ఇప్పటి వరకు లాస్ ఏంజిల్స్ను పూర్తిగా లాస్ చేసిన కార్చిచ్చు.. ఇప్పుడు కాలిఫోర్నియాను కాల్చేస్తుంది. మంటలు వేగంగా విస్తరిస్తుండటంతో కాలిఫోర్నియా ప్రజలు ప్రస్తుతం ఇళ్లు ఖాళీ చేసే పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ కార్చిచ్చు కారణంగా 10 మంది మృతి చెందగా.. రూ.12 లక్షల కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగింది. మొత్తం ఆరు ప్రాంతాల్లో ఇప్పుడు కార్చిచ్చు కొనసాగుతోంది.
హాలీవుడ్ ఇండస్ట్రీకి కేరాఫ్‌గా ఉన్న కొండను కూడా ఇప్పుడు మంటలు దహించి వేస్తున్నాయి. హాలీవుడ్ బౌల్ సమీపంలోకి వచ్చేసింది కార్చిచ్చు. గ్రామన్స్ చైనీస్ థియేటర్, మేడమ్ టుస్సాడ్స్ వద్ద నీళ్లు చల్లే హెలికాప్టర్లు తక్కువ ఎత్తులో తిరుగుతున్నాయి. పసడెనాలో 500 వరకూ బడాబాబుల ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి.
ఇప్పటికే 108 చదరపు కిలోమీటర్ల ప్రాంతం అగ్నికి ఆహుతైంది. ఇది శాన్ ఫ్రాన్సిస్కో నగర విస్తీర్ణంతో సమానం. ఇది ఇంకా పెరుగుతోంది. కార్చిచ్చు కారణంగా పలు హాలీవుడ్ షూటింగ్‌లు ఆగిపోయాయి. యూనివర్సల్ స్టూడియోలను కూడా మూసిశారు. ఆస్కార్ అవార్డులను ప్రదానం చేసే ప్రఖ్యాత డాల్బీ థియేటర్ ఇప్పటికే ఖాళీ అయ్యింది.
ఇప్పటి వరకు పాలిసాడ్స్‌లో దాదాపు 20 వేల ఎకరాలు, ఈటొన్ ఫైర్ కారణంగా 13,600 ఎకరాలు, కెన్నెత్ ఫైర్ కారణంగా 791 ఎకరాలు, సన్‌సెట్ ఫైర్ కారణంగా 60 ఎకరాలు, హురస్ట్ ఫైర్ కారణాంగా 855 ఎకరాలు అగ్నికి ఆహుతయ్యాయి. అంతేకాదు ఈ కార్చిచ్చు కారణంగా 1.80 లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఈ కార్చిచ్చు కారణంగా ఇప్పుడు దోపిడి దొంగలు కూడా పెరిగిపోయినట్టు తెలుస్తోంది. బడాబాబులు ప్రాణభయంతో ఇళ్లను వదిలి వెళ్లడంతో ఇప్పుడక్కడ దోపిడి దొంగలు ఎంటరయ్యారు. ఆ ఇళ్లల్లోని విలువైన వస్తువులను దోచుకెళ్తున్నారు. ఎవరైనా ప్రజలు వదిలి వెళ్లిన ఆస్తుల జోలికి వస్తే కఠిన చర్యలు తప్పవంటున్నారు పోలీసులు. అంతేకాదు ఇప్పటికే 20 మంది దొంగలను కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.