రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటన
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార సర్వదర్శన టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. మృతులకు 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. తిరుపతి నగరంలోని బైరాగిపట్టెడలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈఘటనలో మరో 48 మంది అస్వస్థతకు గురయ్యారు. గాయపడ్డవారిని రుయా, స్విమ్స్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న వారిలో 21 మందిని ఇప్పటికే డిశ్చార్జ్ చేశారు. మిగిలిన వారిలో ముగ్గురు మినహా మిగితా అందరినీ గురువారం సాయంత్రానికి డిశ్చార్జ్ చేయనున్నట్లు స్విమ్స్ సూపరిండెంట్ రవికుమార్ తెలిపారు. ఆ ముగ్గురికి మరో మూడు, నాలుగు రోజుల పాటు వైద్య సేవలు అవసరం పడతాయని రవికుమార్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా తిరుపతి తొక్కిసలాట ఘటనపై రెండు కేసులు నమోదు చేశారు. బైరాగిపెట్టె పద్మావతి పార్క్లో తొక్కిసలాట ఘటనపై ఈస్ట్ పీఎస్లో నారాయణపురం ఎంఆర్వో ఫిర్యాదు. విష్ణు నివాసంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై బాలయ్యపల్లె ఎంఆర్వో ఫిర్యాదు.