- టెస్టింగ్ కిట్లను రెడీ చేసుకోండి…
- స్పెషలిస్టులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయండి
- ఆక్సిజన్ సిలండర్లపై మాక్ డ్రిల్ నిర్వహించండి
- వైద్యులను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు
మరోసారి కరోనాలాంటి విపత్తు దేశాన్ని చుట్టుముట్టనుందా? చైనా నుంచి వచ్చిన హ్యూమన్ మెటా నిమో వైరస్ (హెచ్ఎంపీవీ) శరవేగంగా దేశాన్ని చుట్టుముడుతోందా? మళ్లీ ప్రజల ఆరోగ్యం డేంజర్ లో పడనుందా? లేక మెడికల్ మాఫియా చేస్తున్న హంగామాకి ప్రజలు వణుకుతున్నారా? అంటే పలువురు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
కొందరు పర్వాలేదంటున్నారు. కొందరు ప్రాణాంతకం కాదంటున్నారు. కానీ భారతదేశంలోని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందే అలర్ట్ అవుతున్నారు. ఈ క్రమంలో ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. వైద్యారోగ్య శాఖామంత్రితో కలిసి, కొత్త వైరస్ వ్యాప్తిపై అధికారులతో చర్చించారు.
ప్రజలు, వైద్యాధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అన్ని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో పెట్టుకోమని తెలిపారు. అలాగే ప్రతీ హాస్పటల్ లో మాక్ డ్రిల్ నిర్వహించమని తెలిపారు. ఈలోపు అత్యవసరమైన మందులు బ్లాక్ కాకుండా చూడమని తెలిపారు. అలా ఎవరైనా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఎందుకంటే గతంలో కరోనా సమయంలో ఒకొక్క ఇంజక్షన్ రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు విక్రయించిన సందర్భాలను గుర్తు చేశారు. ఈసారి అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో వేగంగా నమోదవుతున్న కేసులతో అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు ఎక్కువగా ఒకే దగ్గరగా చేరతారని తెలిపారు. ప్రజలందరికీ మళ్లీ కౌన్సెలింగ్ చేయాలని అన్నారు. అన్నింటికి మించి చిన్నపిల్లల వైద్యులు, మైక్రో బయాలజిస్టులు, శ్వాసకోశ వ్యాధి నిపుణులతో టాస్క్ ఫోర్స్ కమిటీ వేయాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో నిపుణులైన డాక్టర్లందరినీ అందుబాటులో ఉండమని, వారి ఫోన్ నెంబర్లు తీసుకుని. ఆన్ లైన్ డేటా సెట్ చేయమని తెలిపారు. ఐసీఎంఆర్ వైరాలజీ రెడీ చేయాలని అన్నారు. అత్యవసరంగా మూడువేల వరకు టెస్టింగు కిట్లను తెప్పించుకోవాలని అన్నారు. ఎన్ 95 మాస్కులు, పీపీఈ కిట్లు, ఔషధాలపై చంద్రబాబు వివరాలు అడిగి తెలుసుకున్నారు.
శానిటైజర్లు, మాస్క్ లు రెడీగా ఉంచుకోవాలని, విధిగా అందరూ మళ్లీ వాడేలా చూడాలని తెలిపారు. అలాగే సోషల్ డిస్టన్స్ మెయింటైన్ చేయాలని అన్నారు. ఆనాడు కరోనా తెచ్చిన ఉపద్రవం మునుపెన్నడూ చూడలేదని, ఇప్పుడు తెలిసింది, అనుభవం వచ్చింది కాబట్టి, కొత్త వైరస్ ను సమర్ధవంతంగా ఎదిరించడానికి అధికారులు, వైద్యులు, ప్రజలు అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.