- ఇక ఫీల్డ్ లోకి రేవంత్ రెడ్డి
- ఈనెల 26 నుంచి జిల్లాల్లో పర్యటనలు
- పార్టీ ,ప్రభుత్వ వ్యవహారాలపై దృష్టి సారించిన రేవంత్ రెడ్డి
- స్పీడ్ పెంచకపోతే చర్యలు తప్పదు
- స్థానిక ఎన్నికలే గీటురాయి
పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలపై మరింత దృష్టి సారించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. దావోస్ పర్యటనలు విజయవంతంగా ముగించుకొని శుక్రవారం హైదరాబాద్ కు చేరుకున్న రేవంత్ రెడ్డి అందుబాటులో ఉన్న ముఖ్య నేతలు మంత్రులతో భేటీ అయ్యారు. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసి ఏడాది పూర్తి కావడం… సంక్షేమ పథకాలకు సంబంధించి ఈ నెల 26న 4 కొత్త పథకాలను అమలు చేయబోతున్న నేపథ్యంలో ఇటు పార్టీ అటు ప్రభుత్వంలో ఉన్న కొంత అలసత్వాన్ని తొలగించాలనే అభిప్రాయానికి రేవంత్ రెడ్డి వచ్చినట్టుగా తెలిసింది.
ప్రభుత్వ ఇమేజ్‌ను పెంచే విషయంలో ఇటు పార్టీలో అటు ప్రభుత్వంలో కొంత కమ్యూనికేషన్ లోపాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ముఖ్యంగా పార్టీ పరంగా ఉన్న మైనస్లు దూరం చేసేందుకు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు రేవంత్‌రెడ్డి డైరెక్షన్స్ ఇచ్చారు. పార్టీ పదవులు అనుభవిస్తున్న వారు కేవలం కుర్చీలకే పరిమిత అవుతున్నారు తప్ప ప్రజల్లోకి వెళ్లడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇక స్పీడ్ పెంచాల్సిందేనని ఆయన అంటున్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై వేటు వేయడం ఖాయం అనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పాలని సీయం పిసిసి నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు.
ఇక ప్రభుత్వ విషయానికొస్తే కొందరు అధికారులు అదేవిధంగా కొందరు మంత్రులు ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని రేవంత్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కొన్ని సర్వే రిపోర్ట్ లు కూడా వచ్చిన నేపథ్యంలో వీక్ పెర్ఫార్మన్స్ ఉన్న మంత్రులతో త్వరలో విడివిడిగా భేటీ అయ్యి… పనితీరు మెరుగుపరచుకోవడానికి కొన్ని సూచనలు చేయాలని భావిస్తున్నారు. అలాగే ప్రభుత్వానికి సహకరించని అధికారులకు కూడా తుది హచ్చరికలు జారీ చేసి అప్పటికీ వారు దారిలోకి రాకపోతే కఠినంగా వ్యవహరించాలని సీయం ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెపుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం పూర్తయ్యింది సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో ఎక్కడా వెనకడుగు వెయ్యకుండా అన్నీ అమలు చేస్తున్నాం… గత ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సహాయం కన్నా కొంత పెంచి ఇస్తున్నాం… అయినా రావాల్సిన మంచిపేరు ప్రభుత్వానికి రాకపోవడానికి సరిగా ప్రచారం చేసుకోకపోవడమే కారణమని సీయం రేవంత్‌రెడ్డి భావిస్తున్నారు. కొందరు మంత్రులు, శాసనసభ్యులు, నామినేటెడ్ పదవులు అనుభవిస్తున్న నేతలు ప్రభుత్వ పథకాలకు సరైన ప్రచారం కల్పించలేకపోతున్నారని సీయం ఆగ్రహంతో ఉన్నారు.
అలాగే పలువురు శాసనసభ్యులు మీడియా ముందకు వచ్చి ఇష్టానుసారం మాట్లాడటం… ప్రతిపక్షాల విమర్శలకు పార్టీ నాయకులతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం రియాక్ట్ కాకపోవడంపై కూడా సీయం అసహనంగా ఉన్నట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారాలన్నీ చక్కబెట్టి అందర్నీ పట్టాలెక్కించాలనే సంకల్పంతో సీయం ఉన్నట్లు తెలుస్తోంది. ఈమేరకు దావోస్ బయలుదేరే ముందు ఢిల్లీలో అధిష్టానం పెద్దలను కలసి రాష్ట్రంలో ప్రభుత్వ, రాజకీయ పరిస్ధితులు, తీసుకోబోయే చర్యలు అన్నీ వివరించి వారి అనుమతి పొందినట్లు సమాచారం. తాను కూడా పూర్తిగా ప్రజల్లో ఉండాలన్న అభిప్రాయంతో ఉన్న రేవంత్ రెడ్డి ఈనెల 26 నుంచి ప్రజల్లోకి వెళ్ళనున్నారు. సంక్షేమ పథకాల అమలు కార్యక్రమాల ప్రారంభంతో పాటు అవసరమైతే కొన్ని జిల్లాల్లో నిద్ర చేసి ఇటు పార్టీ అటు ప్రభుత్వ వ్యవహారాలను స్వయంగా పరిశీలించాలని ఆయన భావిస్తున్నారు. దావోస్ నుంచి అనుకున్నదాని కంటే ఎక్కువ పెట్టుబడులు రాబట్టడం ద్వారా రెట్టించిన ఉత్సాహంతో హైదరాబాద్‌లో అడుగుపెట్టిన సీయం రేవంత్ రెడ్డి ఇక ప్రభుత్వాన్ని, పార్టీనీ సమన్వయపరచుకుంటూ తనదైన ముద్ర వేసుకోవాలనే సంకల్పంతో వ్యూహరచన చేయనున్నట్లు ఆయన సన్నిహితులు చెపుతున్నారు.