ధార్మిక ఆచార్యుల నిర్ణయం ప్రకారమే దేవాలయాలు నిర్వహించాలి.. చినజీయర్ స్వామి
దేవాలయాల్లో పూజా విధానాలు, ధార్మిక కార్యక్రమాలు ఎలా చెయ్యాలో… ఏం చెయ్యాలో ధర్మాధికారి చెప్పాలా లేక ఎండోమెంట్ అధికారులు చెప్పాలా అని చినజీయర్ స్వామి నిలదీశారు. హైందవ శంఖారావం సభలో చినజీయర్ స్వామి మాట్లాడుతూ భక్తితోటి, అంకిత భావంతోటి ఎండలను కూడా లెక్క చెయ్యకుండా ఇక్కడకి వచ్చిన అందరికీ మంగళాశాసనాలు తెలిపారు. ఆలయాల మీద మీకుండే ప్రేమ, వాటిని కాపాడుకోవాలనే మీకున్న దీక్ష వర్ధిల్లాలని చినజియ్యర్ స్వామి ఆకాంక్షించారు. 80 ఏళ్ళ వృద్ధులు కూడా చేతికర్రల సహాయంతో ఈ శంఖారావానికి వస్తున్నారని అన్నారు. సెల్ ఫోన్ కరెంటు పెట్టి ఎలా రీచార్జ్ చేస్తామో మన శరీరానికి కూడా దేవాలయాలకి వెళ్ళి రీచార్జ్ చేసుకుంటామని అటువంటి దేవాలయాల్లో వ్యవస్ధ బాగుండాలా వద్దా అని ప్రశ్నించారు. ఆలయాలు బాగుండాలి, పది కాలాల పాటు ప్రజల్లో ఆధ్యాత్మిక భావనలు కలగాలనే ఉద్దేశంతో ఆనాటి రాజులు, జమిందార్లు నిర్మాణ సమయంలోనే వందల ఎకరాలు, కిలోల లెక్కన బంగారు ఆభరణలు ఆలయాలకు రాసి ఇచ్చేవారని జీయర్ స్వామి తెలిపారు. మన రాష్ట్రంలో దేవాలయాలకు సుమారు 15 లక్షల ఎకరాల భూమి ఆలయాలకు ఉండేదట.. దేవాదాయ శాఖ చేతిలోకి వెళ్లాక ఐసుగడ్డలా కరిగి ఇప్పుడు నాలుగున్నర లక్షల ఎకరాలు మిగిలాయని చినజీయర్ స్వామి వివరించారు. ఆలయాలు ఎవరి ద్వారా నడపాలనే విషయం మీకు తెలియడం కోసమే ఇక్కడకి పిలిచామని అన్నారు. ఆలయాలు కట్టుకున్న మనకి వాటిని ఎలా నడపాలో తెలియదా అని ప్రశ్నించారు. దేవాలయాల్లో ధార్మిక పరమైన నిర్ణయాలు విగ్రహాల ప్రతిష్టాపన చేసిన పెద్దల చెప్పుచేతల్లో ఉండాలి తప్పితే అధికారుల చేతుల్లో ఉండకూడదని చినజీయర్ స్వామి స్పష్టం చేశారు. అధికారులకు దేవాలయాల్లో అది చేయకూడాదు, ఇది చేయకూడదు అని చెప్పే అధికారం ఉండకూడదు పెద్దలు నిర్ణయం చేస్తే అధికారులు అమలు చేయాలి తప్పితే అంతకు మించి ప్రమేయం వారికి ఉండకూడదన్నారు. దేవాలయాల్లో మేజింగ్ ట్రస్టీలు పెట్టుకోవచ్చన్న చట్టాన్ని దుర్వినియోగం చేసి ఈరోజు ట్రస్ట్ బోర్డుల్లోకి రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు వచ్చి ఆలయపు ఆస్తులు, సాంప్రదయాలను కూడా పాడు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరాధినాది విధానాలను నిర్ణయం చేయడానికి సంప్రదాయ, ధార్మిక ఆచార్యుల ఉన్నారు వారి ఆదేశాలకు విరుద్దంగా దేవాలయాల్లో ఏదీ జరగకూడదుని చినజీయర్ స్వామి పునరుద్ఘాటించారు.