అభివృద్ధి పనులకోసం, ప్రభుత్వ అవసరాల కోసం, ఇతర కార్యకలాపాల కోసం భూములు ఇస్తున్నవాళ్లకు పరిహారం చెల్లించడంలో ఆలస్యమైతే వాళ్లు ఇకపై నష్టపోవడం ఉండదు. ఎప్పుడో భూములు తీసుకొని పది, పదిహేనేళ్ల తర్వాత పరిహారం చెల్లిస్తామంటే కుదరదని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అది ప్రభుత్వమైనా, ప్రైవేటు వ్యక్తులైనా వర్తిస్తుందని తెలియజేసింది. పరిహారం చెల్లించడం ఏదైనా కారణంతో ఆలస్యమైతే డబ్బులు చెల్లించే నాటికి ఉన్న మార్కెట్ రేటు భూ నిర్వాసితులకు చెల్లించాల్సిందేనని తెలిపింది. ఇప్పుడీ సుప్రీంకోర్టు తీర్పు దేశవ్యాప్తంగా లక్షల మందికి ఊరట కలిగించేదిగా మారింది.
కాదు.. కూడదని పాత ధరల ప్రకారమే పరిహారం చెల్లిస్తామంటే కుదరదని న్యాయస్థానం స్పష్టం చేసింది. అలా చేస్తే.. 300ఏ అధికరణను ఉల్లంఘించినట్టే అని పేర్కొంది. ఎప్పుడో 2003వ సంవత్సరంలో భూమి సేకరించి.. అప్పటి ధరల ప్రకారం.. రేటు నిర్ధారించి.. ఆ సొమ్మును 2019లో చెల్లిస్తామంటే కుదరదని తేల్చి చెప్పింది. అధికారుల కారణంగా పరిహారం చెల్లింపులు ఒకవేళ ఆలస్యమైతే.. ఆ పరిహారం చెల్లించేనాటికి సదరు భూములకు మార్కెట్ రేటు ఎంత ఉంటే అంత చెల్లించాల్సిందేనని, అలా మార్కెట్ ధరను పొందే హక్కు భూయజమానులకు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
బెంగళూరు-మైసూరు మౌలిక వసతుల నడవా ప్రాజెక్టు-బీఎంఐసీపీ కోసం 22 యేళ్ల క్రితం భూములు సేకరించినప్పటికీ.. ఇప్పటిదాకా నష్టపరిహారం చెల్లించలేదంటూ అత్యున్నత న్యాయస్థానంలో దాఖలైన పిటిషన్పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ కేసు విచారణ సందర్భంగా ఈ కీలక తీర్పు ఇచ్చింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు చేపట్టిన భూసేకరణలో భూములను కోల్పోయి ఏళ్లు గడుస్తున్నా పరిహారం అందనిరైతులు, సామాన్యపౌరులకు ఉపశమనం ఇచ్చేలా ఈ తీర్పు ఉంది. బీఎంఐసీపీ కోసం కర్ణాటక పారిశ్రామిక ప్రాంతాల అభివృద్ధి బోర్డు 2003లో ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చింది. కేఐఏడీ చట్టం ప్రకారం 2005 నవంబరులో భూసేకరణ చేపట్టింది. సేకరణ పూర్తయి ఏళ్లు గడుస్తున్నా భూయజమానులకు పరిహారం చెల్లించలేదు. పదహారేళ్ల తర్వాత 2019లో భూ యజమానులకు పరిహారం ఇచ్చారు. కానీ.. 2011 నాటి మార్కెట్ రేట్లు లెక్కగట్టి ఆ మొత్తాలు ఇచ్చారు. దీంతో భూయజమానులంతా కోర్టును ఆశ్రయించారు. బెర్నార్డ్ ఫ్రాన్సిస్ జోసెఫ్ అనే వ్యక్తి ఈ బాధితులకు నేతృత్వం వహించారు. అయితే, ఈ కేసు విచారణ సమయంలో తీవ్రంగా స్పందించిన ధర్మాసనం…వారు 22 ఏళ్లుగా పలుమార్లు కోర్టు తలుపులు తడుతూనే ఉన్నారని గుర్తు చేసింది. భూ యజమానుల తరపు నుంచి ఎలాంటి అలసత్వం లేదన్న ధర్మాసనం.. రాష్ట్ర ప్రభుత్వం, కేఐఏడీబీ అధికారుల సోమరితనం వల్లే పరిహారం చెల్లింపు ఈ స్థాయిలో ఆలస్యమయిందని వ్యాఖ్యానించింది. అదీ కోర్టు ధిక్కరణ నోటీసులు ఇచ్చాకనే అధికారులు స్పందించారని పాయింట్ లేవనెత్తింది. 2019 ఏప్రిల్ 22వ తేదీన.. భూమికి ఇవ్వాల్సిన మార్కెట్ ధరను ప్రత్యేక భూసేకరణ అధికారులు నిర్ణయించారు. కాబట్టి అప్పటి మార్కెట్ రేటు ప్రకారమే ఇప్పుడు పరిహారం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఒకవేళ 2003 నాటి ధరల ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని ఆదేశిస్తే అది న్యాయాన్ని, ఆస్తి హక్కు రక్షణకు ఉద్దేశించిన రాజ్యాంగంలోని 300ఏ అధికరణాన్ని అపహాస్యం చేసినట్టవుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. 2019 ఏప్రిల్ 22 నాటి మార్కెట్ ధరలను పరిగణనలోకి తీసుకొని, మొత్తం నష్టపరిహారాన్ని లెక్కించాలని సూచించింది. 2నెలల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కూడా భూ సేకరణ అధికారిని ఆదేశించింది. ఈ నిర్ణయం నచ్చకపోతే సవాలు చేసే హక్కు ఇరు పార్టీలకూ ఉందని పేర్కొంది.