మొన్నటి వరకు ఛాంపియన్స్ ట్రోఫీ మా దేశంలోనే నిర్వహించాలి.. ఏ టీమ్ అయినా మా దేశానికే రావాల్సిందే అంటూ కొండెక్కి కూర్చొంది పాకిస్థాన్ క్రికేట్ బోర్డు. కానీ ఆ పీసీబీ నిర్వాకం మాత్రం మరోలా ఉంది. మాటలు కోటలు దాటుతుంటే.. ఏర్పాట్లను చేయడంలో మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా మారింది పరిస్థితి. ఎందుకంటే మరో నెల రోజుల్లో ప్రారంభమయ్యే ట్రోఫీని నిర్వహించడానికి ఇంకా స్టేడియాలు సిద్దం కాలేదు.
ఫిబ్రవరి 19 నుంచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పాక్ వేదికగా ప్రారంభం కానుంది. బీసీసీఐ తాము దాయాది దేశానికి వచ్చేది లేదని తెగేసి చెప్పడంతో హైబ్రీడ్ మోడల్‌లో పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా ఈ మెగా టోర్నమెంట్ జరగనుంది. అయితే పాక్‌లో జరిగే మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్న స్టేడియాలు ఇంకా పూర్తిగా సిద్ధం కాలేదు. లాహోర్, కరాచీ, రావల్పిండి మైదానాలు ఇంకా రెడీ కాలేదు. ఒక స్టేడియంలోనైతే కనీసం ప్లాస్టింగ్ పనులు కూడా పూర్తికాలేదు.
అయితే ఇలా స్టేడియాలు సిద్ధం కాకపోవడంపై ఐసీసీ రియాక్ట్ అవుతున్నట్టు తెలుస్తోంది. మొత్తం మూడు స్టేడియాలు సిద్ధం కాలేదని.. కానీ పనులు మాత్రం జరుగుతున్నాయని..ఫ్లడ్ లైట్లు, సీట్లు, అవుట్ ఫీల్డ్‌కు సంబంధించిన పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్నట్టు ఐసీసీ గుర్తించినట్టు తెలుస్తోంది. అయితే ఈ పనులను పూర్తి చేసేందుకు అక్కడి వాతావరణం సహకరించడం లేదని తెలుస్తోంది. నిజానికి ఫినిషింగ్ వర్క్స్‌కే ఎక్కువ సమయం పడుతుంది. నిజానికి ఐసీసీ ఇవెంట్స్ నిర్వహించే బోర్డులు.. వీటిని పూర్తి చేసి ఐసీసీకి అప్పగించాల్సి ఉంటుంది. అప్పగించిన తర్వాత వాటి క్వాలిటీని ఐసీసీ చెక్ చేస్తోంది. గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా అవి ఉన్నాయో లేదో చెక్ చేస్తోంది ఐసీసీ. కానీ ఇప్పటి వరకు కూడా చాలా పనులు పెండింగ్‌లో ఉండటంతో స్టేడియాలు పూర్తిగా సిద్ధమవుతాయా? లేక అరకొరగా పూర్తి చేసి అప్పగించేస్తారా? అనే అనుమానాలు తెరపైకి వస్తున్నాయి.