గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘డాకు మహారాజ్’. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో ‘డాకు మహారాజ్’ను నిర్మించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా కీలక పాత్రలు పోషించారు. ‘డాకు మహారాజ్’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలైంది.
మొదటి షో నుంచే ప్రేక్షకుల నుంచి విశేష స్పందనను సొంతం చేసుకున్న ఈ సినిమా భారీ వసూళ్లతో బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే రూ.114 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి, బాలకృష్ణ కెరీర్ లోనే అతి పెద్ద విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లోని ఐటీసీ కోహినూర్ లో విజయోత్సవ సభను నిర్వహించిన చిత్ర బృందం, డాకు మహారాజ్ సినిమాకి ఇంతటి విజయాన్ని అందించిన అభిమానులకు, ప్రేక్షకులను కృతజ్ఞతలు తెలిపింది. జనవరి 22వ తేదీన అనంతపురంలో ‘డాకు మహారాజ్’ విజయోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్టు చిత్ర నిర్మాతులు వెల్లడించారు.