కేంద్ర బడ్జెట్‌కు ముహూర్తం ఖరారయ్యింది. ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. 2025-26 బడ్జెట్‌కు సంబంధించిన పార్లమెంటు సమావేశాలు ఈనెల 31వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. తొలిరోజు పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం 11 గంటలకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడతారు. కేంద్రంలో మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గతేడాది జులై 23వ తేదీన తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఎన్నికల కారణంగా ఆలస్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇప్పుడు రెండో బడ్జెట్ సభ ముందు ప్రవేశపెట్టబోతున్నారు. కేంద్ర బడ్జెట్‌కోసం తొలి విడత సమావేశాలు ఫిబ్రవరి 13వ తేదీ వరకు జరుగుతాయి. తర్వాత మార్చి 9వ తేదీ వరకు సెలవు ఉంటుంది. శాఖల వారీగా జరిపిన బడ్జెట్ పద్దులపై పార్లమెంటు స్థాయీ సంఘాలు అధ్యయనం చేసి నివేదికలు సమర్పించడానికి ఆ సమయం కేటాయిస్తారు. తర్వాత మార్చి 10వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీవరకు రెండో విడత బడ్జెట్ సమావేశాలు సాగుతాయి. తొలి విడత సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చిస్తారు. మలి విడతలో బడ్జెట్, శాఖలవారీ పద్దులకు ఆమోదం తెలుపుతారు.