32 C
Hyderabad
Wednesday, June 3, 2026

Live Video

spot_img

కాంగ్రెస్‌లో కేసీ పర్యటన టెన్షన్

– ఈనెల 8న కేసీ వేణుగోపాల్, హైదరాబాద్ పర్యటన
– పార్టీ ముఖ్య నేతలతో భేటీలు
– వన్ టూ వన్ మీటింగ్స్
– ప్రస్తుత రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్‌ మున్షీపై వేటు
– కొత్త ఇంచార్జిగా తెరపైకి అశోక్ గెహ్లాట్
– ప్రభుత్వానికి, పార్టీకి మధ్య గ్యాప్‌పై అధిష్టానం దృష్టి
– బీఆర్ఎస్ స్పీడ్‌పైనా చర్చ
– కౌంటర్ స్పీడ్‌పై దిశా నిర్దేశం చేయనున్న వేణుగోపాల్

తెలంగాణ కాంగ్రెస్‌లో భారీ మార్పులకు రంగం సిద్ధమైంది. ఈ మార్పులకు స్వయంగా పార్టీ అధిష్టానమే శ్రీకారం చుడుతోంది.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఆ పార్టీకి అత్యంత కీలకమైంది. తెలంగాణ పార్టీలో ఆల్ ఈజ్ వెల్‌గా ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయని పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఏడాది పాలన ఏ విధంగా సాగింది? పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సఖ్యత ఏ రకంగా ఉంది? ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి కీలక అంశాలపై రాష్ట్ర నాయకత్వానికి డైరెక్షన్ ఇచ్చేందుకు స్వయంగా పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ కు రానున్నారు. ఈనెల 8వ తేదీన కేసీ వేణుగోపాల్ పార్టీ ముఖ్య నేతలతో భేటీకానున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షులు మహేష్‌కుమార్‌ గౌడ్‌, అలాగే, మరికొంతమంది ముఖ్య నేతలతో ఆయన సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వన్ టు వన్ మీటింగ్‌లు ఉంటాయని పార్టీ వర్గాలు తెలిపాయి. ఏడాది కాలంలోనే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ హడావిడి ప్రారంభమైందని, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై బీఆర్ఎస్ ప్రతిరోజూ ఆరోపణలు, ఎక్కడ ఛాన్స్‌ దొరికినా విమర్శలు చేస్తోంది. ముఖ్యంగా రైతు భరోసా వంటి పథకాలు.. అదేవిధంగా ఇచ్చిన హామీలు అంటే ఆరు గ్యారెంటీలు అమలు చేయట్లేదని హడావిడి చేస్తున్న నేపథ్యంలో ప్రజలకు వాస్తవాలు తెలపాలని కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే రాష్ట్ర నాయకత్వానికి సూచించింది. జిల్లా పర్యటనల్లో మంత్రులు ఈ దిశగా పని చేయాలని అధిష్టానం సూచించింది. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, నిరుద్యోగ సమస్య వంటి అంశాలను ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లాలని తద్వారా బీఆర్ఎస్‌ను కట్టడి చేయొచ్చని సీనియర్ నాయకులు భావిస్తున్నారు. అలాగే, రైతు భరోసాకి సంబంధించి 15,000 ఇస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినప్పటికీ.. ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని దానిని 12 వేలకు పరిమితం చేస్తున్నట్లుగా ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీనిపైనా బీఆర్ఎస్‌తో పాటు బీజేపీ కూడా తనదైన శైలిలో విమర్శలు చేస్తోంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు సాగిస్తున్నాయి.

ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని కేసీ వేణుగోపాల్, హైదరాబాద్‌కు వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మార్పు కూడా ఖాయంగా ఉంటుందని పార్టీలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌గా ఉన్న ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ పనితీరుపై కొంత విమర్శలు కూడా ఉన్నాయి. దీపాదాస్‌ స్థానంలో రాజస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు తెలంగాణ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్, జూనియర్ అన్న వివాదం కూడా కొంత ఉందని భావిస్తున్న అధిష్టానం.. అశోక్ గెహ్లాట్ లాంటివాళ్ళను ఇంచార్జిగా నియమించడం వల్ల ఇలాంటి సమస్యలకు పుల్‌స్టాప్ పెట్టవచ్చని భావిస్తోంది. మొత్తానికి కేసీ వేణుగోపాల్, హైదరాబాద్ పర్యటన రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో టెన్షన్ పుట్టిస్తోంది. ఆయన హైదరాబాద్‌ పర్యటన అనంతరం రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ.. టీపీసీసీ టీమ్‌లో కూడా అనేక మార్పులు, చేర్పులు ఉంటాయని నాయకులు భావిస్తున్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com