శిక్ష ఖరారు చేసిన సీల్దా సెషన్స్‌కోర్టు
ఆర్జీకర్ అత్యాచారం, హత్య కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కు కోల్‌కతా సీల్దా సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. గత శనివారమే సంజయ్‌రాయ్‌ని ఈ కేసులో సెషన్స్ కోర్టు దోషిగా నిర్ధారించింది. అయితే సోమవారం శిక్ష ఖరురు చేస్తామని ఆ సందర్భంగా మాట్లాడే అవకాశం ఇస్తామని కోర్టు నిందితుడికి చెప్పింది. సోమవారం సంజయ్ రాయ్‌కి జీవిత ఖైదు విధిస్తూ సీల్దా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి శిక్షను ఖరారు చేశారు. జీవిత ఖైదుతో పాటు యాభైవేల జరిమానా కూడా విధించారు. నిందితుడు సంజయ్‌రాయ్ మరణించేంత వరకూ జైలులోనే ఉండాలని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. అలాగే బాధితురాలి కుటుంబానికి 17 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని కోర్టు పశ్చిమబెంగాల్ కుటుంబాన్ని ఆదేశించింది. అత్యాచారం, హత్య జరిగిన 162 రోజుల్లో న్యాయస్ధానం తీర్పు వెలువరించింది. ఈ కేసులో సంజయ్ రాయ్ మీద భారతీయ న్యాయ సంహింత 64,66, 103(1) సెక్షన్ల కింద అత్యాచారం, హత్య కేసు నమోదు చేశారు. దీనిపై కోల్‌కత సెషన్స్ కోర్టులో నవంబర్ 12వ తేదీ నుంచి తుది విచారణ ప్రారంభమయ్యి జనవరి 9న ముగిసింది. అయితే తనను ఈకేసులో ఇరికించారని తనకూ ఈకేసుకీ ఎటువంటి సంబంధం లేదని ఆర్జీ కార్ కేసు నిందితుడు సంజయ్ రాయ్ కోర్టులో పేర్కొన్నాడు. గతేడాది ఆగస్టు 9న ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో 31 ఏళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం మరియు హత్య కేసులో కోల్‌కతా పోలీసులు, పౌర వాలంటీర్లు సంజయ్ రాయ్‌ను నిందితుడిగా గుర్తించి కేసు నమోదు చేశారు. ఈ కేసులో కోల్‌కతాలోని కోర్టు శనివారం దోషిగా నిర్ధారించింది. సెషన్స్‌కోర్టు రూమ్ నెంబర్ 210లో న్యాయమూర్తి అనిర్బన్‌దాస్ ఈ తీర్పు వెలువరించారు. సోమవారం అతనికి జీవితఖైదు శిక్షను ఖరారు చేస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు.