తెలంగాణ బీజేపీ నేతలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీరియస్ అయ్యారు. అధిష్టానం ఆలోచన ఏంటో తెలుసుకోకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం, సొంత ప్రకటనలు చేయడంపై నేతలకు గట్టిగానే క్లాస్ పీకారట. స్వయంగా ఆ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర నాయకులే ఈ విషయం చెప్పుకొని బోరుమంటున్నారు.
అసలు అధిష్టానం ఎందుకు సీరియస్ అయ్యింది? ఏ విషయంలో అంతగా రియాక్ట్ అయ్యిందన్న విషయం చూద్దాం… ఇటీవల తెలంగాణలో రెండు స్థానాలకు జరిగిన పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీల ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు ఇద్దరు విజయం సాధించారు. ఈ విజయాలను గ్రేట్ విక్టరీగా ఇటు రాష్ట్ర నాయకత్వం, అటు కేంద్ర నాయకత్వం కూడా అభివర్ణిస్తున్నాయి. దీంతో, ఎమ్మెల్సీలుగా గెలిచిన బీజేపీ అభ్యర్థులు మల్క కొమురయ్య, అంజిరెడ్డిలు రాష్ట్ర నాయకులతో కలిసి ఢిల్లీ వెళ్లారు. బీజేపీ రాష్ట్ర నేతలు.. వీళ్లిద్దరినీ అధిష్టానం వద్దకు తీసుకెళ్లారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను మర్యాద పూర్వకంగా కలిశారు. కాషాయ పార్టీ అగ్రనేతలు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలకు అభినందనలు తెలిపారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి సూచికగా అభివర్ణించారు.
తెలంగాణ కమల నాథులు అమిత్ షాతో భేటీ అయిన సమయంలో ఆయన.. రాష్ట్ర నేతలపై మండిపడ్డారు. తెలంగాణలో ఇటీవల బీసీ రిజర్వేషన్ల అంశం చర్చకు వచ్చిన సమయంలో అమిత్ షా క్లాస్ తీసుకున్నారు. రాష్ట్ర ఉభయ సభల్లోనూ బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందింది. దీనిని రాజకీయ పార్టీలన్నీ ఏకగ్రీవంగా ఆమోదించాయి. దీనిని ప్రస్తావించిన అమిత్ షా.. బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర బీజేపీ నేతలు పూర్తి మద్దతు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లీంలు లేకుండా హిందూ బిసిలకు మాత్రమే 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. దీంతో, తెలంగాణ కాషాయ నేతలకు దిమ్మ దిరిగి పోయింది. అంతేకాదు.. బీసీ రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ వ్యతిరేకం కాదన్న అమిత్ షా.. ఆ పేరుతో ముస్లింలకు కూడా రిజర్వేషన్లు కల్పించడాన్ని మాత్రం అడ్డుకొని ఉండాల్సిందని అభిప్రాయ పడ్డారు.
మరోవైపు.. తెలంగాణ ప్రభుత్వం శాసన సభ, శాసన మండలిలో ఆమోదం పొందిన 42 శాతం బీసీ రిజర్లేషన్ల బిల్లును కేంద్రానికి పంపించింది. ఈ బిల్లుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. పార్లమెంటులో ఈ బిల్లుకు ఆమోదం లభిస్తేనే తెలంగాణలో పెంచిన రిజర్వేషన్లు అమలయ్యే పరిస్థితి ఉంటుంది. అంటే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తలచుకుంటేనే రేవంత్ సర్కారు ప్రయత్నం సఫలమవుతుంది. మరి.. కేంద్రం ఈ రిజర్వేషన్ల బిల్లుపై ఏం నిర్ణయం తీసుకుంటుందన్నది కొద్దిరోజుల్లో తేలనుంది.