- ఈసారి వేడుకలు రద్దవుతాయా?
- కార్చిచ్చులో హాలీవుడ్ నటుల ఇళ్లు దగ్ధం
- దాంతో వేడుకలు రద్దవుతాయని విస్తృత కథనాలు
- 96 ఏళ్లుగా ఏనాడూ రద్దు కాని వేడుకలు
- కోవిడ్ పాండమిక్ లోనూ స్వల్ప మార్పులతో ఆలస్యంగా వేడుకలు..
- అవార్డుల ప్రదానం అంటే వెయ్యి మంది స్థానికులకి ఉపాథి
ప్రతీ ఏటా అంగ రంగ వైభవంగా నిర్వహించే ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల పండుగకు ఈసారి కాలిఫోర్నియా కార్చిచ్చు ఎసరు పెట్టేసిందా? ఈ అవార్డుల ఎంపికలో ఉండే జ్యూరీ సభ్యులు కొందరి ఇళ్లు కార్చిచ్చు కారణంగా తగులబడిపోయాయి. దాంతో ఈసారి ఆస్కార్ అవార్డుల ప్రదానం రద్దవుతుందనే కథనాలు విస్తృతంగా వినిపించాయి. కానీ అలాంటిదేమీ లేదని షెడ్యూల్ ప్రకారమే అవార్డుల ప్రదానం జరుగుతుందని నిర్వాహకులు అంటున్నారు. లాస్ ఏంజెలిస్ మొత్తం కార్చిచ్చు కోరల్లో చిక్కుకోవడంతో ఫంక్షన్ నిర్వహణపై కొన్ని సందేహాలు రేగాయి. కానీ మార్చి2వ తేదీనే 97వ అకాడమీ ఆస్కార్ అవార్డుల ప్రదానం జరుగుతుందని నిర్వాహకులు ప్రకటించారు. ఈసారి అగ్ని ప్రమాదం వల్ల అవార్డుల ప్రదానం ఉండకపోవచ్చునని ది సన్ పత్రిక కథనాన్ని ప్రచురించిన నేపధ్యంలో ఊహాగానాలు రేగాయి. నటులు ఎమ్మాస్టోన్, టామ్ హాంక్స్, మెరిల్ స్ట్రీప్, స్టీవెన్ స్పిల్బర్గ్ అమెరికా కార్చిచ్చు ఆర్పివేతకు నిధుల సమీకరణ చేస్తున్నారని అందుకే అవార్డుల పండగ ఉండదని కొందరు ఊహించారు. అయితే అలాంటిదేమీ లేదని యధాప్రకారం ఆస్కార్ పండుగ జరుగుతుందని నిర్వాహకులు స్పష్టం చేశారు.
ఆస్కార్ కమిటీలో 55మంది సభ్యులుండగా అందులో నలుగురు ఈ కార్చిచ్చులో ఆస్తులను నష్టపోయారు.అయితే తాజా పరిస్థితుల నేపధ్యంలో అవార్డుల ప్రదానం ప్రోగ్రామ్ లో కొన్ని మార్పులు చేశారు. అమెరికాలో కార్చిచ్చువల్ల ఏర్పడిన భారీ నష్టం పట్ల ఆస్కార్ అకాడెమీ సిఈఓ బిల్ క్రేమర్, అధ్యక్షుడు జానెట్ యాంగ్ విచారం వ్యక్తం చేశారు. కార్చిచ్చువల్ల అపార నష్టం సంభవించింది. దీనివల్ల చిత్రపరిశ్రమలోని వారు కూడా నష్టపోయారు. దీనిపై విచారం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. అగ్ని ప్రమాదం వల్ల హాలీవుడ్ చిత్ర పరిశ్రమకు తీవ్ర నష్టం వాటిల్లినందున ఆస్కార్ నామినీలకు ఇచ్చే విందు ఆతిధ్యాన్ని మాత్రం ఈసారి రద్దు చేశారు. అడవుల వల్ల కార్చిచ్చు పెట్రేగి అనేక సవాళ్లు ఎదురవుతున్నాఆస్కార్ వేడుకను నిర్వహించి తీరుతామని మోషన్ పిక్చర్స్ అకాడెమీ ప్రకటించింది.
ఆస్కార్ అవార్డుల ప్రదానం ఆరంభించిన నాటినుంచి ఇప్పటి వరకూ 96 ఏళ్లుగా ఏనాడూ వేడుకలు రద్దు చేయలేదు.కోవిడ్ పాండమిక్ టైమ్ లో కాస్త ఆలస్యం అయినా, కొన్ని ప్రత్యేక జాగ్రత్తలతో నిర్వహించారు.
ఆస్కార్ అవార్డుల ప్రదానం స్థానికంగా వెయ్యి మందికి ఉపాధికలిగిస్తుంది. ఈసారి నిధులను సమీకరించి వాటిని మంటలనార్పేందుకు, సహాయపునరావాస చర్యలకు వినియోగించాలని నిర్ణయించారు. హాలీవుడ్ లోని ఒవేషన్ డోల్బీ థియేటర్ లో ఈసారి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలను మార్చి 2న ఏబీసీ, హులు ఛానెళ్ల ద్వారా లైవ్ కవరేజ్ ఇస్తున్నారు. రెడ్ కార్పెట్ కవరేజ్ ఆపై ప్రదాన ఉత్సవం కూడా లైవ్ లో వీక్షించవచ్చు.