22.7 C
Hyderabad
Friday, November 27, 2026

Live Video

spot_img

మొన్న ఏసీబీ.. ఇప్పుడు ఈడీ – ఫార్ములా ఈ రేస్‌ కేసులో వరుస విచారణలు

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ను విచారణలు వెంటాడుతున్నాయి. మొన్నటికి మొన్న ఏసీబీ అధికారుల విచారణకు హాజరైన కేటీఆర్‌.. ఇప్పుడు ఈడీ విచారణకు హాజరు కాబోతున్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఫార్ములా ఈ-రేసుకు సంబంధించి నిధులు అక్రమంగా ఏజెన్సీకి ట్రాన్స్‌ఫర్‌ చేశారన్న అభియోగాలపై కేటీఆర్‌ను దర్యాప్తు అధికారులు విచారిస్తున్నారు.

ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఇచ్చిన నోటీసుల మేరకు కేటీఆర్‌ గురువారం ఉదయం ఈడీ ఆఫీసుకు వెళ్తున్నారు. ఉదయమే నందినగర్‌లోని తన నివాసం నుంచి ఈడీ ఆఫీసుకు బయలుదేరి వెళ్తారు. అయితే, వెంట అడ్వొకేట్‌ లేకుండానే కేటీఆర్‌ ఈడీ విచారణ ఎదుర్కోనున్నారు. ఫార్ములా ఈ రేసు కేసులో ఓ విదేశీ కంపెనీకి 55 కోట్ల రూపాయలు హెచ్‌ఎండీఏ అకౌంట్‌ నుంచి బదిలీ చేశారన్న ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదు చేసింది. అయితే, ఈ అంశంలో మనీ ల్యాండరింగ్‌, ఫెమా నిబంధనల ఉల్లంఘన జరిగిందంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కూడా కేసు నమోదు చేసింది.

ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసుకు సంబంధించి ఇటీవలే విచారణకు హాజరైన కేటీఆర్‌కు.. ఈడీ కూడా ప్రశ్నించాలంటూ నోటీసు జారీచేసింది. గురువారం ఈడీ అధికారుల ముందు హాజరు కావాలని సూచించింది. ఆ నోటీసు మేరకు కేటీఆర్‌ ఈడీ విచారణకు హాజరవుతున్నారు. ఈ కేసుకు సంబంధించి జరిగిన చెల్లింపులు కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయన్న కోణంలో ఈడీ కేటీఆర్‌ను ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ కేసుకు సంబంధించిన వివరాలన్నీ ఇప్పటికే ఏసీబీ నుంచి ఈడీ తెప్పించుకుంది.

ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో నిధుల మళ్లింపునకు సంబంధించి అక్రమాలు జరిగాయని ఏసీబీకి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ ఫిర్యాదు చేశారు. దీంతో, అవినీతి నిరోధక చట్టం 13 (1) ఏ, 13(2), ఐపీసీ సెక్షన్ 409, 120-బి కింద ఏసీబీ కేసు నమోదు చేసింది. హైదరాబాద్‌లో ఫార్ములా ఈ కార్ రేసు సీజన్ 9,10,11,12 నిర్వహణకు యుకేకు చెందిన ఫార్ములా ఈ ఆరేషన్స్‌కు స్పాన్సర్ కంపెనీ అయిన ఎస్ నెక్ట్స్ జెన్, పురపాలక శాఖ మధ్య ఒప్పందం జరిగింది. దీని ప్రకారం తొలి సీజన్‌ను 2023 ఫిబ్రవరి 11న నిర్వహించారు. దీనికి నిర్వహణ ఖర్చు కింద హెచ్ఎండీఏ 12 కోట్లు ఖర్చు పెట్టింది. అయితే, స్పాన్సర్ కంపెనీకి, ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్‌కు మధ్య విబేధాలు రావడంతో స్పాన్సర్ కంపెనీ పక్కకు తప్పుకుంది. దీంతో తామే ఆన్ని ఖర్చులు భరించేందుకు సిద్ధమని తెలంగాణ పురపాలక శాఖ స్పాన్సర్ కంపెనీ స్థానంలో ఉండి ఒప్పందం చేసుకుంది. ఇలా ఆ తర్వాత సీజన్లలో ఫీజులు, ఖర్చులు, పన్ను చెల్లింపుల రూపంలో రూ.55 కోట్లు యూకే కంపెనీ ఖాతాలోకి సాధారణ నిధుల నుంచి తరలించింది. క్యాబినెట్, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఇలా చెల్లింపులు జరపడం చట్ట విరుద్దం. అంతే కాకుండా హెచ్ఎండీఏ పది కోట్లకు మించి ఖర్చు చేయాలంటే పరిపాలనపరమైన అనుమతులు ప్రభుత్వం నుంచి తీసుకోవాలి. కాని ఇది జరగలేదు. పైగా.. విదేశీ మారక ద్రవ్యంలో చెల్లింపులు జరిగాయి. ఇది ఫారిన్ ఎక్సెంజ్ రెమిటెన్స్ నిబంధనలకు వ్యతిరేకం. ఆర్బీఐ నుంచి గానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి గానీ అనుమతి లేదు. పైగా అప్పుడు ఎన్నికల సమయంలో ఈ నిధుల మళ్లింపు చేశారు. అంటే.. ఆ సందర్భంలో ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈసీని కూడా సంప్రదించకుండా.. అనుమతి లేకుండా చెల్లింపుల వ్యవహారం జరిగింది.

ఈ కేసుకు సంబంధించి గతంలోనే ఏసీబీ పలు ఆధారాలు సేకరించింది. తాను సేకరించిన ఆధారాల మేరకు ఈకేసులో ఏ-1గా మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను చేర్చింది. అలాగే, ఏ-2గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అరవింద్‌కుమార్‌, ఏ-3గా హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజనీర్‌ బీఎల్‌ఎన్‌రెడ్డిల పేర్లు చేర్చింది ఏసీబీ. వీళ్లను ఇప్పటికే ఏసీబీ విడివిడిగా విచారించింది. అయితే అప్పుడు మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆదేశాల మేరకే ఈ కార్ రేస్ వ్యవహారంలో నిధులను విదేశీ కంపెనీకి చెల్లింపులు జరిపామని సీనియర్ ఐఎఎస్ అధికారి అర్వింద్ కుమార్, చీఫ్ ఇంజనీర్ బీఎల్ ఎన్ రెడ్డి ఏసీబీ ముందు చెప్పారు. దీంతో కేటీఆర్‌ను ఏ1గా చేర్చిన ఏసీబీ ఆయన్ని ఇప్పటికే విచారించింది. జనవరి 9వతేదీన ఎసీబీ ఏడు గంటలపాటు కేటీఆర్‌ను ప్రశ్నించింది. అయితే, ఇదే కేసులో మరోసారి కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించవచ్చని భావిస్తున్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com