ఆంధ్రప్రదేశ్లో గడిచిన ఎనిమిది నెలల్లో 38వేల 500 మంది ఓటర్లు పెరిగారు. గత యేడాది మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో మొత్తం 4,14,01,887 మంది ఓటర్లు ఉండగా.. ఇప్పుడు ఓటర్ల సంఖ్య 4,14,40,447కు పెరిగింది. కర్నూలు జిల్లాలో ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంగా.. అల్లూరి సీతారామరాజు జిల్లాలో తక్కువ సంఖ్యలో ఓటర్లున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన తుది ఓటర్ల జాబితా వివరాలివి.
ఆంధ్రప్రదేశ్లో కొత్త ఓటర్ల జాబితా ప్రకారం చూస్తే.. పురుష ఓటర్లు 2,03,52,816 కాగా, మహిళా ఓటర్ల సంఖ్య 2,10,84,231గా ఉంది. వీళ్లు కాకుండా.. థర్డ్ జెండర్ ఓటర్లు 3,400 మంది ఉన్నారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణకు సంబంధించిన తుది జాబితాను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ విడుదల చేశారు. రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 20,64,184 మంది ఓటర్లు ఉండగా అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 7,73,388 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 7,31,415 మంది అధికంగా ఉన్నారు. 26 జిల్లాల్లోనూ మహిళా ఓటర్లే ఎక్కువగా ఉండటం గమనార్హం.
ఇక, రాష్ట్రవ్యాప్తంగా యువ ఓటర్లు భారీగా పెరిగారు. 2024 అక్టోబరు 29న విడుదల చేసిన ముసాయిదా జాబితాలో 4,86,226 మంది యువ ఓటర్లు ఉండగా.. తుది జాబితాలో ఆ సంఖ్య 5,14,646కు చేరింది. 28,420 మంది యువ ఓటర్లు గత రెండు నెలల కాలంలో అదనంగా చేరారు. రాష్ట్రంలో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 16,189 మంది సర్వీసు ఓటర్లు ఉండగా.. 6,655 మంది ఓటర్లతో ప్రకాశం జిల్లా రెండో స్థానంలో ఉంది. సర్వీసు ఓటర్లు అతి తక్కువగా ఉన్న జిల్లాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లాలో 287 మంది, ఎన్టీఆర్ జిల్లాలో 374 మంది తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
గత యేడాది అక్టోబరులో ముసాయిదా జాబితా విడుదల చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ చేరిన కొత్త ఓటర్ల సంఖ్య 1,02,227గా నమోదయ్యింది. వారిలో పురుషులు 47,258 మంది కాగా, మహిళా ఓటర్లు 54,931 మంది, థర్డ్ జెండర్ ఓటర్లు 38గా ఉన్నారు. ఇక, 2024 అక్టోబరులో ముసాయిదా జాబితా విడుదల చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ జాబితాలో నుంచి తొలగించిన ఓటర్ల సంఖ్య 82,262 మందిగా ఉందన్నారు. ఓటర్ల జాబితాలోంచి పేర్లు తొలగించిన వారిలో మృతులు 25,602 మంది ఉండగా.. వలసల కారణంగా తొలగించిన ఓట్లు 46,295గా ఉన్నాయి. ఇక, దివ్యాంగ ఓటర్లు 5,18,383 మంది కాగా.. ఓటరు జనాభా నిష్పత్తి చూస్తే.. ప్రతి వెయ్యి మందికి జనాభాకు 719 మంది ఓటర్లు ఉన్నారు. రాష్ట్రంలోని మొత్తం పోలింగ్ కేంద్రాలు 46,397. మరోవైపు..నియోజకవర్గాల వారీగా ఓటర్ల లెక్కలు చూస్తే రాష్ట్రంలో అత్యధికంగా భీమిలిలో 3,65,862 మంది ఓటర్లు ఉన్నారు. రెండో స్థానంలో గాజువాక లో 3,34,910 మంది ఓటర్లు ఉండగా, మూడో స్థానంలో పాణ్యంలో 3,33,134 ఓటర్లు ఉన్నారు. రాష్ట్రంలో అత్యల్ప ఓటర్లు ఉన్న నియోజకవర్గాల్లో నరసాపురం 1,70,756 ఓటర్లలో కిందినుంచి మొదటి స్థానంలో ఉండగా.. 1,79,880 ఓటర్లతో ఆచంట నియోజకవర్గం రెండో స్థానంలో ఉంది.