- త్రివేణి సంగమం పరిసరాల్లో విస్తృత భద్రతా ఏర్పాట్లు
- భోగి పండగ నాడుప్రారంభం.. శివరాత్రి నాడు ముగింపు
- 40 కోట్ల మంది వస్తారని అంచనా…
- 144ఏళ్ల తర్వాత వచ్చిన అతిపెద్ద మహా కుంభమేళా
- మళ్లీ తదుపరి కుంభమేళా 2169లోనే
- మహా కుంభమేళా 2025 పేరిట యూపీ సర్కార్ యాప్
సోమవారం నుంచి ప్రారంభమయ్యే ప్రయాగ్ రాజ్ కుంభమేళాకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి.దాదాపు 40కోట్ల మంది ఈకుంభమేళాలో పవిత్రస్నానాలు ఆచరిస్తారని అంచనావేస్తున్నారు.ప్రపంచంలోకే అతిపెద్ద కుంభమేళాకోసం ప్రపంచం నలుమూలలనుంచి హిందూ భక్తులు పోటెత్తనున్నారు.గంగ,యమునా, సరస్వతి నదుల పవిత్ర సంగమ ప్రదేశంలో జరుగుతున్న ఈ మేళాను అత్యంత పవిత్రమైనదిగా భక్తులు భావిస్తారు. హిందువులు దీనిని హైందవ సమాజ ఐక్యతకు, సాంస్కృతిక వారసత్వానికి ఒక ప్రతీకగా భావిస్తుంటారు.
12 ఏళ్లకు ఒకసారి వచ్చే మహా కుంభమేళా హరిద్వార్, ప్రయాగ్ రాజ్, నాసిక్, ఉజ్జయినీ అనే ఈ నాలుగు ప్రదేశాల్లోనే జరుగుతుంటాయి. 2025 మహాకుంభమేళా ఈ సారి ఈనెల 13నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకూ ప్రయాగ్ రాజ్ లో జరుగుతోంది. లక్షలాది మంది పవిత్రస్నానాలు ఇక్కడ ఆచరిస్తారని నమ్ముతున్నారు. త్రివేణీ సంగమంలో పవిత్రస్నానమాచరించి పూర్వీకులకు పిండ ప్రదానాలు, తర్పణాలు వదులుతారు. భక్తితో చేయడం వల్ల పాపాలన్నీ నశించి, పునీతులవుతారని ప్రతీ హిందువూ నమ్ముతారు. కుంభమేళా సమయంలో ఆ పవిత్ర నదీ జలాల్లోప్రత్యేక శక్తులుంటాయని, అక్కడ స్నానమాచరిస్తే పాపాలు పోవడమే కాక, మనసు, తనువు పవిత్రతను ఆపాదించుకుంటాయని నమ్మకం. మరికొందరైతే కుంభమేళా జరిగిన అన్ని రోజులూ ఆ ప్రాంతంలోనే ఉండి ప్రతీరోజూ నదీ స్నానం చేసి, ఒడ్డున పూజలు చేస్తుంటారు.
వసతి సౌకర్యాలు…
మహాకుంభమేళాకు తరలి వచ్చే భక్తులకు ప్రభుత్వాలు ప్రత్యేక ఏర్పాట్లను కల్పిస్తుంటాయి. కుంభమేళాకు సమీపంలో టెంట్లలో ఉండగోరేవారు సంబంధిత సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా వాటిని ముందే బుక్ చేసుకుంటే అక్కడ ఎలాంటి ఇబ్బందులూ పడే బాధ ఉండదు. సాధారణ ధరలనుంచి లగ్జరీ సౌకర్యాలతో కూడిన గుడారాలు అందుబాటులో ఉంటాయి. మనకు కావలసిన సౌకర్యాలను చూసుకుని వాటిని బుక్ చేసుకోవాలి. ప్రయాగ్‌రాజ్ కుంభమేళాకు భారీ సంఖ్యలు పోటెత్తుతారన్న అంచనాలున్నాయి. అందుకే యూపీ ప్రభుత్వం మహాకుంభమేళా 2025 పేరిట ఒక యాప్ ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ప్రయాగరాజ్ సమీపంలో ఉండే ఇతర ఆలయాలు,పవిత్ర ప్రదేశాలు, దర్శనీయ స్థలాలు, ఘాట్ లు ఇంకా ఇతర సమాచారం అందులో ఉంది.
ప్రయాగ్ రాజ్‌మేళా ఎందుకు ప్రత్యేకమైనదంటే..
సాధారణంగా ప్రతి 12 ఏళ్లకు ఒకసారి వచ్చే దాన్ని పుష్కరం అంటారు.మన దేశంలో ఉజ్జయినీ, హరిద్వార్, ప్రయాగ్ రాజ్,నాసిక్ ఈ నాలుగు ప్రాంతాల్లో మాత్రమే ఈ మేళాలు జరుగుతుంటాయి. అయితే ఈసారి వచ్చిన ప్రయాగ్ రాజ్ కుంభమేళా 144 ఏళ్ల తర్వాత అరుదుగా వచ్చిందని ఆగమ శాస్త్ర పండితులు చెబుతున్నారు. విశేషమైన పుణ్య ఘడియల్లో, అరుదైన ముహూర్తంలో ఈసారి కుంభమేళా వచ్చిందని హిందూ పురాణాలు చెబుతున్నాయి. మరో మహా కుంభమేళా ఇక ఈ శతాబ్దంలో వచ్చే ఆస్కారం లేదు. వచ్చే 2169లో మాత్రమే సంభవిస్తుంది. మామూలు కుంభమేళాలకు పెద్దగా భక్తులు తరలిరారు. కానీ ఇలా అరుదుగా వచ్చే విశిష్ట మహా కుంభమేళాకు మాత్రం ప్రపంచం నలుమూలలనుంచి భక్త జనం పోటెత్తుతారు. గ్రహాల అరుదైన కలయిక వల్ల ఇలాంటి కుంభమేళాలు ఏర్పడతాయి. ఈసారి ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు బృహస్పతి లేదా గురు గ్రహం, సౌరమండలాధిపతి అయిన సూర్యుడు ఒకే కక్ష్యలోకి వచ్చిన అరుదైన ముహూర్తమే మహాకుంభమేళా. 2025లో ఈ రెండు గ్రహాలు ఒకే కక్ష్యలోకి వచ్చిన ఆ ఘడియలు అత్యంత పవిత్రమైనవని, ఆ సమయంలో పవిత్ర స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు జరపడమే కాక, పితృ దేవతలకు తర్పణాలు వదలడం, పిండ ప్రదానాలు చేయడం మంచిదని మన పురాణాలు చెబుతున్నాయి.
మహాకుంభమేళా ప్రారంభ ఘడియలు…
ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళా ఈనెల సోమవారం అంటే 13వ తేదీన పుష్యమాస పౌర్ణిమ ఘడియల్లో మొదలవుతుంది. ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజు ముగుస్తుంది.
పవిత్ర స్నానాలకు మంచి రోజులు…
- జనవరి 14, మకర సంక్రాంతి (తొలి పుణ్యస్నానం)
- జనవరి 29, మౌని అమావాస్య (రెండో పుణ్యస్నానం)
- ఫిబ్రవరి 3, వసంత పంచమి ( మూడో పుణ్యస్నానం)
- ఫిబ్రవరి 12, మాఘ పౌర్ణిమ
ఈ ప్రత్యేక ఘడియల్లో పుణ్యస్నానాలు ఆచరించి తర్పణాలు వదలడం వల్ల పుణ్యం దక్కి, సకల పాపాలు ప్రక్షాళన అవడమే కాక, మోక్షం దక్కుతుందని, స్వర్గలోక ప్రాప్తి, జన్మరాహిత్యం కలుగుతాయని హిందువులు నమ్ముతుంటారు. వేదాలు, పురాణాలు కూడా ఇదే చెబుతున్నాయి.
నాగ సాధువుల రాక…
హిమాలయాలలో ఘోర తపస్సులో ఉండే నాగసాధువులు కేవలం కుంభమేళాలప్పుడు మాత్రమే తరలి వస్తుంటారు. వీరికి జిల్లా కలెక్టర్ స్వాగతం పలికి, గౌరవ మర్యాదలతో నది ఒడ్డుకు తీసుకువెళతారు. లక్షలాది మంది భక్తుల భగవన్నామస్మరణతో నదీ ప్రాంతాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటాయి. భిన్న కులాలు, తెగలకు చెందిన భక్తులంతా ఈ ఆధ్యాత్మిక మేళాలో పాల్గొంటారు. సంస్కృతి, సంప్రదాయలకు హైందవ శొబగులద్దుకుంటాయి.
మహా కుంభమేళా ప్రాధాన్యత…
హిందూ మతంలో ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యతకు మహాకుంభమేళా ఒక ఉదాహరణ. పురాణ కథనం ప్రకారం దేవతలు, రాక్షసులు అమృతం కోసం సముద్ర మథనం చేసినప్పుడు అమృతం రూపొంది భూమిపై నాలుగు చుక్కలు పడింది. ఆనాలుగు చుక్కలు పడిన ప్రదేశాలను అత్యంత పుణ్య ప్రదేశాలుగా గుర్తించారు. నాసిక్, ఉజ్జయిన్, ప్రయాగ్ రాజ్, హరిద్వార్ లలోనే కుంభమేళాలు జరుగుతున్నాయి.
కుంభమేళా ఎన్నిరకాలు…?
కుంభమేళా నాలుగు రకాలుగా మన వేదాలు, పురాణాలు చెబుతున్నాయి. మహాకుంభమేళా, పూర్ణ కుంభమేళా, అర్ధ కుంభమేళా, మాఘమేళా. మహాకుంభమేళా 144 ఏళ్లకు ఒకసారి మాత్రమే వస్తుంది. ప్రత్యేకించి ప్రయాగ్ రాజ్ లోనే వస్తుంది. కాబట్టి అక్కడ పవిత్ర స్నానాలు ఆచరించడం మంచిది.
పూర్ణ కుంభమేళా ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఈ నాలుగు ప్రదేశాల్లోనే వస్తుంది. అప్పుడు కూడా లక్షలాది మంది పవిత్ర స్నానాలాచరించి, పితృతర్పణాలు వదులుతుంటారు. అర్ధ కుంభమేళా ప్రతీ ఆరేళ్లకు రెండు ప్రదేశాల్లో మాత్రమే వస్తుంటుంది. అవే ప్రయాగరాజ్, హరిద్వార్ ప్రాంతాలు ఇక మాఘమేళా ను లఘు కుంభమేళా లేదా చిన్నకుంభమేళాగా ప్రయాగ్ రాజ్ లో ప్రతీ ఏడాదీ మాఘమాసంలో నిర్వహిస్తుంటారు. అప్పుడుకూడా పవిత్ర స్నానాలు ఆచరించడం ఆనవాయితీ.