కాదేది కవితకు అనర్హం అన్నట్టుగా…ఓ ప్రబుద్దుడు ఏకంగా అంబులెన్స్ మీదే కన్నేశాడు. హైద్రాబాద్ – విజయవాడ నేషనల్ హైవేపై యాక్షన్ మూవీ రేంజ్ లో చేజింగ్,ఫైటింగ్ చేసిన పోలీసులు.. దొంగను అదుపులోకి తీసుకున్నారు.
ఈ రోజు హయత్ నగర్ లో 108 వాహనాన్ని చోరీ చేసి విజయవాడ వైపు పారిపోయిన దొంగ నానా హంగామా చేశాడు. దొంగను పట్టుకునేందుకు హైవేపై అలర్ట్ అయిన పోలీసులు వెంబడించారు. హయత్ నగర్ నుంచి సూర్యాపేట దాకా పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన దొంగ…అంబులెన్స్ సైరన్ తో రయ్ రయ్ మంటూ అతి వేగంతో పరారయ్యాడు.
చిట్యాల వద్ద పట్టుకునే క్రమంలో ఏ.ఎస్.ఐ జాన్ రెడ్డిని ఢీకొట్టి దొంగ పారిపోయాడు. జాన్ రెడ్డి పరిస్థితి విషమం,చికిత్స నిమిత్తం హైద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో కేతేపల్లి (మం)కొర్లపహాడ్ టోల్ గేట్ వద్ద గేట్ ను ఢీకొట్టి పారిపోయిన కేటుగాన్ని… సూర్యాపేట (మం)టేకుమట్ల వద్ద రోడ్డుకు అడ్డంగా లారీలు పెట్టారు. లారీలు తప్పించే ప్రయత్నంలో వాహనం అదుపు గాక ముళ్లపొదల్లోకి వాహనం దూసుకుపోయింది. వెంటనే పోలీసులు దొంగను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ నిందితుడు గతంలో పలు చోరీలు చేసినట్టు పోలీసలు గుర్తించారు.