తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల్లో ఏఐ (కృత్రిమ మేథ – ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) ఆధారిత విద్యా బోధనకు శ్రీకారం చుడుతోంది. మొదట్లో ఎంపిక చేసిన కొన్ని సర్కారీ స్కూళ్లలో ఈ బోధనను ప్రారంభించబోతున్నారు. ఈనెల 15వ తేదీ నుంచే ఏఐ ఆధారిత బోధన ప్రారంభం కానుంది. సులభంగా విద్యా బోధన చేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తోడ్పడుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈమేరకు ఆయా పాఠశాలల్లో చేయాల్సిన ఏఐ ఆధారిత బోధనకు సంబంధించి చర్యలు చేపట్టారు. ఈ విషయాన్ని విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఆయా జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రకటించారు.
పాఠశాల విద్యార్థుల పరిజ్ఞానం, నైపుణ్యం పెరిగేందుకు చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల పఠన సామర్థ్యాలను పెంచేందుకు ఏఐ ఆధారిత విద్యను అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఫిబ్రవరిలోనే పైలట్ ప్రాజెక్టు కింద ఆరు జిల్లాల్లో ప్రయోగాత్మక బోధన ప్రారంభించారు. ఈ ప్రోగ్రామ్ మంచి ఫలితాలు ఇవ్వడంతో ఇకపై ఆయా స్కూళ్లలో ఈ బోధనను కంటిన్యూ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రయోగాత్మకంగా ఏఐ బోధన మొదలైన పాఠశాలలు చూస్తే.. మెదక్ జిల్లాలోని బూర్గుపల్లి, మాసాయిపేట , నిజాంపేట,తూప్రాన్, కాళ్లకల్, నర్సాపూర్, మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ స్ఎంపికయ్యాయి. అలాగే, భద్రాద్రి జిల్లాలోని హనుమాన్ బస్తి, కేటీపీఎస్ కాలనీ, వికలాంగుల కాలనీ, తాత గుడి సెంటర్, పాలకొయ్య తండా, ఓల్డ్ కొత్తగూడెం ప్రైమరీ స్కూల్‌ను ఎంపిక చేశారు. ఖమ్మం జిల్లాలో ఎన్ఎస్‌సీ ఖమ్మం, మల్లెమడుగు, పాండురంగాపురం, సత్తుపల్లి, సింగారెడ్డిపాలెం, రాజేంద్రనగర్ ప్రైమరీ స్కూల్స్ ఎంపికయ్యాయి. అలాగే, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని జనతానగర్, కొంపల్లి, ప్రగతి నగర్, మల్లాపూర్, ఎల్లమ్మ బండ, బహదూర్‌పల్లి స్కూళ్లను ఎంపిక చేశారు. ఇక, నారాయణపేట్ జిల్లాలో చూస్తే.. గూడె బెల్లూర్, ముడుమల్, కొల్లంపల్లె, దామరగిద్ద, కర్ని, శివాజీ నగర్ స్కూళ్లు ఎంపికయ్యాయి. అటు.. వికారాబాద్ జిల్లాలో ఓల్డ్ తాండూర్ తెలుగు మీడియం స్కూల్, దౌల్తాబాద్, కొట్ బాస్‌పల్లి, రేగడ్‌మేల్వేర్, మల్కాపూర్‌గని, తాండూర్ ఉర్దూ మీడియం స్కూళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యను అందించే ప్రోగ్రామ్ అమలు చేశారు. ఈ ప్రోగ్రామ్ మంచి ఫలితాలను ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదివే విద్యార్థులకు కనీస విద్యా ప్రమాణాలు, అభ్యాస సామర్థ్యాలు పెంపొందించేందుకు ప్రతి జిల్లాలో కొన్ని ప్రాథమిక పాఠశాలలను ఎంపిక చేశారు. ఆయా జిల్లాల్లో ముందస్తుగా ఎంపిక చేసిన పాఠశాలల్లో వెనుకబడిన విద్యార్థులకు ఏఐ వినియోగిస్తూ సులభతరంగా విద్యా బోధన చేయాలని నిర్ణయించారు. ఏఐ కోర్సు ద్వారా విద్యార్థులకు బోధన చేసేందుకు వీలుగా ప్రతి పాఠశాలలో ఐదు కంప్యూటర్లు, అవసరమైన ఇంటర్నెట్ కనెక్షన్, హెడ్‌ఫోన్స్ ఇతర సామాగ్రి అందుబాటులో ఉండేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ కార్యదర్శి యోగిత రాణా సూచించారు. జిల్లాలో ముందుగా ఎంపిక చేసిన పాఠశాలలో ఏ ఏ కోర్సు ద్వారా విద్య బోధన జరుగుతుందని, ఇక్కడ వచ్చే ఫలితాలను అంచనా వేస్తూ భవిష్యత్తులో దీన్ని మరింత విస్తరించేందుకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఇక ఏఐ ద్వారా విద్యార్థి సామర్థ్యం పెంపొందించే విషయంలో ఏఐ ముఖ్య భూమిక పోషించనుంది. వారి సామర్థ్యం మెరుగుపరిచే విధానంలో ఏఐ ఎంతగానో ఉపయోగపడనుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.