నల్లగొండ జిల్లాలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ హాస్టల్లో విద్యార్థినులకు బ్రేక్‌ఫాస్ట్‌లో గొడ్డుకారం, ఉప్పుతో అన్నం వడ్డించడం కలకలం రేపుతోంది. హాస్టల్ విద్యార్థినులు ఈ దృశ్యాలు ఫోటోతీసి సోషల్ మీడియాలో పెట్టడంతో తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే, ఈ పరిణామంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఫలితంగా దీనిపై ఉన్నతాధికారులు ప్రకటన చేయాల్సి ఉంది.
నల్లగొండ జిల్లాకేంద్రం సమీపంలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయానికి చెందిన కృష్ణవేణి లేడీస్ హాస్టల్లో మంగళవారం విద్యార్థినులు బ్రేక్ ఫాస్ట్ చేసేందుకు మెస్‌కు వెళ్లారు. అక్కడ బ్రేక్‌ఫాస్ట్‌కు బదులు అన్నంతోపాటు గొడ్డుకారం విద్యార్ధినులకు పెట్టారు. విద్యార్థులు ప్లేట్లతో క్యూలో ఉండగా అన్నం, కారం బేసిన్, ఉప్పు డబ్బా పక్కపక్కనే పెట్టి వడ్డించారు.
దీంతో, విద్యార్ధినులు తమకు అందిస్తున్న భోజనం ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవికాస్తా వైరల్ అయ్యాయి. మహాత్మాగాంధీ యూనివర్సిటీలో కారం అన్నమే బ్రేస్ట్‌ఫాస్ట్ అంటూ కామెంట్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే అదే రోజు సాయంత్రం అదే విద్యార్థినులతో మరో ప్రకటన చేయించారు హాస్టల్ నిర్వాహకులు, యూనివర్సిటీల అధికారులు. బ్రేక్‌ఫాస్ట్‌లో తమకు బోండా పెట్టారని, తాము కోరడం వల్లే గొడ్డుకారం అన్నం పెట్టారంటూ మరో లెటర్ విడుదల చేయించారు.
అంతేకాదు.. మరోవైపు.. కొందరు విద్యార్థినుల తల్లిదండ్రులు మాలధారణలో ఉన్నారని, చలికాలం కావడంతో కూర ఉన్నప్పటికీ కారం అడగడం వల్లే ఇచ్చామని హాస్టల్ సిబ్బంది వివరణతో మరో లెటర్ కూడా విడుదల చేశారు. అయితే, సాయంత్రం హడావిడిగా ఈ లెటర్లు రాయించి విడుదల చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. వార్డెన్లు రాజేశ్వరి, జ్యోతితో చర్చించి.. ప్రత్యక్షంగా తనిఖీలు చేయించామని, దీనిపై మరోసారి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హాస్టల్ డైరెక్టర్లు దోమల రమేశ్, కళ్యాణి ప్రకటించారు.
ఇక, ఇదే అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపైతీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి ఒక ప్లేట్ భోజనం ఖర్చు 32వేలు.. అదే చదువుకునే విద్యార్థులకు మాత్రం గొడ్డుకారంతో భోజనం పెడతారా? అని ప్రశ్నించారు. వారెవ్వా ప్రజా పాలన.. శభాష్ ఇందిరమ్మ రాజ్యం అంటూ ఎద్దేవా చేశారు. మరో ట్వీట్ లో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ యూపీలో ఇదే తరహా ఘటనపై స్పందించడాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ప్రియాంక గాంధీ 2019లో ఆమె చేసిన ప్రకటనను గుర్తు చేసుకుని తెలంగాణ విద్యార్థుల గురించి కూడా ఆలోచించాలని సూచించారు. లేదంటే యూపీలో జరిగినప్పుడే దీన్ని జాతీయ సమస్యగా పరిగణిస్తారా? వేరే రాష్ట్రంలో జరిగితే వదిలేస్తారా. అని నిలదీశారు. ఇది తెలంగాణ కాబట్టి ఉప్పు మాత్రమే కాకుండా.. ఉప్పుతో పాటు కారం కూడా ఉండటంతో వార్తకు స్పైసీనెస్ తగ్గిందా? లేదా సమస్య తీవ్రత తగ్గిందని భావిస్తున్నారా? అని కేటీఆర్ ప్రశ్నించారు.