- పెట్టుబడుల కోసం ఇద్దరు సీఎంల వేట
- రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ప్రజలు
రెండు తెలుగు రాష్ట్రాలకు పెట్టుబడులను తీసుకొచ్చేందుకు ఇద్దరు సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబునాయుడు నడుం బిగించారు. ఇద్దరూ కలిసి తమ బృందాలతో వేరువేరుగా దావోస్ చేరుకున్నారు. మూడురోజులు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) సదస్సులో ఎవరి రాష్ట్రం గొప్పతనాన్ని వారు వివరించేందుకు సన్నద్ధమయ్యారు.
జ్యూరిచ్ వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఐటీమంత్రి శ్రీధర్ బాబు, ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల అధికారుల బృందాలకు యూరప్ టీడీపీ ఫోరం సభ్యులు, ప్రవాసాంధ్రులు, ప్రవాస తెలంగాణీయులు ఘన స్వాగతం పలికారు. అనుకోకుండా అదే సమయంలో అక్కడే ఎయిర్ పోర్టులో ఇద్దరు సీఎంలు కలుసుకున్నారు. ఒకరినొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుని ఏపీ సీయం చంద్రబాబు ఆప్యాయంగా పలకరించి క్షేమసమాచారాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ, ఆంధ్ర నేతలందరూ పరస్పరం పలకరించుకుని ఫొటోలు తీసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులు ఆకర్షించడమే ధ్యేయంగా వారు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశంకానున్నారు.
ఇకపోతే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వనరులు, అవకాశాలు, ప్రభుత్వ ప్రోత్సహాలు వీటన్నింటిని అక్కడ పారిశ్రామిక వేత్తలకు వివరించనున్నారు. అయితే ఎవరికి వారు తమ రాష్ట్రానికే ఎక్కువ పెట్టుబడులు వస్తాయనే ధీమాతో ఉన్నారు. దావోస్ కు వెళ్లేముందు చంద్రబాబు మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో భాగంగా తెలుగు సంతతికి చెందిన పారిశ్రామిక వేత్తలతో భేటీ అయ్యారు. అలాగే ఆయన షెడ్యూల్ కూడా ఫిక్స్ అయ్యింది. దావోస్ లో పారిశ్రామికవేత్తలతో, ఇంకా ఆర్సెలర్స్‌మిట్టల్ సంస్థ యజమాని లక్ష్మీ మిట్టల్‌తో డిన్నర్ మీట్ ఉంటుంది. కోకాకోలా, ఎల్‌జీ సహా ఇతర ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు.
అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని చూస్తే ఆయన ఒక అడుగు ముందే ఉన్నారు. ఎందుకంటే దావోస్ కి వెళ్లేముందే సింగపూర్ లో ఆయన పర్యటించారు. రూ.3500 కోట్లతో డేటా సెంటర్, అలాగే రూ.450 కోట్లతో భారీ ఐటీ పార్క్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నారు. ఇంకా సింగపూర్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్ తో చర్చలు ఫలప్రదమయ్యాయి.
అన్నింటికి మించి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సింగపూర్ ఐటీఈ ( ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్)తో తెలంగాణలోని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ ఒప్పందం చేసుకుంది. ఇలా ఎన్నో విజయాలతో ఆయన దావోస్ లో అడుగుపెట్టారు. ఏపీ సీఎం చంద్రబాబు లేట్ గా వెళ్లారు. మరి లేటెస్ట్ గా వస్తారో లేదో చూడాల్సిందే.