యూపీలో పోలీసులకు చిక్కిన వెరైటీ దొంగ
జరిగితే జరమంత సుఖం లేదన్నది నానుడి. రాజస్థాన్ కు చెందిన ఓ యువకుడు వెరైటీశైలిలో దొంగతనాలకు పాల్పడ్డాడు. దొంగతనాలు, చిల్లర మల్లర నేరాలు… వాటితో విలాసవంతమైన జీవితం.. బంధువుననీ 30ఏళ్ల క్రితం తప్పిపోయానని చెప్పి అమాయకుల పంచన చేరి వారి ఇంట్లో పబ్బం గడుపుకోవడం.. వారికి తన నిజ స్వరూపం తెలియగానే అక్కడ నుంచి జారుకుని మరో ఇల్లు వెతుక్కోవడం ఇలా నయా మోడస్ ఆపరండీతో దర్జాగా బతుకుతున్న ఓ దొంగ ఎట్టకేలకు దొరికిపోయాడు. యూపిలోని ఘజియాబాద్లో ఓ కుటుంబాన్ని మోసగించబోయి చివరకు పోలీసుల పాల బడిన ఓ విచిత్ర దొంగ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్ కు చెందిన రాజు అలియాస్ ఇంద్రరాజ్ అలియాస్ భీమ్ అనే రాజస్థానీ పోలీసులను ఆశ్రయించాడు. తన 7 ఏళ్ల వయసులో తప్పిపోయినట్లు తన కుటుంబాన్నివెతుక్కోడానికి సాయం చేయాలని పోలీసులను అభ్యర్ధించాడు. ఆతని మాటలు నమ్మిన పోలీసులు అతగాడి వివరాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి విపరీతమైన ప్రచారం కల్పించారు. అంతేకాదు రాజుకు వారం రోజుల పాటు ఆశ్రయం కూడా ఇచ్చారు. రాజు చెప్పినవివరాలు నమ్మిన ఓ కుటుంబం పోలీస్ స్టేషన్ కు వచ్చి తమ కొడుకేనని నమ్మి తమ వెంట తీసుకెళ్లింది. 30 ఏళ్లతర్వాత సొంత కుటుంబాన్ని కలవడం ఆనందంగా ఉందంటూ రాజు కూడా సంబరంగా ఎమోషనల్ వ్యాఖ్యలు చేశాడు. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి రాజు కదలికలను గమనించిన కుటుంబం… అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులకు సమాచరమిచ్చింది. పోలీసులు రాజుకు డిఎన్ఏ టెస్టులు చేయడంతో అసలు రంగు బయట పడింది. దాంతో అరెస్టు చేశారు. అయితే దర్యాప్తులో రాజుకు ఉన్న దొంగతనాల అలవాటును అసహ్యించుకునే ఆతని కుటుంబం ఇంటి నుంచి తరిమేసిందని తెలిసింది. బంధువుల ఇళ్లకు వెళ్లి దొంగతనాలు చేస్తుండటంతో సొంత కుటుంబమే 2005లో రాజును ఇంటినుంచి తరిమేసింది. అయితే రాజు అప్పటినుంచి తన గెటప్, ఐడెంటిటి మార్చుకుని ఇప్పటి వరకూ 9 వేర్వేరు కుటుంబాలతో ఇదే సీన్ కంటిన్యూ చేశాడు. జాలి పడి ఆదరించిన వారి ఇళ్లలో చేరి వారి ఆస్తి పాస్తులను ఆరా తీయడం ఆపై కాజేయడం ఆనవాయితీగా మారింది. దాంతో విసిగిపోయిన ఆ కుటుంబాలు తన్ని తరిమేసాయి. అలా దాదాపు 5 చోట్ల రాజు తన ఐడెంటిటీ మార్చి మోసం చేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే తన తల్లి చిన్నప్పుడే చనిపోయిందని, కేవలం తిండి, జరుగుబాటుకోసమే తానీ పని చేశానని నిందితుడు తెలిపాడు.