– 150 రకాల పౌర సేవలు ప్రారంభం
– వాట్సాప్ గవర్నెన్స్ పై భిన్నాభిప్రాయాలు
– వాలంటీర్ల భవిష్యత్తు ప్రశ్నార్ధకం
టెక్నాలజీని అమితంగా ప్రేమించే ముఖ్యమంత్రుల్లో ఏపీ సీఎం చంద్రబాబు అందరికన్నా ముందుంటారు. అయితే ఆయన సడన్ గా వాట్సాప్ గవర్నెన్స్ ప్రకటించారు. దీనిపై ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల వ్యక్తిగత రహస్యాలన్నీ బట్టబయలు చేస్తున్నాడని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ముఖ్యంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నియమించిన సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ల గుండెల్లో రాయి పడినట్టయింది. అయితే సచివాలయ ఉద్యోగులకు తక్షణం అంత నష్టం వాటిల్లకున్నా.. వాలంటీర్ల వ్యవస్థ మాత్రం భూస్థాపితం అయినట్టే అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే… ఈ సేవ కేంద్రాలు, మీసేవ కేంద్రాలు, ఇంటర్నెట్ సెంటర్లపై తీవ్ర ప్రభావం పడుతుందని అంటున్నారు. ఇక
వీటిపైనే ఆధారపడి జీవనోపాధి పొందుతున్న యువత బతుకులు మళ్ళీ బజారున పడినట్టేననే ఆందోళనలు వ్యక్తమ వుతున్నాయి.
ఇంతకీ వాట్సాప్ గవర్నెన్స్ అంటే…ఏమిటంటే…
ఇక నుంచి మొబైల్ ఫోన్లోనే ప్రజలకు 150 రకాల పౌర సేవల్ని అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అయితే ఇందులో కనీసం 100రకాల సేవలను ప్రవేశపెట్టడానికి వాట్సప్ సన్నాహాలు చేసింది.ఇందుకు సంబందించి వాట్సాప్ మాతృ సంస్థ మెటాతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది.
అయితే ఇందులో మూడు కీలక విభాగాలు ఉన్నాయి.
1) G2C (ప్రభుత్వం నుండి పౌరులకు అందే సేవలు. అంటే ఆధార్ కార్డు వెరిఫికేషన్లు, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు ఇలా…)
2).B2C (వ్యాపారుల నుండి వినియోగదారునికి అందే సేవలు. ఉదాహరణకి అమెజాన్, స్విగ్గి, క్విక్ కామర్స్ తరహాలో )
3).G2G (ప్రభుత్వం నుండి ప్రభుత్వం.. ఇది అంతర్గత సేవలు )
ఇంకా వివరాల్లోకి వెళితే…
ముఖ్యంగా ఎండోమెంట్ సేవలు.. అంటే దర్శనం టికెట్లు, ప్రసాదం టిక్కెట్లు, గదులు.. వీటన్నిటిని వాట్సాప్ ద్వారా పొందవచ్చు. ఇంకా విరాళాలు ఇవ్వాలన్నా వాట్సాప్ నుంచి పంపించవచ్చు. రెవెన్యూ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి.
మీరు అప్లై చేసిన దరఖాస్తుల ప్రోగ్రెస్ ను ఇక్కడ తెలుసుకోవచ్చు. పారదర్శకమైన యాక్సెస్ తో సర్వే నంబర్లు, భూముల వివరాలు ఉంటాయి. ఇంకా ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలను ఇక్కడినుంచి పొందవచ్చు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, ఇంటి పన్నులు, కరెంట్ బిల్లుల సేవలను కూడా పొందవచ్చు. విద్యుత్ శాఖకు సంబంధించి మీ వీధిలో , మీ వార్డ్ లో , మీ ఏరియాలో గానీ హై టెన్షన్ లైన్లు, కరెంటు స్తంభాలు లేకపోయినా ఇందులో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ప్రభుత్వ రిజిస్ట్రేషన్ కు సంబంధించిన ముఖ్యమైన సమాచారం కూడా ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడి నుంచే రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఎన్కంబెరెన్సు సర్టిఫికెట్లు కూడా పొందవచ్చు. పౌర సరఫరాల సేవలు కూడా పొందవచ్చు. రేషన్ కార్డు దరఖాస్తు చేసుకోవడం, రేషన్ పంపిణీపై స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు. రవాణాశాఖ సంబంధించి వివరాలన్నీ వాట్సప్ లో అందుబాటులో ఉంటాయి. బస్ టికెట్ల రిజర్వేషన్లు, టైమింగ్స్, పార్సిల్ సర్వీసులు వీటన్నిటి సేవలు పొందవచ్చు.
పాఠశాలకు సంబంధించి తల్లిదండ్రులతో అనుసంధానం చేస్తారు విద్యార్థుల అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
ఉన్నత విద్యకు సంబంధించి అడ్మిషన్లు, ఎగ్జామ్స్, దరఖాస్తులు వీటన్నిటి వివరాలు కూడా అందుబాటులో ఉంటాయి.
యూనివర్సిటీలో వివిధ సర్టిఫికెట్లు కూడా వాట్సాప్ ద్వారా పొందవచ్చు. యువతకు పలురకాల నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు అందుబాటులోకి వస్తాయి. స్కిల్ డెవలప్మెంట్ అవసరాలు, ప్రపంచవ్యాప్తంగా డేటాను అప్ డేట్ చేసి మెటా అందిస్తుంది.
అన్నింటికన్నా ముఖ్యంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో వాట్సాప్ సేవలు ప్రధాన పాత్ర పోషించనున్నాయి. 29 విభాగాల్లో 350 ప్లస్ సేవలు ఇప్పటికే ఏకీకృతం చేశారు. వీటితో సచివాలయ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఇక వాలంటీర్లు అయితే తమ ఉద్యోగాలపై ఆశలు వదిలేసుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కావాలనే ఇదంతా చేస్తున్నారని, వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులపై కక్షతోనే వాట్సప్ గవర్నెన్స్ తీసుకొచ్చారనే విమర్శలైతే గట్టిగానే వినిపిస్తున్నాయి.