– నిన్నటి నుంచి మరో వైపుకు వ్యాపించిన మంటలు
– అణు బాంబు విస్ఫోటనాన్ని తలపిస్తున్న శాటిలైట్ చిత్రాలు
– కకావికలమవుతున్న జనం.. పది మంది మృతి..
– తరలిపోతున్న ప్రజలు.. ఖరీదైన భవంతులు ఖాళీ
– బూడిద కుప్పలుగా పంటలు..అడవులు
కార్చిచ్చుకు అమెరికాలోని లాస్ ఏంజెలిస్ నగరం కకావికలమవుతోంది. వేలాది ఎకరాల్లో పంట బూడిద కుప్పగా మారింది. శాటిలైట్ చిత్రాలు మరింత దారుణంగా ఉన్నాయి.అంతరిక్షం నుంచి సైతం ఈ మంటలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని ఆ ఇమేజ్ లను చూస్తే తెలుస్తోంది. వందల కోట్ల విలువైన భవంతులన్నీ మసిబొగ్గుల్లా, దయ్యాల కొంపల్లా మారిపోయాయి. అంతరిక్షం నుంచి ఈ ఏరియాను పరిశీలిస్తే.. అణు బాంబు విస్ఫోటనం తర్వాత సీన్ ఎలా ఉంటుందో అలా కనిపిస్తోంది.
లాస్ ఏంజెలిస్ లోని వెస్ట్ హిల్స్ ఏరియా నిన్న సాయంత్రం నుంచి రాత్రంతా నిత్యాగ్ని హోత్రంలా మండుతూనే ఉంది.కొద్ది గంటల వ్యవధిలోనే 900 ఎకరాలు మాడి మసయ్యాయి.దాదాపు పదిమంది ఈ అగ్నికి ఆహుతి అయ్యారు. మరోవైపు మంటలనార్పేందుకు ఫైట్ ఫైటర్స్ మెషినరీ రంగంలోకి దిగినా.. క్షణాల్లో వ్యాపిస్తున్నఅగ్ని కీలల కట్టడి ఎవరికీ సాధ్యం కావడం లేదు. ఇప్పటికే మరో దిక్కున యంత్రాంగం అంతా మోహరించి మంటలనార్పుతుంటే.. మరో వైపు నుంచి మంటలు అంటుకుంటున్నాయి.మంటల ధాటికి కాలిఫోర్నియా ఖాళీ అవుతోంది.వేలాదిగా జనం పొట్ట చేత పట్టుకుని తరలి పోతున్నారు.
ఈ రెండు ప్రాంతాల్లో భారీ నష్టం
పసిఫిక్ పాలిసేడ్స్ ప్రాంతంలో 19వేల ఎకరాలు కాలిపోగా,అల్టా డెనాలో 13 వేల ఎకరాలు అగ్నికి ఆహుతి అయ్యాయి.కాలిఫోర్నియా నేషనల్ గార్డుదళాన్ని రంగంలోకి దింపినా తాళాలేసి ఉన్న ఇళ్లను దొంగలు యధేచ్ఛగా లూటీ చేసేస్తున్నారు. వారిని కట్టడి చేయడం అధికారుల వల్ల కావడం లేదు.పసిఫిక్ పాలిసేడ్స్, అల్టా డెనాలో ఉండే హాలీవుడ్ సెలబ్రిటీలంతా ఇప్పటికే లక్షలు విలువ చేసే ఖరీదైన, విలాసవంతమైన భవనాలను ఖాళీ చేసి వెళ్లిపోయారు.పారిస్ హిల్టన్,ఆంథోనీ హాప్ కిన్స్,బిల్లీ క్రిస్టల్ లాంటి సెలబ్రిటీలు ఈ అగ్ని ప్రమాదానికి దారుణంగా నష్టపోయారు.మరోవైపు మృతుల సంఖ్య పెరుగుతోంది.
కాలిఫోర్నియాచరిత్రలోనూ, అమెరికా చరిత్రలోనూ ఇంత దారుణమైన అగ్నిప్రమాదం ఎన్నడూ జరగలేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆందోళన వ్యక్తం చేశారు.
రాజకీయ రచ్చ
అమెరికాలో అడవుల కార్చిచ్చు రాజకీయంగా కూడా రాజుకుంది. త్వరలో పగ్గాలుచేపట్టునున్న అధ్యక్షుడు ట్రంప్ దీనిని కాలిఫోర్నియా గవర్నర్ గెవిన్ సోమ్ వైఫల్యంగా తిట్టిపోశారు.జలవనరులను సద్వినియోగం చేసుకోకపోవడం, నీటిని దుర్వినియోగం చేయడం వల్ల అవసర సమయంలో మంటలార్పేందుకు నీళ్లే కరువయ్యాయని ఇందుకు గవర్నర్ దే బాధ్యత అనీ విమర్శించారు.
కాలిఫోర్నియా మంటలను అదుపుచేసేందుకు కెనడా ఫైర్ ఫైటర్స్ కూడా రంగంలోకి దిగారు. తాము పగ్గాలు చేపట్టాక కెనడాను 51వ రాష్ట్రంగా పరిగణిస్తామని ట్రంప్ విస్తృతంగా ప్రచారం చేసినా కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో తన పదవికి రాజీనామా చేసినా కెనడా అమెరికాకు అగ్నిప్రమాద నియంత్రణలో సాయపడుతోంది.
మరోవైపు షెల్టర్ హోమ్స్ లో ఉంటున్న వారి సహాయం కోసం విరాళాలు వెల్లువెత్తుతున్నాయి.అమెరికాలో ఇతర రాష్ట్రాలు భారీగా డొనేషన్స్ అందిస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలోనూ ఈ కార్చిచ్చుపై రకరకాల కుట్రకథనాలు సర్క్యులేట్ అవుతున్నాయి. ఫైర్ ఫైటర్స్ ను, యంత్రాంగాన్ని, జల వనరులను ఉక్రెయిన్ యుద్ధానికి తరలిస్తున్నారని అందుకే ఈ క్రైసిస్ ను ఎదుర్కొనడంలో అమెరికా విఫలమైందని కథనాలు ప్రచారమవుతున్నాయి.
కాలి పోతున్న వృక్ష సంపద..ఎండిన పొలాలు
కాలిఫోర్నియాలో రెండు దశాబ్దాల పాటు వేధించిన కరువు,ఆపై వచ్చిన అతిభారీ వర్షాల వల్ల పెరిగిన వృక్ష సంపద ఇప్పుడు ఎండిపోయి నిప్పు రాజుకోడానికి, మంటల వ్యాప్తికి కారణమైందని తెలుస్తోంది.దక్షిణ కాలిపోర్నియాలో ఎనిమిది నెలలుగా భారీ వర్షాలన్నవి చూడలేదు.అందుకే పంటలు ఎండిపోయి కాలిపోయాయి. పరిస్థితి ఏ మాత్రం ఆశాజనకంగా లేదని, పొడి వాతావరణం, బలమైన గాలులతో ఈ మంటలు మరింత విస్తరించే ప్రమాదముందని వాతావరణ కేంద్రం చెబుతోంది.