ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పేడెక్స్ శాటిలైట్స్ డాకింగ్‌ను మరోసారి వాయిదా పడింది. PSLV C60 రాకెట్ ద్వారా నింగిలోకి మొత్తం 24 పేలోడ్‌లను మోసుకెళ్లింది. ఇందులో చేజర్, టార్గెట్ ఉపగ్రహాలు ఉన్నాయి. ఈ రెండింటిని స్పేస్‌లో డాకింగ్ చేయాలని ఇస్రో నిర్ణయించింది. ఈ నెల 7న డాకింగ్ చేయాలని నిర్ణయించారు. అయితే రెండు ఉపగ్రహాలను 225 మీటర్ల దగ్గరికి తెచ్చినప్పుడు వాటి దిశ ఊహించిన దాని కంటే కాస్త తేడాగా ఉండటంతో డాకింగ్ ప్రక్రియను వాయిదా వేస్తున్నట్టు ఇస్రో ప్రకటించింది.
అయితే బుధవారం కూడా ఇదే పరిస్థితి తలెత్తడంతో మరోసారి ఈ ప్రక్రియను వాయిదా వేసింది ఇస్రో. గురువారం లేదా శుక్రవారం మరోసారి డాకింగ్ ప్రక్రియను చేపట్టనుంది ఇస్రో. ఇప్పటికే రెండు సార్లు డాకింగ్‌ను వాయిదా వేయడంతో అనేక అనుమానాలు మొదలయ్యాయి. అసలు శాటిలైట్లు ఇస్రో కమాండ్స్‌కు స్పందిస్తున్నాయా? లేదా? అని. కానీ ఈ అనుమానాలన్నింటిని ఇస్రో కొట్టిపారేస్తుంది. శాటిలైట్లు చక్కగా పనిచేస్తున్నాయని.. మరోసారి డాకింగ్ ప్రక్రియకు ప్రయత్నిస్తామని తెలిపింది.
ఇస్రో భవిష్యత్ ప్రయోగాలకు ఈ డాకింగ్ ప్రక్రియ ఓ మొదటి అడుగుగా భావించవచ్చు. ఎందుకంటే అతి త్వరలో స్పేస్‌లో భారత్ స్పేస్ స్టేషన్‌ను నిర్మించాలని చూస్తోంది. అది జరగాలంటే విడతలవారీగా ప్రయోగాలు చేసి వాటిని స్పేస్‌లో డాకింగ్ చేయాల్సి ఉంటుంది. అందుకే ఇస్రో ఈ ప్రయోగాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.