గందరగోళంలో టీమ్ ఇండియా
బోర్డర్-గవాస్కర్ సిరీస్ లో టీమ్ ఇండియా ఘోర పరాజయంతో వరల్డ్ టెస్టు ఛాంపియన్ రేస్ నుంచి బయటకు వచ్చేసింది. ఏడాది పొడవునా నెంబర్ వన్, నెంబర్ టూ పొజిషన్ లో ఉండి, చివర్లో చతికిలపడటంతో అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ముఖ్యంగా నలుగురు ఆటగాళ్ల ఆటతీరుపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆ నలుగురు ఎవరంటే కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ, రవీంద్ర జడేజా, శుభ్ మన్ గిల్… వీరిలో ముగ్గురి మెడపై కత్తి అయితే, వేలాడుతోంది. కేఎల్ రాహుల్ పరిస్థితి అలాగే ఉండేది కానీ, బతికిపోయాడు. ఈ టూర్ లో గుడ్డిలో మెల్లగా ఐదు టెస్టులు ఆడి…276 పరుగులు చేశాడు. టాప్ 5లో నిలిచాడు.
రోహిత్ శర్మ అయితే అత్యంత దారుణంగా విఫలమయ్యాడు. మూడు టెస్టు మ్యాచ్ ల్లో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. కెప్టెన్ గా కూడా వైఫల్యాలు కనిపిస్తున్నాయి. ఫీల్డింగ్ సెటప్ దారుణంగా ఉంది. సమయాన్ని బట్టి బౌలింగు మార్చడంలో విఫలమవుతున్నాడనే విమర్శలు వచ్చాయి. టాస్ గెలిచి కూడా టెస్టు మ్యాచ్ లు ఓడిపోవడం సరికాదని అంటున్నారు. వీటన్నింటి బట్టి చూస్తే, తన టెస్టు కెరీర్ దాదాపు ముగిసినట్టేనని అంటున్నారు.
విరాట్ కొహ్లీ పరిస్థితి నానాటికి తీసికట్టుగా మారుతోంది. ఎప్పుడైతే లండన్ లో మకాం పెట్టాడో అప్పుడే ఆటకు మంగళం పాడేశాడు. మాట్లాడితే చాలు…లండన్ ఫ్లయిట్ ఎక్కేస్తున్నాడు. అక్కడ ప్రాక్టీస్ మొత్తం పోయినట్టే కనిపిస్తోంది. ఇక నుంచైనా.. రాబోవు రోజల్లో మంచిగా ఆడి, పరువు పోగొట్టుకోకుండా రిటైర్ కావాలని అభిమానులు కోరుతున్నారు. ఆస్ట్రేలియాలో ఐదు టెస్టుల్లో 9 ఇన్నింగ్స్ ఆడి, 190 పరుగులు మాత్రమే చేశాడు. అందులో ఒక సెంచరీ ఉంది. మిగిలిన 8 ఇన్నింగ్స్ ల్లో కలిపి కేవలం 90 పరుగులు మాత్రమే చేశాడు. ఇక కొహ్లీ కథ కూడా కంచికి చేరినట్టే కనిపిస్తోంది.
రవీంద్ర జడేజా…తను కూడా వెటరన్ ప్లేయర్ అయిపోయాడు. ఈమధ్య తన మ్యాజిక్ పనిచేయడం లేదు. బ్యాటింగ్ లో కూడా ఎప్పుడో ఒక మ్యాచ్ ఆడుతున్నాడు. కానీ ఆస్ట్రేలియా టూర్ లో విలువైన పరుగులు చేశాడు. మొత్తమ్మీద 135 పరుగులు చేశాడు. కానీ బౌలింగులో ఘోరంగా విఫలమయ్యాడు. కేవలం 4 వికెట్లు మాత్రమే తీశాడు. ఓవరాల్ గా చూస్తే ఆఖరి పది టెస్టుల్లో తను 6 వికెట్లు మాత్రమే తీయగలిగడు.
చివరిగా చెప్పాలంటే…యువ క్రికెటర్ శుభ్ మన్ గిల్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఎన్ని అవకాశాలిచ్చినా ఉపయోగించుకోలేకపోతున్నాడు. మూడు టెస్టులు ఆడి 91 పరుగులు చేశాడు. సీనియర్లు ఆదుకోలేని మ్యాచ్ ల్లో యువతరం నిలబెట్టాల్సిన తరుణంలో వీరు అదే బాటలో నడవడంతో టీమ్ ఇండియా కోలుకోలేక పోయింది.
తర్వాత ఏమిటి? అనే ప్రశ్న వస్తే… ఆస్ట్రేలియా టూర్ తర్వాత టీమ్ ఇండియా ఫిబ్రవరి 19 నుంచి జరిగే ఛాంపియన్ ట్రోఫీ ఆడనుంది.ఇందులో మరి సీనియర్లు, సూపర్ సీనియర్లు ఆడతారా? లేక ఇక్కడ నుంచే గుడ్ బై చెప్పేస్తారా? అనేది చూడాలి. మళ్లీ టెస్ట్ క్రికెట్ ఆడాలంటే మాత్రం… 2025 జూన్ వరకు ఎదురుచూడాల్సిందే.
ఇంగ్లాండ్‌లో 5 టెస్ట్ మ్యాచ్‌లు ఆడేందుకు భారత్ వెళ్లాల్సి ఉంది. ఈ ఆరునెలల కాలంలో ముగ్గురి సీనియర్ల భవితవ్యం ఏమిటి? అనేది కాలమే చెప్పాలి. లేదంటే వారే చెప్పాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.