36.2 C
Hyderabad
Sunday, April 19, 2026

Live Video

spot_img

అమరావతి శంకుస్థాపన – మారనున్న మోదీ స్వరం

ఏపీ రాజధాని అమరావతికి కొత్త ఊపిరి ఊదుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మే 2వ తేదీన అమరావతిలో పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని కార్యాలయం ఈ పర్యటనను అధికారికంగా ప్రకటించింది. రెండోతేదీ మంగళవారం సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీ గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా అమరావతికి ప్రయాణమవుతారు. 3.30 గంటలకు అమరావతిలో ల్యాండింగ్ అవుతారు. అక్కడ 1.1 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం అమరావతి పెవిలియన్ సందర్శిస్తారు. సాయంత్రం 5 గంటల వరకు బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు. సభ అనంతరం మోదీ ఢిల్లీకి తిరుగు పయనమవుతారు.

గత పదేళ్లుగా అమరావతి నిర్మాణ కార్యక్రమాలు నిలిచిపోయిన సందర్భంలో.. రెండోసారి మోదీ శంకుస్థాపన కార్యక్రమం ఓ టర్నింగ్ పాయింట్ కానుంది. మొదటి దశ పనుల కోసం ఇప్పటికే టెండర్లు ఖరారయ్యాయి. నిర్మాణాలు మూడేళ్లలో పూర్తి చేయాలని చంద్రబాబు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధుల్లో వరల్డ్ బ్యాంక్, ఆసియా డెవలప్‌మెంట్‌ బ్యాంకు ద్వారా 15 వేల కోట్ల రూపాయలు రుణం లభించింది. హడ్కో ద్వారా 11 వేల కోట్ల రూపాయల రుణం తీసుకున్నారు. ఈ మొత్తం పథకానికి కేంద్రం అనుమతులు ఇచ్చింది.

గతంలో మొదటిసారి శంకుస్థాపన చేసిన సమయంలో పుణ్యక్షేత్రాల నుంచి మట్టి, నీరు తెచ్చివ్వడం తప్ప ఏ రకమైన భరోసానూ ప్రకటించలేదు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. కేంద్రంలో ప్రభుత్వం నిలబడాలంటే.. చంద్రబాబు మద్దతు మోదీకి కీలకంగా మారింది. అందుకే ఈసారి ప్రధాని మోదీ నుంచి సానుకూల ప్రకటనలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థల ఏర్పాటుకు ఇప్పటికే అమరావతిలో భూములు కేటాయించారు. వాటి ఏర్పాటుకు ప్రధాని ప్రకటన చేసే సూచనలు ఉన్నాయి.

ఇక, బహిరంగసభకు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు 5 లక్షల మంది ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. సభకు హాజరయ్యే వాళ్ల కోసం 11 పార్కింగ్‌ జోన్‌లు ఏర్పాటు చేశారు. 8 రహదారుల గుండా సభా వేదికకు ప్రవేశం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. వీటిలో.. మంగళగిరి నుంచి 2 మార్గాలు, తాడేపల్లి నుంచి 1 మార్గం, వెస్ట్ బైపాస్ నుండి 1 మార్గం, ప్రకాశం బ్యారేజి నుంచి 2 మార్గాలు, తాడికొండ నుంచి 1 మార్గం, హరిశ్చంద్రాపురం నుంచి 1 మార్గం ఉన్నాయి. మరోవైపు.. రోడ్లన్నింటినీ పునరుద్ధరించేందుకు పోలీస్ శాఖ సూచన మేరకు సీఆర్డీఏ చర్యలు చేపట్టింది. ఇక, ట్రాఫిక్ జామ్ లేకుండా పోలీస్ శాఖ అవసరమైన చర్యలు తీసుకుంటోంది. రోడ్ షో కోసం రహదారుల పునరుద్ధరణ వేగంగా కొనసాగుతోంది. భద్రతాపరమైన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే తుది దశకు చేరుకున్నాయి.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com