37.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

ఢిల్లీలో ఆప్‌, బీజేపి మేనిఫెస్టో వార్

  • మోడీ కా గ్యారంటీస్ వర్సెస్  కేజ్రీవాల్‌ కా గ్యారంటీస్
  • ఆరు నయా ప్రామిస్ లతో కేజ్రీవాల్‌ తాజా మేనిఫెస్టో
  • మహిళలు, విద్యార్ధులే టార్గెట్‌ గా మేనిఫెస్టోలు
  • ఉచితాలు, రాయితీల జల్లు కురిపించిన ఆప్ అధినేత
  • వచ్చే నెల 5న ఎన్నికలు, 8న ఫలితాలు

పట్టుమని పదిరోజులైనా లేని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీల మధ్య మేనిఫెస్టోల యుద్ధం కొనసాగుతోంది. బీజేపి సంకల్ప పత్రకు పోటీగా ఆప్‌ ఇవాళ మరో తాజా మేనిఫెస్టోను ప్రజలకు విడుదల చేసింది. అందరికీ ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించడమే కాదు, విద్యార్ధులు, స్కూలుకు వెళ్లే పిల్లలకోసం మెట్రో టిక్కెట్లలో 50 శాతం రాయితీ కల్పిస్తోంది. బీజేపీ మోడీకీ గ్యారంటీస్ నినాదంతో మేనిఫెస్టోను ప్రకటిస్తే అందుకు పోటీగా ఆప్‌ కేజ్రీవాల్‌ కీ గ్యారంటీస్ పేరుతో 15 కొత్త వాగ్దానాలను ప్రకటించింది. అయితే కొత్త జాబితాలో అనేక పాత వాగ్దానాలను పునరుద్ఘాటించారు.

ఆప్‌ ను గెలిపిస్తే అర్హులైన మహిళా లబ్దిదారులందరికీ వారి అక్కౌంట్లలోకి నేరుగా రూ.2,100 నగదును బదిలీ చేస్తామని, అలాగే మహిళలు, మహిళా విద్యార్థినులకు సిటీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని, మెట్రోలో 50 శాతం రాయితీపై ప్రయాణాన్ని కల్పిస్తామన్నారు. ఇవేకాక మరో ఐదేళ్ల కోసం ఆప్‌ గ్యారంటీల చిట్టాను విడుదల చేశారు. అవేంటంటే..

  • అర్హులందరికీ ఉద్యోగాల కల్పన
  • మహిళా సమ్మాన్ యోజనా కింద ప్రతీ మహిళకు నెలకు రూ.2,100 ఆర్ధిక సాయం
  • వైద్య చికిత్సల కోసం సంజీవనీ స్కీమ్
  • తాగునీటికి సంబంధించి అధిక బిల్లుల రద్దు
  • యమునా నదిని శుభ్రపరుస్తాం
  • 24 గంటలూ రక్షిత మంచి నీటి సరఫరా
  • యూరోపియన్ ప్రమాణాలతో మెరుగైన రోడ్ల నిర్మాణం

వీటిలో చాలా మటుకు గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలే అయినా నెరవేర్చలేకపోయామని, కరోనాతో రెండున్నరేళ్లు, ఆపై తన మంత్రివర్గంపైనా, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను, తనను కక్ష గట్టి కేంద్రం వేధింపులకు గురిచేయడం వల్ల హామీల అమలు సాధ్యం కాలేదన్నారు.

అలాగే విద్యార్ధుల చదువు ఖర్చును భరించేందుకు అంబేద్కర్ స్కాలర్‌ షిప్ స్కీమును అమలు చేస్తామన్నారు. దీనివల్ల చదువుపై ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీల్లో ఉచితంగా చదువు, ప్రయాణం, వసతి సౌకర్యం పొందవచ్చని కేజ్రీవాల్‌ తెలిపారు. ఆలయాలు , గురుద్వారా పురోహితులకు నెలకు రూ.18 వేల జీతం ఇస్తామన్నారు.

ఆప్‌, బీజేపి మధ్య మేనిఫెస్టో వార్..

ఎన్నికలు దగ్గర పడుతున్న కోద్దీ ఆప్‌, బీజేపి మేనిఫెస్టోల వేడిని పెంచాయి. రెండు పార్టీలు మహిళలు, బలహీన వర్గాలు, విద్యార్ధుల ఓటు బ్యాంకుపై దృష్టి పెట్టాయి. ఈసారి విద్యార్ధులను ఫోకస్ చేస్తూ పెద్ద ఎత్తున రాయితీల ఆశపెట్టాయి. గత వారం బీజేపి తన మేనిఫెస్టోలో అర్హులకు ప్రీస్కూల్ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య అందిస్తామని,పోటీ పరీక్షలకు వెళ్లేవారికి నెలకు 15వేల రూపాయల ఆర్ధిక సాయంతో పాటు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ప్రకటించింది. అలాగే ప్రొఫెషనల్ కోర్సులు చదివే షెడ్యూల్డు కులాలు, తెగల వారికి వెయ్యిరూపాయలు పారితోషికం ఇస్తామని బీజేపి ప్రకటించింది.

అయితే దీనిపై కేజ్రీవాల్ స్పందిస్తూ బీజేపి అర్హులైన వారికి అని ప్రకటించిందని, తాము అందరికీ అందిస్తామని నొక్కి మరీ ప్రచారం చేస్తున్నారు. 71 లక్షలమంది ఉన్న ఢిల్లీ ఓటర్లలో మహిళా ఓటర్లు 46 శాతం ఉన్నారు. అందుకే రెండు పార్టీలు మహిళా ఓటర్లపై దృష్టి పెట్టాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com