నిన్నా మొన్నటిదాకా ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనా ఇప్పుడు జనాభా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. జననాల సంఖ్య భారీగా తగ్గిపోవడంతో పిల్లల్ని కనండి బాబూ.. అని ప్రోత్సాహకాలు ప్రకటించే స్థాయికి చేరుకుంది. ఈ యేడాది చైనా ప్రకటించిన గణాంకాల ప్రకారం వరుసగా మూడో యేడాది చైనాలో జననాలు భారీగా తగ్గిపోయాయి. ప్రస్తుతం చైనా జనాభాను భారత్ అధిగమించింది. గత యేడాదే ఈ మార్క్ దాటిపోయింది. భారత్ జనాభా 142.86 కోట్లకు చేరుకోగా చైనా జనాభా 140 కోట్లుగా ఉంది.
వరుసగా నాలుగోయేడు తగ్గుదల :
చైనా జనాభా వరుసగా తగ్గుముఖం పడుతోంది. వరుసగా నాలుగో యేడాది చైనా జనాభా తగ్గింది. తాజా నివేదికల ప్రకారం 2024 డిసెంబర్ నాటికి చైనా జనాభా 1408 బిలియన్లుగా నమోదయ్యింది. గత యేడాదితో పోలిస్తే దేశ జనాభా 13లక్షలు తగ్గినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇక, 2023లోనూ చైనా జనాభా దాదాపు 20లక్షలు తగ్గింది. తాజా నివేదిక ప్రకారం చైనాలో జనాభా తగ్గుముఖం పడుతుండటంతో అనివార్యంగా వృద్ధుల జనాభా పెరుగుతోంది. అంటే.. విశ్రాంతి తీసుకోవాల్సిన వయసున్న జనాభా తగ్గిపోతుండగా.. పనిచేసే యువత పూర్తిగా తగ్గుముఖం పడుతోంది. జననాల రేటు పెరగడం లేదు. ఈ పరిణామాలు జిన్‌పింగ్ సర్కారుకు ఆందోళనకరంగా మారాయి. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా రికార్డులకెక్కిన చైనా కొన్ని సంవత్సరాల నుంచి జనాభా నియంత్రణ విధానాలు అవలంబిస్తోంది. ఒకేబిడ్డను కనాలని నిబంధన పెట్టింది. అయితే, ఈ విధానమే ఇప్పుడు చైనాకు ముప్పుగా పరిణమించింది.
పెళ్లికి, పిల్లలకు యువకుల నిరాసక్తత :
చైనాలో జనాభా తగ్గుముఖం పట్టడానికి యువకులు, మధ్య వయసు వాళ్లు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల ఆలోచనా విధానమే కారణమవుతోంది. భవిష్యత్తు, ఉద్యోగ భద్రత, జీవనవ్యయం పెరుగుతుండటంతో యువకులు పెళ్లి చేసుకోవడం లేదు. కొందరు పెళ్లిళ్లు చేసుకున్నా పిల్లలు కనడానికి ఆసక్తి చూపించడం లేదు. ఇంకొందరేమయో లేటు వయసులో పెళ్ళిళ్లు చేసుకోవడం వల్ల సంతానం కలగడం లేదు. ఇలా.. పలు కారణాలు చైనాను జనాభా సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. వాస్తవానికి చైనాలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు దశాబ్దాల్లోనే జనాభా రెట్టింపు అయ్యింది. దీంతో, ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా రికార్డులకెక్కింది. ఆ పరిణామం చైనాలో ఆహార సంక్షోభానికి దారి తీసింది. దీంతో, కమ్యూనిస్టు ప్రభుత్వం ఒకే బిడ్డ విధానాన్ని నిర్బంధంగా అమలు చేసింది. పిల్లల్ని కనాలనుకునే వాళ్లు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలి. సర్కారు ఆదేశాలు ఉల్లంఘిస్తే.. జరిమానా విధించడంతో పాటు.. బలవంతంగా గర్భస్రావాలు చేయించారు. అంతేకాదు.. అది కూడా ఒకే బిడ్డకు పరిమితం. రెండో బిడ్డను కంటే గుర్తింపు కూడా నిరాకరించారు. ఈ చర్యలు ఇప్పుడు చైనాకు ఆందోళనకరంగా పరిణమించాయి.
ఒకే బిడ్డ ఆంక్షలు ఎత్తేసిన చైనా :
చైనాలో జనాభా సంక్షోభం కారణంగా జనాభాను పెంచుకునే ఉద్దేశ్యంతో ప్రోత్సాహకాలు ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. ఇప్పుడు కాదు.. 2021 మేలోనే అప్పటిదాకా కొనసాగిన ఒకే బిడ్డ ఆంక్షలను ఎత్తివేసింది. ముగ్గురు పిల్లల విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాదు.. ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలను కన్నవాళ్లకు ప్రోత్సాహకాలు కూడా అందించింది. ఆ ప్రోత్సాహకాలతో అయినా జనాభా పెరుగుతుందని ఆశిస్తే.. ఆ ప్రయోగం కూడా ఇప్పుడు సఫలం కావడం లేదు. ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తున్నప్పటికీ జనం ఆలోచన మారిపోవడంతో అవేవీ ఫలితం ఇవ్వడం లేదు.
చైనాలో మూతపడుతోన్న స్కూళ్లు :
చైనాలో నెలకొన్న తాజా పరిస్థితులు.. అనేక రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. జనాభా సంక్షోభం ప్రధానంగా విద్యారంగంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. జననాల రేటు తగ్గడం కారణంగా దేశవ్యాప్తంగా వేలాది పాఠశాలలు మూతపడుతున్నాయి. 2023లో దేశవ్యాప్తంగా 14,808 కిండర్ గార్టెన్ స్కూళ్లు మూతపడినట్లు చైనా విద్యాశాఖ వెల్లడించింది. పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య అంతకుముందు ఏడాదితో పోలిస్తే 11శాతం తగ్గడం ఇందుకు కారణంగా పేర్కొంది. అటు ప్రాథమిక పాఠశాలల సంఖ్యలోనూ భారీ తగ్గుదల కనిపించింది. 2023లో 5645 పాఠశాలలు మూతపడినట్లు చైనా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే మూతపడిన కిండర్‌గార్టెన్ స్కూళ్లను సీనియర్ సిటిజెన్స్ సంరక్షణ కేంద్రాలుగా మారుస్తున్నారు. ఆయా పాఠశాలల సిబ్బంది కూడా వృద్ధులకు సంరక్షకులుగా విధులు నిర్వర్తించేందుకు సిద్ధమవుతున్నారని నివేదికలు చెబుతున్నాయి.
వయోవృద్ధులు 22శాతం :
ఇక, జనాభాలో లింగ నిష్పత్తిలో కూడా చైనాలో తేడాలున్నాయి. 104 మంది పురుషులకు వంద మంది మహిళలు చైనాలో ఉన్నారు. ఇక, ఇప్పుడు చైనాలో వృద్ధుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దేశజనాభాలో 22శాతం మంది అరవయ్యేళ్లు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవాళ్లే ఉన్నారు. ఈ సంఖ్య 2035 నాటికి 30శాతానికి చేరుతుందని అంచనా వేస్తున్నారు. 2050 నాటికి ఈ సంఖ్య 40శాతానికి చేరొచ్చని కూడా భావిస్తున్నారు. ఇక, తాజా ఐక్యరాజ్యసమితి డేటా వరల్డ్‌మీటర్ పరిశీలిస్తే.. జనవరి 16, 2025, గురువారం నాటికి చైనా జనాభా 1,417,560,895. చైనా జనాభా 2025 మధ్య నాటికి 1,416,096,094 మందికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. అంటే జనాభా మరింత తగ్గిపోతూనే ఉంది.
చాలా దేశాల్లో ఇదే సమస్య :
అయితే, జనాభా తగ్గుదల సమస్య ఒక్క చైనాలోనే లేదు. జపాన్, తూర్పు యూరప్ దేశాల్లో కూడా జనాభా వేగంగా తగ్గిపోతోంది. జపాన్‌లో గత 15 సంవత్సరాలుగా జనాభా రేటు తగ్గిపోతోంది. అలాగే, సౌత్ కొరియాలో 2021 నుంచి జనాభా వృద్ధి రేటులో తగ్గుదల నమోదవుతోంది. అదే విధంగా ఇటలీలోనూ 19 శతాబ్దం తర్వాత మొట్ట మొదటిసారిగా జననాలు 4లక్షల కంటే తక్కువకు పడిపోయాయి. దీంతో చాలా దేశాలు పిల్లలను కనేవారికి ప్రోత్సాహకాలను ప్రకటిస్తున్నాయి. జనాభాలో వృద్ధిరేటు పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.