- గంభీర్ తో ముదురుతున్న విభేదాలు
- టీమ్ ఇండియా వైఫల్యాలకు కోచ్ కారణమా?
టీమ్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్ లో…అసలేం జరుగుతోంది? ఎందుకింత అధ్వానంగా మనవాళ్లు ఆడుతున్నారు. కోచ్ ని వెళ్లగొట్టాలంటే, ఇలాగే ఆడాలా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు గౌతం గంభీర్ కూడా మొదటి నుంచి ఆవేశపరుడే. క్రికెట్ లో ఆటగాడిగా అది కావాలి. కానీ కోచ్ గా అదస్సలు పనికిరాదు.
గౌతం గంభీర్ కారణంగానే మనస్థాపంతో అశ్విన్ అర్థాంతరంగా ఆటకు గుడ్ బై చెప్పి వెళ్లాడనే ప్రచారం ఇప్పుడు వేడెక్కుతోంది. టీమ్ ఇండియా ఘోర ఓటమి నేపథ్యంలో మళ్లీ అశ్విన్ పాత్ర తెరపైకి వస్తోంది.
కోచ్ గంభీర్ తో పడకపోవడం వల్లే తను మనస్థాపంతో
అప్పటికప్పుడు రిటైర్మెంట్ ప్రకటించాడని అంటున్నారు.
అంతేకాదు సీనియర్లను పక్కన పెట్టకపోతే టీమ్ ఇండియాపై పట్టు సాధించలేనని, తన మాట ఎవరూ వినడం లేదని గంభీర్ పైకి చెబుతున్నట్టు సమాచారం. అయితే అందుకు బోర్డు సంసిద్ధంగా లేనట్టు సమాచారం. అదీకాక గంభీర్ వల్లే అశ్విన్ అర్థాంతరంగా వెళ్లాడంటే మాత్రం అది క్షమించరాని నేరంగా చెబుతున్నారు.
గంభీర్ చెబుతున్నంత ఈజీకాదు సీనియర్లను మార్చడమని కొందరు అంటున్నారు. ఎందుకంటే ఇదే జట్టు 2023 వన్డే వరల్డ్ కప్ లో అప్రతిహిత విజయాలతో ఫైనల్ వరకు వెళ్లింది. ఆరు నెలల ముందే 2024లో టీ 20 ప్రపంచకప్ గెలిచింది. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ లో చివరి వరకు రేస్ లో నిలిచింది. మరి అదే జట్టు , ఇంతలోనే ఎంత మార్పు? అని ఆశ్చర్యపోతున్నారు.
అదే కోచ్ గంభీర్ వచ్చిందగ్గర నుంచే జట్టు పరిస్థితి ఇలా తగలడిందని అంటున్నారు. ఆటగాళ్ల ఎంపికలో రోహిత్ శర్మ ప్రమేయం లేకపోవడంతో తనకి ఆసక్తి లేకుండా పోయిందని అంటున్నారు. డ్రెస్సింగ్ రూమ్ లో ఒక ఆహ్లాదకర సందడి వాతావరణం మొత్తం పోయిందని, అంతా సీరియస్ గా మారిందని అంటున్నారు.
అలాగే గంభీర్ తీసుకొచ్చిన బౌలింగ్, బ్యాటింగ్ కోచ్ ల కారణంగా మొత్తం వీరి ఆటతీరు మారిపోయిందని అంటున్నారు. అన్నింటికి మించి గంభీర్ వచ్చిన తర్వాత ఆటగాళ్ల డౌన్స్ ని ఇష్టం వచ్చినట్టు మార్చడం కూడా చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి ఒక ట్రాక్ లో నడుస్తున్న టీమ్ ఇండియా ట్రైన్ ని, వేరే ట్రాక్ మీదకి గంభీర్ ఎక్కించాలని చూడటంతో పరిస్థితి తలకిందులైపోయిందని అంటున్నారు.