35.2 C
Hyderabad
Wednesday, April 22, 2026

Live Video

spot_img

ఈ టీమ్‌తో అయ్యే పనేనా?

ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం టీమ్‌ను ప్రకటించేసింది బీసీసీఐ. సెలెక్టర్లు కొన్ని రోజులుగా తలలు పట్టుకొని మరీ తీర్చిదిద్దిన లిస్ట్‌ను ఎట్టకేలకు బయట పెట్టేసింది. రోహిత్ శర్మ సారథ్యంలోనే ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం ఫైట్ చేయనుంది టీమ్ ఇండియా. ముందుగా టీమ్‌లో ఎవరున్నారో చూద్దాం.
రోహిత్ శర్మ (C), శుభ్‌మన్ గిల్ (VC) విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్‌ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, షమీ, జైశ్వాల్, రవీంద్ర జడేజా, రిషబ్‌ పంత్‌. టీమ్‌ను అబ్జర్వ్‌ చేస్తే నలుగురు స్పిన్నర్లు, ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. ఇందులో నలుగురు ఆల్‌రౌండర్లు. ఈ కూర్పు కూడా కాస్త విచిత్రంగా ఉంది.

ఫెయిలైనా మళ్లీ వాళ్లే..
ఇదే చాంపియన్స్‌ ట్రోఫీ కోసం బీసీసీఐ సెలెక్ట్‌ చేసిన టీమ్. ఇందులో పెద్దగా సంచలనాలు లేవనే చెప్పాలి. ఎందుకంటే BGT సిరీస్‌లో ఎవరైతే ఫ్లాప్‌ షో చేశారో.. వారినే మళ్లీ సెలెక్ట్ చేసింది BCCI. ఫెయిల్యూర్‌గా మిగిలిన రోహిత్‌, కోహ్లీలను కొనసాగించింది. రోహిత్‌ అయితే ఓపెనర్‌గా ఫెయిలయ్యాడు.. మిడిల్‌ ఆర్డర్‌లో వచ్చి అంతకన్నా దారుణంగా ఫెయిలయ్యాడు. అసలు ఏ మాత్రం ప్రభావం చూపని కేఎల్ రాహుల్, రిషబ్ పంత్‌, శుభ్‌మన్‌ గిల్‌లను కంటిన్యూ చేసింది బీసీసీఐ. ఈ సెలక్షన్‌తో బీసీసీఐ ఇస్తున్న సందేశమేంటనేది అర్ధం కావడం లేదు. ప్రస్తుత టీమ్‌ కూర్పు చూస్తుంటే ఛాంపియన్స్‌గా నిలవాలన్న కసి కనిపించడం లేదు సరికదా.. మరోసారి వీరందరికి ఓ చాన్స్‌ ఇచ్చి చూద్దాం అనే తీరుగా ఉంది. యశస్వి జైశ్వాల్‌ను కొనసాగించడం మాత్రం మంచి నిర్ణయమనే చెప్పాలి.

తెలుగువాళ్లకు మొండి చేయి..
సీనియర్ ప్లేయర్లంతా ఒక్కొక్కరుగా పెవిలియన్‌లో పని ఉన్నట్టు వెనుదిరుగుతున్న సమయంలో.. టీమ్‌ ఇండియా ఓటమి అంచున ఉన్నప్పుడు.. 8వ స్థానంలో వచ్చి అద్భుతమైన సెంచరీ చేసి ఓటమి అవమానాన్ని తప్పించాడు నితీష్‌ కుమార్ రెడ్డి. అలాంటి నితీష్‌ను తీసి పక్కన పెట్టేసింది బీసీసీఐ. తిలక్‌ వర్మకు కూడా చోటు ఇవ్వలేదు. వర్మ కూడా చాన్స్‌ వచ్చిన ప్రతిసారి తన సత్తా ఏంటో బ్యాట్‌తోనే రుచి చూపించాడు. పరుగుల వరద పారించాడు. ఇక మహ్మద్‌ సిరాజ్‌ను కూడా పక్కన పెట్టేశారు. BGT సిరీస్‌లో మోస్ట్ అండర్ రేటేడ్ ప్లేయర్ ఎవరైనా ఉన్నాడంటే అది సిరాజే. కాస్త పరుగులు ఇచ్చినా.. వికెట్లు తీస్తూనే వచ్చాడు సిరాజ్. అలాంటి సిరాజ్‌ను కూడా పక్కన పెట్టేసింది. మరి ఈ లాజిక్‌ ఏంటో బీసీసీఐ పెద్దలకే తెలియాలి. వరుస సెంచరీలు చేసిన సంజూ శాంసన్, తిలక్ వర్మ.. తీవ్ర ఒత్తిడిలో సెంచరీ చేసిన నితీష్‌ రెడ్డి ఎందుకు కనిపించలేదో మరి. కానీ అనూహ్యంగా అస్సలు ఊహకందని శ్రేయస్ అయ్యర్‌ పేరు మాత్రం ఫైనల్‌ లిస్ట్‌లో కనిపించడం మరో హైలేట్. గతేడాది ఆగస్టులో జరిగి శ్రీలంక సిరీస్‌లో దారుణంగా విఫలమయ్యాడు అయ్యర్. అప్పటి నుంచి అతడిని పక్కన పెట్టేశారు. ఆ తర్వాత అతడిని ప్రూవ్‌ చేసుకునే అవకాశం కూడా రాలేదు. మరి అతడి సెలెక్షన్‌ వెనక రీజన్సేంటి అనేది ఇప్పుడో మిస్టరీ. ఐపీఎల్ వేలం ఏదైనా ప్రభావం చూపించిందేమో మరి.

బీసీసీఐ ప్లానేంటి? గాయాలైన వారికే చాన్స్ ఎందుకు?
జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్‌ షమీ.. వీరి పేర్లు లిస్ట్‌లో కనిపించగానే చాలా మంది ఫ్యాన్స్‌లో ఓ సంతోషం కనిపించిందనే చెప్పాలి. కానీ కొందరిలో డౌట్స్‌ మాత్రం అలానే ఉన్నాయి. షమీ గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకున్నాడు. బుమ్రా పరిస్థితి ఏంటన్నది మిస్టరీగానే ఉంది. అతను అప్పటి వరకు కోలుకుంటాడనే కాన్ఫిడెన్స్‌తోనే టీమ్‌లో చేర్చింది బీసీసీఐ. ప్రస్తుతం బెంగళూరులోని NCAలోనే రికవరీ అవుతున్నాడు. మరి బుమ్రా పూర్తిగా కోలుకోకపోయినా.. షమీ అంచనాలను అందుకోకపోయినా.. అంతే సంగతులు.

ఆల్‌రౌండర్లు అందుకేనా?
ప్రస్తుతం ప్రకటించిన టీమ్‌లో నలుగురు ఆల్‌రౌండర్లు ఉన్నారు. నలుగురిని తీసుకోవడం వెనక మాత్రం ఓ స్ట్రాటజీ కనిపిస్తోంది. ఒకవేళ టాప్‌ ఆర్డర్‌ విఫలమైతే వీరైనా ఆదుకుంటారన్న భరోసాతోనే సెలెక్టర్ ఈ సాహాసం చేసినట్టు కనిపిస్తోంది.

దిగ్గజాల కోసమేనా ఈ త్యాగం?
రోహిత్ శర్మ, విరాట్‌ కోహ్లీ కోసం బీసీసీఐ ఏమైనా త్యాగం చేసిందా? అనే క్వశ్చన్‌ ఇప్పుడు తెరపైకి వస్తోంది. వారిద్దరిని అట్టిపెట్టుకునేందుకు కొందరు యంగ్‌స్టర్స్‌కు చోటు ఇవ్వలేదా? అనే చర్చ మొదలైంది. ప్రస్తుతం దారుణమైన ఫామ్‌లో ఉన్న ప్లేయర్స్ అంతా తమ ఫ్లాప్ షోను కంటిన్యూ చేస్తే మాత్రం టీమిండియాపై ఓ మాయని మచ్చ పడటం ఖాయం. అంతేకాదు అత్యంత అవమానకరమైన పరిస్థితుల్లో టీమ్‌ను వీడాల్సి ఉంటుంది కొందరు దిగ్గజాలు. మరి ఇంత సాహసం చేసి.. కొందరికి అన్యాయం చేసి మరీ సెలెక్ట్ చేసిన ఈ టీమ్‌ ఛాంపియన్స్‌ ట్రోఫిని ఇంటికి తీసుకురావాలని ఆశిద్దాం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com