- మహాయుతి గూటికి 8మంది శరద్ పవార్ ఎంపీలు?
- సుప్రియా సూలేకు కేంద్ర కేబినెట్ లో మంత్రి పదవి?
- లోక్‌సభలో 301 ఎంపీలకు చేరనున్న ఎన్‌డీఏ బలం
మహారాష్ట్రలో ఘోరమైన ఓటమి భారంతో డీలాపడిపోయిన మహా వికాస్ అఘాడీ కూటమిని కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. కూటమి భాగస్వామి అయిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ లోని శరద్ పవార్ వర్గం (ఎస్పీ వర్గం) అఘాడీ కూటమికి రాం రాం చెప్పేసేలా ఉంది. శరద్ పవార్ కు చెందిన 8మంది ఎంపీలు అజిత్ పవార్ వర్గంలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఇదే జరిగితే లోక్ సభలో ఎన్డీఏ కూటమి బలం 301 కి చేరే అవకాశముంది. వన్ నేషన్, వన్ ఎలక్షన్ లాంటి అనేక కీలక బిల్లుల ఆమోదానికి ఎన్డీఏ కూటమి సరైన బలం లేక అవస్థలు పడుతోంది. ఈ నేపధ్యంలో ఈపరిణామాలు ఆసక్తికరంగా మారాయి.
ఎస్పీ వర్గం ఎంపీలందరూ అజిత్ పవార్ తో టచ్ లోనే ఉన్నారని తొందరలోనే ఈ విషయం వెల్లడిస్తారని తెలుస్తోంది. ఇది నిజమైతే శరద్ పవార్ నాయకత్వానికి పెద్ద ఎదురు దెబ్బగానే భావించాలి. ఇప్పటికే అజిత్ పవార్ వర్గాన్ని ఎన్నికల సంఘం అసలైన పార్టీగా గుర్తించింది. పార్టీ సింబల్, జెండా, పేరు కూడా అజిత్ పవార్ కే దక్కడంతో శరద్ పవార్ వర్గానికి ఎలాంటి ప్రాధాన్యతా లేకుండా పోయింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా శరద్ పవారే మహాయుతి కూటమితో జత కట్టేందుకు మంతనాలు జరుపుతున్నారని మరో సమాచారం. అయితే దీనికి ఆయన కొన్ని షరతులు పెడుతున్నారని తెలుస్తోంది. తన కుమార్తె సుప్రియా సూలేకు కేంద్ర కేబినెట్ లో స్థానం కల్పించాలన్నది ఆ డిమాండ్లలో ప్రధానమైనది. బారామతి నుంచి ఎంపీగా ఎన్నికైన సుప్రియా సూలే ఈమధ్య మహారాష్ట్ర సీఎం దేవేంద్రఫడ్నవిస్‌ను పొగడ్తలతో ముంచెత్తడం ఈ ఊహాగానాలకు ఊతమిస్తోంది. మహాయుతి కూటమిలో సీఎం ఫడ్నవిస్ ఒక్కరే క్రియాశీలకంగా పనిచేస్తున్నారని, తన నాయకత్వ సమర్ధతను చాటుకుంటున్నారని, కూటమిలో ఇతర మంత్రులు ఎవరూ పనిచేస్తున్నట్లు కనిపించడం లేదని సుప్రియాసూలే నాలుగు రోజుల క్రితం కామెంట్ చేశారు.
ఈ చేరికలు నిజమైతే మహా వికాస్ అఘాఢీ కూటమికి, ఇండియా కూటమికి పెద్ద దెబ్బగానే పరిగణించాలి. ఎందుకంటే శరద్ పవార్ వర్గం పోటీ చేసిన 10 ఎంపీ సీట్లలో ఏకంగా 8 గెలుచుకుంది. ఇప్పుడీ ఎంపీలంతా అజిత్ పవార్ వర్గంలో చేరితే వికాస్ అఘాఢీ కూటమి మనుగడే దెబ్బతింటుంది. ఇండీ కూటమిలో కీలక భాగస్వామి అయిన శరద్ పవార్ తప్పుకుంటే కాంగ్రెస్ కు పెద్ద దెబ్బగానే భావించాలి.
2023లో అజిత్ పవార్ వర్గం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీనుంచి చీలిపోయి బీజేపి కూటమిలో చేరి అధికారం దక్కించుకోవడంతో శరద్ పవార్ వర్గానికి కష్టాలు మొదలయ్యాయి.ఎన్నికల సంఘం కూడా అజిత్ పవార్ వర్గమే అసలైనదని గుర్తించిన నేపధ్యంలో శరద్ పవార్ కూడా తన రాజకీయ మనుగడకోసం బీజేపి కూటమితో జత కడతారని అంటున్నారు.బహుశా కొన్ని రోజుల్లో ఈ చేరిక పూర్తవుతుంది.