- కలెక్టర్లకు రేవంత్ రెడ్డి క్లాస్
- పనితీరు బాగాలేదని అసంతృప్తి
- కొందరు అధికారులు కూర్చికే పరిమితమవుతున్నారని ఆగ్రహం
- చర్యలు తప్పవని హెచ్చరిక
- జనవరి 26 నుంచి నేను ఫీల్డ్ లోకి వస్తానని తెలిపిన సీఎం
- పంట వేసిన … వెయ్యకపోయినా వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరానికి రైతు భరోసా
- రియల్ ఎస్టేట్ భూములకు వ్యవసాయ యోగ్యం కాని భూములకు రైతు భరోసా ఇచ్చే ప్రసక్తే లేదు
ప్రభుత్వ ఏర్పడి ఏడాది పూర్తయిన నేపథ్యంలో మొదటిసారిగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది పాటు టైం ఇచ్చినప్పటికీ చాలామంది కలెక్టర్లు తమ పనితీరును మార్చుకోవడం లేదని ప్రభుత్వానికి కొన్ని విషయాల్లో చెడ్డ పేరు రావడానికి కలెక్టర్ల కారణమనే అభిప్రాయంలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. శుక్రవారం జరిగిన కలెక్టర్ల సమావేశంలో గతంలో కన్నా భిన్నంగా రేవంత్ రెడ్డి కలెక్టర్లకు క్లాస్ పీకారు. మీ వల్ల మాకు చెడ్డ పేరు వస్తుందని అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెల్లేది కలెక్టర్లే మీ పనితీరే ప్రభుత్వ పని తీరుకు కొలమానం అని అలాంటి స్ధితిలో ఉన్న మీరు ఏమాత్రం పొరపాటు చేసిన అది ప్రభుత్వానికే మచ్చగా మారుతుందని గుర్తు చేశారు. కలెక్టర్లు తమ పనితీరును మరింత మెరుగుపరుచుకుని ముందుకు వెళ్లాలని హెచ్చరించారు. క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని గతంలోనే ఆదేశాలు ఇచ్చామని కానీ కొంతమంది ఇంకా ఆఫీసులలో కూర్చునే పనిచేయాలని భావిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమస్యలు వచ్చినప్పుడు సమర్ధవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని… మీ పని తీరును మరింత మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని కలెక్లర్లకు సీయం గట్టిగానే చెప్పారు.
వ్యవసాయ యోగ్యం కాని భూములకు కూడా గతంలో రైతు పెట్టుబడి సాయం చేశారని ఇప్పుడు అలా కుదరదని అనర్హులకు రైతు భరోసా ఇచ్చే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లకు మార్గనిర్దేశం చేశారు. భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు మాత్రమే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ నెల 11 నుంచి 15 లోగా పథకాల అమలుకు కావాల్సిన ప్రిపరేటరీ వర్క్ పూర్తి చేయాలని
జనవరి 26 న అంత్యంత ప్రతిష్టాత్మక పథకాలను అమలు చేస్తున్నట్లుగా కలెక్లర్లను ఆదేశించారు.
ఇందుకు సంబంధించి పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకోవాలనీ.. ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుందని, గొప్పగా పనిచేస్తున్నదన్న నమ్మకం ప్రజలకు కలిగించాలి అదే సమయంలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు నెలలో ఒక్కసారైనా హాస్టల్స్ విజిట్ చేసి రాత్రి బస చేయాలనీ సూచించారు.
మహిళా అధికారులు బాలికల హాస్టల్స్ కు వెళ్లి అక్కడి విద్యార్థుల్లో స్ఫూర్తిని ఇవ్వాలని సంక్షేమ ఫలాలు క్షేత్రస్థాయికి చేరేలా చర్యలు తీసుకోవడంతోపాటు బాధ్యతగా వ్యవహరించాలని స్పష్టం చేసారు.
జనవరి 26 తరువాత నేను ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని తెలిపారు. నిర్లక్ష్యం కనిపిస్తే కఠిన చర్యలు తప్పవు అని మరోసారి స్పష్టం చేసిన ముఖ్యమంత్రి రైతు భరోసా విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పంట వేసినా వేయకున్నా వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరానికి రైతు భరోసా ఇస్తామని స్పష్టం చేశారు