ఫైర్ డ్రైవర్ల పాసింగ్ అవుట్ పరేడ్ లో మంత్రి శ్రీధర్ బాబు
ఖాళీగా ఉన్న ప్రభుత్వోద్యోగాలను ఎప్పటికప్పుడు భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలోని ‘టీజీ ఫైర్ సర్వీసెస్, సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇన్సిట్యూట్‌లో శనివారం జరిగిన 196 మంది డ్రైవర్ ఆపరేటర్ల పాసింగ్ అవుట్ పరేడ్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ గత పదేళ్లుగా నిలిచిపోయిన ఉద్యోగాల భర్తీని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం తిరిగి పట్టాలెక్కించిందని మంత్రి తెలిపారు. భర్తీ ప్రక్రియలో ఏర్పడిన న్యాయపరమైన ఇబ్బందులను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ నియామక పత్రాలను అందజేస్తున్నామన్నారు. ఈ విషయంలో మా ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని చెప్పారు. హోంశాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారని పేర్కొన్నారు. అగ్నిమాపక శాఖా సిబ్బంది సేవలు అభినందనీయమని ముఖ్యంగా ఖమ్మంలో వరదలు తలెత్తినప్పుడు వీరు కీలకంగా వ్యవహరించారని కొనియాడారు. ఎక్కడ విపత్తు తలెత్తినా మేమున్నామంటూ రంగంలోకి దిగి ప్రజల ప్రాణాలను కాపాడుతున్నారని అన్నగా.. పెద్దన్నగా నిలుస్తున్నారు అని ప్రశంసించారు. ఏడాది వ్యవధిలోనే అగ్నిమాపక శాఖకు సంబంధించిన విభాగాల్లో 878 మందిని రిక్రూట్ చేశామని రాబోయే రోజుల్లో ఈ శాఖను మరింత బలోపేతం చేస్తామని మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటించారు. అగ్నిమాపక శాఖ సిబ్బందిపై గురుతర బాధ్యత ఉందని విపత్తులు తలెత్తినప్పుడు ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ముందుండాలని మంత్రి సూచించారు. 4 నెలల కఠోర శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన 196 మంది డ్రైవర్ ఆపరేటర్లను మంత్రి అభినందించారు. ఉద్యోగాల్లో చేరిన తర్వాత నీతి, నిజాయితీగా వ్యవహరించాలి… మీ విధులను సమర్థవంతంగా నిర్వహించాలి… ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీ దయానంద్, హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా, ఫైర్ డీజీ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.