- 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలు, 20 లక్షల మందికి స్వయం ఉపాధి కల్పన
- పోటీ పరీక్షలకు వెళ్లే వారికి 15వేల ఆర్ధిక సాయం, ఫ్రీబస్ సర్వీస్
- టెక్నికల్ కోర్సులు చదివే షెడ్యూల్డుకులాల పిల్లలకు నెలకు రూ. వెయ్యి నగదు
- పాకిస్తానీ శరణార్దుల కాలనీలకు వసతి సౌకర్యం
- ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వరాల జల్లు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపి తన వాగ్దానాల పరంపరను కొనసాగించింది. మొదట్లో రెండు సంకల్ప పత్రాలను ప్రకటించిన బీజేపి అధిష్టానం ఫిబ్రవరి 5న జరిగే ఎన్నికల కోసం తన మేనిఫెస్టో పార్ట్ 3ని ఇవాళ విడుదల చేసింది. మొదటి సంకల్ప పత్రంలో ఢిల్లీలో ప్రస్తుతం అమలవుతున్న అన్ని సంక్షేమపథకాలను కొనసాగిస్తామని మాత్రమే చెప్పింది. ఇక రెండో సంకల్ప పత్రం రిలీజ్ నాటికి ఫ్రీబీల జోరు మరింత పెంచింది. పిల్లలకు ప్రీస్కూల్ నుంచి పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ వరకూ ప్రభుత్వ విద్యా సంస్థలలో ఉచితంగా చదివిస్తామని ప్రకటించింది. అంతేకాదు పోటీ పరీక్షలకు హాజరయ్యే యువతీ యువకులకు 15 వేల నగదు, రవాణా సౌకర్యాలు కల్పిస్తాని హామీ ఇచ్చింది. దీనికి తోడు టెక్నికల్ కోర్సులు, ప్రొఫెషనల్ కోర్సులు చదివే షెడ్యూల్డుకులాల విద్యార్ధులకు నెలకు వెయ్యి రూపాయల స్టైపెండ్ కూడా ఇస్తామని ప్రకటించింది. సంకల్ప పత్ర తొలిరెండు పార్టుల హైలైట్లు ఇవి.. కాగా ఇవాళ తన సంకల్ప పత్ర మూడవ పార్ట్ ను రిలీజ్ చేసింది. తాము చేసే వాగ్దానాలన్నీ నెరవేరుస్తామని, ఊరికే శుష్క వాగ్దానాలు చేయడం లేదని హోం మంత్రి అమిత్ షా సంకల్ప పత్ర మూడో పార్ట్ రిలీజ్ కు ముందు కామెంట్ చేశారు.
సంకల్ప పత్ర పార్ట్ త్రి హైలైట్స్ ఇవే..
ఢిల్లీలో మూసేసిన 13 వేల షాపులను ఆరు నెలల్లో చట్టపరమైన అవకాశాలతో తిరిగి తెరుస్తామన్నారు. కాలనీలలో లీజు పై నివసిస్తున్న పాకిస్థానీ శరణార్ధులకు ఆ ఇళ్లపై హక్కు కల్పిస్తామన్నారు. గిగ్ వర్కర్ల కోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామని, వారికి పదిలక్షల హెల్త్ ఇన్సూరెన్సు, 5 లక్షల పాయల విలువైన యాక్సిడెంట్ కవరేజ్, ఇవ్వడంతో పాటు వారి పిల్లలకు అదనపు సౌకర్యాలు కల్పిస్తామని బీజేపి తన సంకల్ప పత్రలో హామీ ఇచ్చింది. యువత కోసం 50 వేల ప్రభుత్వోద్యోగాలు కల్పిస్తామని, 20 లక్షల స్వయం ఉపాధి మార్గాలను కల్పిస్తామని బీజేపి ప్రామిస్ చేసింది. అనధికార కాలనీలలో నివసిస్తున్న వారికి ఆ ఇళ్లపై ఆస్తి హక్కులను కల్పిస్తామని, ఆ ఇళ్లను అమ్మడం, కొనడం, నిర్మించడం లాంటివి చేసుకునేలా అనుమతులిస్తామని బీజేపి ప్రకటించింది. అదనంగా 13 వేల బస్సులను ప్రవేశపెట్టి ఢిల్లీని వంద శాతం ఈ- బస్ సిటీగా మారుస్తామని తెలిపింది. యమునా నదిని మూడేళ్లలో శుభ్రపరుస్తామని, సబర్మతి రివర్ ఫ్రంట్ ను కూడా యమునా రివర్ ఫ్రంట్ అంత సుందరంగా మారుస్తామని బీజేపి ప్రకటించింది. మాన్యువల్ స్కావెంజింగ్‌ను వంద శాతం నిషేధిస్తామని కమలదళం ప్రకటించింది. తమను గెలిపిస్తే తొలి కేబినెట్ మీటింగ్ లోనే ఆయుష్మాన్ భారత్ స్కీమును అమలు చేస్తామంది.
మిత్ర పక్షాలకి రెండు సీట్లు
ఢిల్లీలో మొత్తం 70 సీట్లకు అభ్యర్ధులను ప్రకటించిన బీజేపి అందులో రెండుసీట్లు ఎన్డీఏ మిత్రపక్షాలకు కేటాయించింది. బురారీ సీటు నుంచి జేడీయు అభ్యర్ధి శైలేంద్ర కుమార్, డిలోయ్ నియోజక వర్గంలో ఎల్జేపి అభ్యర్ధి బరిలోకి దిగుతున్నారు. కీలక సీట్లయిన కరోల్ బాగ్, రాజౌరీ గార్డెన్, గాంధీ నగర్ లలో దుష్యంత్ గౌతమ్, మంజీదర్ సింగ్ సిర్సా, అరవిందర్ సింగ్ లవ్లీ లను బరిలో నిలిపింది.
ఇక కీలకమైన న్యూఢిల్లీ సీట్ లో ముక్కోణపు పోటీ నెలకొంది. అక్కడ ఆప్ అధినేత కేజ్రీవాల్ రంగంలో ఉండగా బీజేపి నుంచి పర్వేష్ వర్మ, కాంగ్రెస్ నుంచి షీలాదీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ బరిలో నిలిచారు. ఇక సీఎం అతిషి పోటీ చేస్తున్న కాల్కాజీలో ఆమెకు ప్రత్యర్ధిగా రమేష్ బిదురి నిలిచారు. 2020 నాటి ఎన్నికల్లో 70కి 62 సీట్లు గెలిచిన ఆప్ పార్టీ ఈసారి కూడా అన్ని సీట్లకు పోటీ చేస్తూ అందరికన్నా ముందే అభ్యర్ధులను ప్రకటించింది. కాంగ్రెస్ 68 సీట్లకు పొటీ చేస్తోంది. ఫిబ్రవరి 5న సింగిల్ ఫేజ్ లో జరిగే ఈ ఎన్నికల ఫలితాలు అదేనెల 8వ తేదీన వెలువడతాయి.