- టీ 20లో అత్యధిక వికెట్ల వీరునిగా రికార్డ్
- ప్రస్తుతం.. 95 వికెట్లతో రెండో స్థానం
టీమ్ ఇండియా యువ బౌలర్, టీ 20 ప్రధాన పేస్ బౌలర్ అర్షదీప్ సింగ్ పేరు అందరికీ తెలిసిందే. జట్టులోకి వచ్చిన అనతికాలంలోనే ఒక వెలుగు వెలిగాడు. అతి తక్కువ మ్యాచ్ ల్లో ఎక్కువ వికెట్లు తీసుకున్న బౌలరుగా ఎదిగాడు. ప్రస్తుతం 60 మ్యాచ్ ల్లో 95 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన భారత రెండో బౌలరుగా ఉన్నాడు.
ఇంగ్లండుతో ప్రారంభమయ్యే 5 టీ 20ల సిరీస్ లో ఒకవేళ 2 వికెట్లు తీస్తే 96 వికెట్లతో తొలిస్థానంలో ఉన్న యుజ్వేంద్ర చహల్ ని దాటి అగ్రస్థానం పొందుతాడు. ఒకవేళ మరో 5 వికెట్లు తీస్తే మాత్రం చరిత్ర సృష్టిస్తాడు. ఎందుకంటే భారత బౌలర్లలో ఎవరూ కూడా ఇంతవరకు టీ 20ల్లో 100 వికెట్లు తీయలేదు.
అలా తీసిన తొలి భారత బౌలరుగా అర్షదీప్ చరిత్ర సృష్టిస్తాడు. బహుశా అదీ సిరీస్ తోనే సాకారమవుతుందని అభిమానులు నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ అద్భుతమైన ఫీట్ ను జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ లాంటివాళ్లు అందుకోలేకపోయారు. యుజ్వేంద్ర చహల్ లాంటి వెటరన్ ఆటగాళ్లు 96 వికెట్లతో దగ్గరికొచ్చినా ఫామ్ లో లేక జట్టులో స్థానం కోల్పోయారు.
అయితే చహల్ 96 వికెట్లు తీయడానికి 80 మ్యాచ్ లు తీసుకున్నాడు. అయితే తను రెండు సార్లు 4 వికెట్లు, ఒకసారి 5 వికెట్లు తీశాడు. అర్షదీప్ మాత్రం రెండుసార్లు మాత్రమే 4 వికెట్లు తీశాడు. మొత్తానికి అర్షదీప్ ఇక్కడ అద్భుతాలు చేస్తే, ఛాంపియన్ ట్రోఫీలో అదరగొడతాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
టీ 20 మ్యాచ్ ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు
యుజ్వేంద్ర చహల్ 96
అర్షదీప్ సింగ్ 95
భువనేశ్వర్ కుమార్ 90
జస్ప్రీత్ బుమ్రా 89
హార్దిక్ పాండ్యా 89
అశ్విన్ 72
కుల్దీప్ యాదవ్ 69
అక్షర పటేల్ 65
రవి బిష్ణోయ్ 56
రవీంద్ర జడేజా 54 ఇలా ఉన్నారు.