- మరో ఐపీఎస్ అధికారిపై సస్పెన్షన్ వేసే దిశగా ఏపీ సర్కార్ అడుగులు..
- సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ పై విచారణకు అథార్టీని నియమించిన ఏపీ సర్కార్.సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్. గత ప్రభుత్వంలో అత్యంత వివాదస్పద వ్యక్తిగా వార్తల్లో నిలిచారు. టీడీపీని. ఆ పార్టీ నేతలను టార్గెట్ చేశారనే అభియోగాలు చాలానే సునీల్ కుమార్ మీదున్నాయి. ఇవన్ని ఒక ఎత్తు అయితే.. ప్రస్తుత డెప్యూటీ స్పీకర్.. అప్పటి ఎంపీ రఘు రామకృష్ణం రాజును కస్టడీలో టార్చర్ చేశారనేది సునీల్ కుమార్ పై ఉన్న అభియోగం మరో ఎత్తు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే సునీల్ కుమార్ ను విధుల నుంచి తప్పించింది.. ఇప్పటి వరకు ఎలాంటి పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. ఇదే సమయంలో సునీల్ కుమార్ మీదున్న అభియోగాలపై కేసు నమోదు అయింది. అయితే ఐపీఎస అధికారి సునీల్ కుమార్ మీద కేసు నమోదైంది కానీ.. ఆయన్ను ఎందుకు సస్పెండ్ చేయలేదనే ఒత్తిడి కూటమి ప్రభుత్వం మీద పెరిగింది. దీంతో గత కొన్ని రోజుల నుంచి సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పై చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం ఓ ప్రణాళికాబద్దంగా వ్యవహరిస్తోంది. RRRను పోలీస్ కస్టడీలో టార్చర్ పెట్టారనే కేసులో ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. దీంట్లో భాగంగా సునీల్ కుమార్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న తులసీ బాబును అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ తర్వాత నుంచి సునీల్ కుమార్ మీద చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని.. ఆయన్ను ఎందుకు సస్పెండ్ చేయడం లేదనే ఒత్తిడి కూటమి ప్రభుత్వంపై పెరిగింది. ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సునీల్ కుమార్ పై చర్యలకు రంగం సిద్దం చేస్తోన్నట్టే కన్పిస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగానే పివి సునీల్ కుమార్ పై విచారణ అథారిటీని వేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పై వచ్చిన అభియోగాలపై విచారణకు వేసిన అథారిటీ కమిటీలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, విజిలెన్స్ డిజి హరీష్ కుమార్ గుప్తాలను నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులిచ్చింది. సాధ్యమైనంత త్వరగా సునీల్ కుమార్ పై నమోదైన అభియోగాలపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ఆదేశం.
సునీల్ కుమార్ సస్పెన్షనుకు దారేస్తున్నారా..?
సునీల్ కుమార్ పై ఉన్న అభియోగాలపై విచారణకు అధార్టీని నియమించడం.. త్వరగా నివేదిక ఇవ్వమని కోరడం వంటివి చూస్తుంటే.. సునీల్ కుమార్ పై సస్పెన్షన్ వేటు ఖాయమనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే సీనియర్ ఐపీఎస్ అధికారులు పీఎస్సార్ ఆంజనేయులు, సంజయ్, కాంతి రాణా తాతా, విశాల్ గున్నిలు సస్పెండ్ అయ్యారు. ఇప్పుడు మరో సీనియర్ ఐపీఎస్ కూడా సస్పెండెడ్ ఐపీఎస్ ఆఫీసర్ల క్లబ్ లో చేరే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఏపీ పరిపాలన వర్గాల్లో జరుగుతున్న పరిణామాలు.. ప్రభుత్వం వేస్తున్న అడుగులు చూస్తుంటే కచ్చితంగా సునీల్ కుమార్ సస్పెన్షన్ ఖాయమనే భావన వ్యక్తమవుతోంది.