యూహాలను స్వయంగా అమలు చేయడంలో దిట్టగా పేరు గడించారు. దేశ చరిత్రలోనే కీలకమైన బిల్లుల ఆమోదం సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో ఉన్నప్పటికీ, అమిత్ షా మాత్రం తనదైన వ్యూహాలతో పార్లమెంటును నడిపించడంపై ప్రత్యేకమైన చర్చ జరుగుతోంది. ఆయన ఆలోచనా విధానం రాజకీయ విశ్లేషకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఇప్పటి వరకు పార్లమెంటులో చూస్తే.. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించిన ఆర్టికల్ 370 రద్దు సమయంలోనూ, ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందేలా చూడటం లోనూ, యూనిఫామ్ సివిల్‌ కోడ్‌పై చర్చ జరిగిన సమయంలోనూ కేంద్ర హోంమంత్రి.. బీజేపీలో మోదీ తర్వాత అత్యంత కీలక నేత అయిన అమిత్‌ షా ప్రత్యర్థులకు అందకుండా వ్యూహాలు రూపొందించడంతో పాటు.. తాము అనుకున్నది సాధించడం అనేది ఆయన సామర్థ్యానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అందుబాటులో లేక పోయినా, విదేశీ పర్యటనల్లో ఉన్నా.. అమిత్‌ షా ఆ టాస్క్‌ పూర్తి చేయడంలో సక్సెస్‌ అవుతున్నారు. ఈ తరహా సందర్భాల్లో అమిత్ షా పార్లమెంటులో తనదైన శైలిలో వ్యవహరిస్తూ ప్రతిపక్షాలను ఎదుర్కొంటున్నారు. లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రతిపక్షాల నుంచి సవాళ్లు ఎదురవుతున్నా.. తన వ్యూహంతో అధికార పక్షం పరువు పోకుండా కాపాడుతున్నారు.

అమిత్ షా రాజకీయ వ్యూహాలు :

బిల్లులను వ్యతిరేకించే పార్టీలు, సభ్యులను ముందుగానే అంచనా వేసి, ఆ ప్రభావం ఉండకుండా తగిన వ్యూహాలు రచిస్తున్నారు. అలాగే, స్వపక్షం, మిత్ర పక్షాలను కూడా సమన్వయం చేయడంలో సక్సెస్‌ అవుతున్నారు. ప్రతిపక్ష పార్టీలు ఏ విధంగా స్పందించబోతున్నాయో ముందుగానే అంచనా వేసి, ప్రత్యుత్తరాలకు సిద్ధంగా ఉండడం, ఇతర మంత్రులతో సమర్థవంతంగా సమాధానాలు ఇప్పించడంలో అమిత్‌ షా సఫలమవుతున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనల్లో ఉన్నా కూడా పార్లమెంటును పూర్తిగా తన నియంత్రణలో ఉంచుకోవడంలో అమిత్‌ షా విజయం సాధిస్తున్నారు. ఈ విధానం భారత రాజకీయాల్లో అరుదైన మోడల్‌గా చెప్పుకోవచ్చంటున్నారు విశ్లేషకులు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com