చత్తీస్ గఢ్ అడవుల్లో ఎన్ కౌంటర్ ఘటనలో కొత్త కోణం
భార్యతో దిగిన సెల్ఫీయే కొంప ముంచింది
దశాబ్దాల క్రితం భార్యతో చలపతి సెల్ఫీ
పోలీసులకు దొరికిన క్లూ…
కోటి రూపాయల రివార్డున్న మావోయిస్టు హతం
2026కల్లా నక్సల్ రహిత భారత్
ఒక్కోసారి చిన్న చిన్నక్లూలే పెద్ద పెద్ద సంఘటనలకు దారి తీస్తాయి. పెనుసంచలనాలకు కారణమవుతాయి. ఇటీవల చత్తిస్గఢ్ అడవుల్లో పోలీస్ ఎన్కౌంటర్ లో మావోయిస్టు చలపతి మరణం ఘటన అలాంటిదే.. ఆయన తన జీవన సహచరితో దశాబ్దం క్రితం ఓ సెల్ ఫోన్ లో తీసుకున్న సెల్ఫీ ఆయన ఆను పానులను కనిపెట్టించి చివరకు తుదముట్టించేలా చేసింది. చత్తిస్ గఢ్, ఒడిశా సరిహద్దుల్లో నాలుగు రోజుల క్రితం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో కోటి రూపాయల రివార్డు ఉన్న ఓ సీనియర్ మావోయిస్టునేత చనిపోయాడని ముందు బయటకు సమాచార మొచ్చింది. తీరా చూస్తే అతగాడే చలపతిరావు అలియాస్ జయరామ్ రెడ్డి అని పోలీసులు కనిపెట్టారు.
2008లో ఒడిశా నయాగడ్ జిల్లాలొ జరిగిన ఎన్ కౌంటర్ చలపతి తలపై రివార్డుకు కారణమైంది. పోలీసులను నక్సలైట్లు చావుదెబ్బ తీసిన సందర్భమది. ఆదమరచి ఉన్న పోలీసులపై నక్సల్స్ నలు మూలల నుంచి విరుచుకుపడి దాడి చేశారు. దీనిలో 13 మంది పోలీసులు ప్రాణాలు వదిలారు. ఆ సంఘటన పోలీసులలో పగను, ప్రతీకారాన్ని పెంచింది. నక్సల్స్ ను తుదముట్టించి ఇంతకు ఇంత ప్రతీకారం తీర్చుకుంటామని కొందరు పోలీసుల భార్యలే ప్రతిజ్ఞ చేసిన సందర్భమది. ఆ సంఘటనకు పూర్తి స్కెచ్, కర్త,కర్మ క్రియ అన్నీ చలపతి ప్లానే.
పొలీసుల ఆయుధాల లూటీ
పోలీస్ స్టేషన్ ను ముట్టడించి అందులో పోలీసుల ఆయుధాలన్నింటినీ అప్పట్లో మావోయిస్టులు ఎత్తుకు పోయారు. పైగా ఘటన జరిగిన సమయంలో పోలీసులు అక్కడకు చేరుకునే వీలులేకుండా రోడ్లపై చెట్లను కొట్టి అడ్డంగా పడేశారు. ఈ ఆలోచన అంతా చలపతిదే..
పట్టించిన సెల్ఫీ
అప్పటినుంచి అజ్ఞాతంలో దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న చలపతి తన జీవన సహచరి అరుణతో తర్వాత కాలంలో ఓ ఫోన్ లో సెల్ఫీ తీసుకున్నాడు. అప్పటికి ఆంధ్ర-ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ డిప్యూటీ కమాండర్ గా చలపతి వ్యవహరిస్తున్నారు. ఒడిశా ఎన్ కౌంటర్ ఘటన తర్వాత వీరిద్దరూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
అయితే 2016లో ఏపీలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఒక ఎన్ కౌంటర్ జరిగింది. ఆ ఘటనా స్థలంలో ఓ పాడుపడిన ఫోన్ దొరికింది. దానిని విశ్లేషించగా అందులో వీరిద్దరూ తీసుకున్నసెల్ఫీ పోలీసులకు కనిపించింది. అప్పుడే చలపతి తలపై కోటి రూపాయల రివార్డును కేంద్రం ప్రకటించింది. దాంతో చలపతి అప్పటినుంచి తన వెంట 8నుంచి పదిమంది సెక్యూరిటీ గార్డులను పెట్టుకు తిరుగుతున్నాడు.
చిత్తూరు జిల్లా వాసి
ప్రస్తుతం మావోయిస్టు కార్యకలాపాలు సద్దుమణిగిన చిత్తూరు జిల్లాయే చలపతి సొంత ఊరు. అప్పట్లో ఆయన మావోయిస్టు సెంట్రల్ కమిటీలో కీలక నేత. చత్తీస్ గఢ్ లోని బస్తర్ కేంద్రంగా ఆయన మావోయిస్టు కార్యకలాపాలు నిర్వహిస్తున్నా.. ఇటీవల కాలంలో ఆ ప్రాంతంలో ఎన్కౌంటర్లు పెరగడంతో ఓడిశా బోర్డర్ కు చేరుకుని అక్కడ నుంచి కార్యకలాపాలు జరుపుతున్నాడు. ఆ ఏరియా మావోయిస్టులకు సేఫ్ డెన్ గా మారింది. చలపతి మిలటరీ వ్యూహాలు,గెరిల్లా యుద్ధ వ్యూహాల్లో నిష్ణాతుడు.
2026కల్లా నక్సల్ రహిత భారత్
ఎన్ కౌంటర్ లో కోటి రూపాయల రివార్డు ఉన్న నేత అయిన చలపతి చనిపోవడంపట్ల హోం మంత్రి అమిత్ షా పోలీసు బలగాలను ప్రశంసించారు. 2026 కల్లా నక్సలిజంను పూర్తిగా రూపుమాపేస్తామని, ఇప్పుడు చలపతిని తుదముట్టించడంతో ఇక ఆ నిషేధిత సంస్థ కార్యకలాపాలకు పెద్ద విఘాతం కలిగినట్లేనని అన్నారు. నక్సల్ రహిత భారత దేశంగా మార్చడంలో పోలీసులు సాధించిన అతిపెద్ద విజయంగా అమిత్ షా అభివర్ణించారు. చత్తిస్ గఢ్లో ఈ ఏడాది వేర్వేరు ఎన్కౌంటర్లలో 40 మంది మావోయిస్టులు మరణించారు.