32.2 C
Hyderabad
Wednesday, April 22, 2026

Live Video

spot_img

ధరణి టెర్రర్‌ – మొరాయిస్తున్న సర్వర్‌

తెలంగాణలో భూ రికార్డుల నిర్వహణ కోసం గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ ఇప్పుడు వణికిస్తోంది. పోర్టల్‌ను చూస్తేనే ఐటీ నిపుణులు జడుసుకుంటున్నారు. ఎందుకంటే.. ఆ పోర్టల్‌లో దేన్ని కదిలించినా క్రాష్‌ అయ్యే పరిస్థితి నెలకొందంటున్నారు నిపుణులు. ఒకరకంగా పోర్టల్‌ మొత్తం ల్యాండ్‌మైన్‌లా తయారయ్యిందంటున్నారు. సాఫ్ట్‌వేర్‌లో లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయట. ఏ మార్పులు చేయాలన్నా క్రాష్‌ అయ్యే పరిస్థితి నెలకొందంటున్నారు. టెర్రాసిస్‌ అనే ప్రైవేటు కంపెనీ ఇన్నాళ్లు ఈ ధరణి పోర్టల్‌ను నిర్వహించింది. దానినుంచి ఇటీవలే తప్పించి ధరణి పోర్టల్‌ను ఎన్‌ఐసీకి బదిలీ చేసింది ప్రభుత్వం. ఇన్నాళ్లు దీన్ని నిర్వహించిన టెర్రాసిస్‌.. ఒక పద్ధతి ప్రకారం బ్యాక్‌ ఎండ్‌ సాఫ్ట్‌వేర్‌ రూపొందించలేదని, కోడింగ్‌లో ఇష్టం వచ్చినట్లు మార్పులు చేసిందని.. అందుకే ఇప్పుడీ సమస్య తలెత్తిందని చెబుతున్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటిరోజు నుంచీ ధరణి పోర్టల్‌ను తొలగిస్తామని, దానిని రద్దుచేసి భూ భారతిని తీసుకొస్తామని చెప్పుకుంటూ వస్తోంది. ప్రకటించినట్లుగానే గత నెలలో భూభారతి బిల్లును విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఈ క్రమంలోనే ఇన్నాళ్లుగా ప్రైవేటు సంస్థ అధీనంలో ఉన్న ధరణి పోర్టల్‌ను ప్రైవేటు సంస్థకు బదలాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆ ఉత్తర్వుల మేరకు ధరణి పోర్టల్‌ డేటా మొత్తం టెర్రాసిస్‌ అనే సంస్థ నుంచి నేషనల్‌ ఇన్నఫర్మేటివ్‌ సెంటర్‌కు బదిలీ చేశారు. అయితే, కొద్దిరోజులుగా ధరణి పోర్టల్‌ను ఓపెన్‌ చేసేందుకు, విశ్లేషించేందుకు ప్రయత్నిస్తున్న ఎన్‌ఐసీ నిపుణులకు సవాళ్లు ఎదురవుతున్నాయి. సర్వర్‌ మొరాయిస్తుండటంతో పలు సర్వీసులకు అంతరాయం కలుగుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు సర్వర్‌ను రీస్టార్ట్‌ చేయాలన్నా ఇబ్బంది ఎదురవుతోంది. సర్వర్‌ రీస్టార్ట్‌ చేస్తే పోర్టల్‌లో ఏ సమాచారం అదృశ్యమవుతుందో, ఏ డేటా ఎగిరిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

ధరణిలో మొత్తం 33మాడ్యూళ్లున్నాయి. వాటిని తగ్గించాలన్నా, వాటిలో మార్పులు చేయాలన్నా అప్రమత్తంగా ఉండాల్సిందేనని ఎన్‌ఐసీ టెక్నీషియన్లు చెబుతున్నారు.సాఫ్ట్‌వేర్‌ ట్రాన్సిషన్‌ పూర్తయ్యాక కొద్దిరోజుల దాకా ఈ పోర్టల్‌ను ఇన్నాళ్లు నిర్వహించిన టెర్రాసిస్‌ ప్రతినిధులు సాంకేతిక అంశాలకు సంబంధించి అవసరమైన సమాచారం ఇస్తూ వచ్చింది. కానీ, ఇటీవలే భూ భారతి బిల్లు అసెంబ్లీలో పాస్‌ అయిన తర్వాత ధరణి సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన ఏ సమాచారం కావాలన్నా ఆ సంస్థ ప్రతినిధులు స్పందించడం లేదంటున్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన భూ భారతి చట్టానికి, ధరణి పోర్టల్‌కు చాలా తేడాలున్నాయి. భూ భారతి చట్టానికి అనుగుణంగా రెవెన్యూశాఖ కొత్తగా నిబంధనలు రూపొందిస్తోంది. ఈ నియమ నిబంధనల ప్రకారం ధరణి పోర్టల్‌లో మార్పులు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం 33 మాడ్యూళ్లు ఉండగా వాటిని 6కు కుదించాల్సి ఉంది. పహాణీల ఎంట్రీ, ఎంజాయ్‌మెంట్‌ కాలమ్‌ వంటి 11 అంశాలతో ఆన్‌లైన్‌లోనే రికార్డు అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది. అయితే ఈ మార్పులు చేయాలంటే ధరణి సాఫ్ట్‌వేర్‌ కోడింగ్‌లో తప్పనిసరిగా మార్పులు చేయాల్సి ఉంటుందంటున్నారు ఎన్‌ఐసీ నిపుణులు. ఈ మార్పులు చేయడానికి ఇన్నాళ్లు నిర్వహించిన టెర్రాసిస్‌ నిపుణుల సహకారం తప్పనిసరిగా అవసరం ఉంటుంది. అయితే, ఆసంస్థ ఇలాగే మొండికేస్తే, కోడింగ్‌లో సహకరించకపోతే వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. టెర్రాసిస్‌కు చెల్లించాల్సిన బకాయిలు రిలీజ్‌ చేయకుండా లీగల్‌ నోటీసులు పంపించాలన్న ఆలోచనలో అధికారులు ఉన్నట్లు చెబుతున్నారు. అప్పటిదాకా ధరణి పోర్టల్‌ను ఇప్పుడు ఉన్నట్లే కొనసాగించక తప్పదంటున్నారు. మరోవైపు.. ఇప్పుడైతే ధరణి పోర్టల్‌ను కొనసాగిస్తూ.. భూభారతి చట్టానికి అనుగుణంగా మరో కొత్త సాఫ్ట్‌వేర్‌ తయారుచేయించాలన్న ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్లు చెబుతున్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com