డేటింగ్ యాప్ లతో 700 మందిని ముంచేసిన మాయగాడు…
అమెరికాలో ఉండే మోడల్ నని చెప్పుకుంటూ సోషల్ మీడియా డేటింగ్ ప్లాట్ ఫారంల సాయంతో 700 మంది యువతులను మోసగించిన ఓ నేరగాడిని ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. తూర్పు ఢిల్లీలోని శకార్పూర్ ఏరియాకు చెందిన తుషార్ సింగ్ బిస్తీ అనే 23 ఏళ్ల యువకుడు ఈ మోసాలకు పాల్పడ్డాడు. యూపీ నోయిడాలోని ఓ ప్రైవేట్ కంపెనీలో రిక్రూటర్‌గా పనిచేస్తున్న తుషార్ పగలంతా ఈ పని చేస్తూ రాత్రయితే చాలు అతనిలోని వికారాలను బయటపెడుతున్నాడు. డార్క్ వెబ్ కంటెంట్ కలెక్ట్ చేస్తూ దానిని బాధితులకే పంపి డబ్బు డిమాండ్ చేస్తున్నాడు. తాను అమెరికాలో ఉంటున్న ఓ మోడల్ నని, భారత్ లో పెళ్లి కుమార్తెను ఎంచుకోడానికి వచ్చానని సోషల్ మీడియాలో పరిచయాలు పెంచుకుని అమ్మాయిలకు వల వేశాడు. దాంతో అందమైన యువకుడు తమ భర్త అయితే బాగుంటుందని అమ్మాయిలంతా ఇతని ఉచ్చులో పడి చాటింగ్‌కు అలవాటు పడ్డారు. బీబీఏ చదివిన తుషార్ పగలంతా నోయిడాలోని ఓ ప్రవేట్ కంపెనీలో టెక్నికల్ రిక్రూటర్ గా పనిచేస్తుంటాడు. తండ్రి డ్రైవర్ గా పనిచేస్తుండగా, తల్లి గృహిణి. సోదరి మరో చోట ఉద్యోగంలో ఉంది. కుటుంబంలో పెద్దగా ఇబ్బందులేమీ లేకున్నా తుషార్ సైబర్ క్రైమ్ మోసాల ద్వారా డబ్బు సంపాదించడం హాబీగా మార్చుకున్నాడు.
యాప్స్‌తో ఫేక్ ఐడెంటిటీ…
గుర్తింపు కోసం అతగాడు టెక్నాలజీనే వాడుకున్నాడు. కొన్ని ప్రత్యేకమైన యాప్స్ ద్వారా ఇంటర్నేషనల్ మొబైల్ నంబర్ సంపాదించాడు. అందులో బంబుల్, స్నాప్‌చాట్ లాంటి డేటింగ్, సోషల్ మీడియా యాప్ లలో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేశాడు. తద్వారా అమ్మాయిలతో చాటింగ్ మొదలు పెట్టాడు. ఒక బ్రెజిలియన్ మోడల్ ఫోటోలను, పర్సనల్ కంటెంట్‌ను తనదిగా అప్ లోడ్ చేశాడు. 18 నుంచి 30ఏళ్ల మధ్యలో ఉన్న ఆడపిల్లలే అతని టార్గెట్. ఒకసారి పరిచయం మొదలై అది పెరిగాక నెమ్మదిగా వారి వ్యక్తిగత వివరాలు, ఫోటోలు సేకరించేవాడు. మరికొంత కాలం గ్యాప్ ఇచ్చి వారి ఇంటిమేట్ వీడియోలు, న్యూడ్ వీడియోలు సరదాగా పంపమని కోరేవాడు. వాటిని తన మొబైల్ లో సేవ్ చేసుకునేవాడు. మొదట్లో ఇదో వ్యసనంగా, అలవాటుగా మొదలైనా ఆ తర్వాత వాటిని బేస్ చేసుకుని వసూళ్ల దందా మొదలెట్టాడు. వారి వీడియోలు వారికే పంపి డబ్బులు వసూలు చేసేవాడు. డబ్బులు పంపకపోతే ఆ వీడియోలు ఆన్లైన్ లో అప్ లోడ్ చేస్తానని డార్క్‌వెబ్‌కు అమ్ముతాననీ బెదిరించేవాడు. ఇలా తుషార్ దాదాపు 700 మంది అమ్మాయిలను తన వలలో వేసుకున్నాడు. బంబుల్ డేటింగ్ యాప్ ద్వారా 500 మంది మహిళలని, స్నాప్‌చాట్ యాప్ ద్వారా 200 మందిని, వాట్సాప్ ద్వారా మరికొంత మందిని తుషార్ ముగ్గులోకి దించాడు. గుట్టుగా సాగుతున్న ఈ వ్యవహారం ఓ బాధిత యువతి ఫిర్యాదుతో వెలుగు చూసింది.
వెలుగు చూసిందిలా…
గతేడాది డిసెంబర్ 13న ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ఓ యువతి సైబర్ పోలీస్ స్టేషన్‌కు ఇచ్చిన కంప్లయింట్‌తో తుషార్ అసలు భాగోతం బయటపడింది. గతేడాది జనవరిలో బంబుల్ యాప్ ద్వారా తుషార్ తనకు పరిచయమని సరదాగా మొదలైన సంభాషణలు ఆ తర్వాత స్నాప్ చాట్, వాట్సప్‌లలో ప్రైవేట్ చాట్ లుగా మారాయని ఆమె తెలిపింది. తానొక యూఎస్ బేస్డ్ మోడల్‌నని చెప్పడంతో నమ్మి తాను మోసపోయినట్లు ఆయువతి తెలిపింది. తన ఫోటోలు, వీడియోలు పంపమని కోరడంతో వాటిని పంపినట్లు, తమ మధ్య చాటింగ్ చాలా దూరం వెళ్లిందని వాపోయింది. ఎప్పుడు వ్యక్తిగతంగా కలుద్దామన్నా అతడు అవాయిడ్ చేయడంతో తనకు సందేహాలఉ వచ్చాయని యువతి తెలిపింది. ఒక రోజు తన న్యూడ్ వీడియోనే తనకు పంపి డబ్బులు డిమాండ్ చేశాడని, డబ్బులు పంపకపోతే ఆన్లైన్ లో పెడతానని బెదిరించాడనీ తెలిపింది. మొదట్లో కొద్ది మొత్తాల్లో డబ్బు పంపి, తన ఆర్ధిక స్థితి అంతంత మాత్రమని తనను వేధించొద్దనీ యువతి బతిమాలుకుంది. అయినా తుషార్ అదేరకంగా బెదిరించడంతో కుటుంబ సభ్యులకు చెప్పి వారి సహకారంతో ఢిల్లీ పోలీసులకు కంప్లయింట్ చేసింది.
కుప్పలుగా డార్క్ కంటెంట్…
సైబర్ పోలీసులు కొన్ని రోజులు తుషార్ కార్యకలాపాలపై నిఘా ఉంచి , అతగాడిని పక్కా ఆధారాలతో వలవేసి ఇంట్లో ఉండగానే పట్టుకున్నారు. నిందితుడి నుంచి 60 వాట్సాప్ చాట్లు, వందల సంఖ్యలో ఫొటోలు, డార్క్ వీడియోలు స్వాధీనం చేసుకున్నారు. ఇంటర్నేషనల్ మొబైల్ నెంబర్‌తో కూడిన ఫోన్‌ను, వేర్వేరు బ్యాంకులకు చెందిన 13 క్రెడిట్ కార్డులను రికవర్ చేశారు. బాధితుల నుంచి వసూలు చేసిన డబ్బులకు ఈ ప్రబుద్ధుడు అకౌంట్స్ కూడా మెయిన్టైన్ చేశాడు. రెండు బ్యాంకు అకౌంట్లలో ఈవివరాలు పోలీసులకు దొరికాయి. సైబర్ మోసగాడి మరిన్ని మోసాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అమ్మాయిలు ఇలాంటి యాప్ ల ద్వారా మోసగాళ్ల వలలో పడి సర్వం కోల్పోకూడదని, అలెర్ట్ గా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.