అటు ప్రజలకు కానీ.. ఇటు ప్రతిపక్ష పార్టీలకు కానీ అంతెందుకు సొంత పార్టీకి చెందిన నేతలకు కానీ ఎటువంటి అంచనాలు లేకుండా దావోస్ వెళ్లిన తెలంగాణ రైజింగ్ బృందం అక్కడ నిశ్శబ్ద యుద్దం చేసి అజేయంగా నిలిచి వచ్చింది. ఎవరూ ఊహించినంత పెట్టుబడులు సమీకరించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుల బృందం విమర్శకుల అందరి నోళ్ళు మూయించింది. అక్షరాలా లక్షా డభ్బై ఎనిమిది వేల తొమ్మొది వందల యాభై కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణకి రాబట్టారు. వాస్తవానికి దావోస్‌లో జరిగే ఎకనామిక్ సమ్మిట్ కంటే ముందే సీయం రేవంత్‌రెడ్డి, మంత్రి దుద్దిళ్ళి శ్రీధర్‌బాబుల బృదం సింగపూర్‌లో మూడు రోజులు పర్యటించి పలు విద్యా సంస్ధలతో ఒప్పందాలు చేసుకున్నారు… సెమీ కండకర్టల తయారీ పరిశ్రమలతో తెలంగాణలో పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అంటే దావోస్‌కి ముందే తెలంగాణ రైజింగ్ బృదం పెట్టుబడుల వేట సింగపూర్ నుంచే ప్రారంభించింది. ఇక దావోస్ వెళ్లాక సహజసిద్దంగా హైదరాబాద్‌కి ఉన్న అడ్వాంటేజ్‌లను ఆసరా చేసుకుని లక్షా78 వేల కోట్ల పైచిలుకు పెట్టుబడులకు అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇక దావోస్ సమ్మిట్ ముగిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ తిరుగు ప్రయాణమైనా ఒప్పందాలను కన్సాలిడేట్ చేసుకోవడానికి ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుని మరో రెండు రోజుల పాటు దావోస్‌లోనే ఉండిపోయారు. గురువారంతో దావోస్ సమ్మిట్ ముగిసిపోయినా శుక్ర, శనివారాలు కూడా శ్రీధర్ బాబు దావోస్‌లో పెట్టుబడుల వేట కొనసాగిస్తున్నారు. జ్యూరిచ్‌లోని డ్రీమ్ ల్యాబ్ టెక్నాలజీస్ నుండి నిక్ మేయెన్‌కోర్ట్‌తో మంత్రి శ్రీధర్ బాబుతో శుక్రవారం భేటీ అయ్యారు. ఈ కంపెనీతో పాటు ఇంకా పలు సంస్ధలు తెలంగాణ లో పెట్టుబడులు పెట్టడంతో పాటు వివిధ రంగాల్లో భాగస్వామ్యం అయ్యేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు శ్రీధర్ బాబు తెలిపారు.