30.2 C
Hyderabad
Wednesday, April 22, 2026

Live Video

spot_img

తక్కువ పరిహారంతో సరిపెట్టడం ఆస్తి హక్కుల ఉల్లంఘనే

ప్రాజెక్టుల నిర్వాసితులకు పరిహారంపై సుప్రీం కీలక తీర్పు

ప్రాజెక్టుల కోసం భూ సేకరణ చేసేటప్పుడు నిర్వాసితులకిచ్చే పరిహారంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు చెప్పింది. దేశ వ్యాప్తంగా ప్రభుత్వాలు వేర్వేరు చోట్ల చేపట్టిన భూ సేకరణలో భూములు కోల్పోయిన వారికి ఏళ్లు గడుస్తున్నా పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వాలు తాత్సారం చేస్తున్నాయి. సుప్రీం కోర్టు ఇచ్చిన తాజా తీర్పు తో నిర్వా సితులకు ఉపశమనం కలగనుంది. దశాబ్దాల క్రితం భూ సేకరణ చేసి భూములు కోల్పోయిన వారికి పరిహారం విషయంలో ఆలస్యం చేస్తే సొమ్ము ఇచ్చే నాటికి మార్కెట్ రేటు ప్రకారం నగదు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. అలా మార్కెట్ రేటు ప్రకారం పరిహారం పొందే హక్కు సదరు భూ యజమానులకు ఉంటుందని తేల్చి చెప్పింది. బెంగళూరు మైసూర్ మౌలిక వసతుల కారిడార్ కల్పన ప్రాజెక్టు కోసం దశాబ్దం క్రితం భూసేకరణ చేశారు. అయితే భూములు కోల్పోయిన యజమానులకు పరిహారం మాత్రం వెంటనే చెల్లించలేదు. దాంతో వారంతా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. జస్టిస్ బీ. ఆర్. గవాయ్, జస్టిస్ కె.వి.విశ్వనాధన్ తో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించి ఈ కీలక తీర్పునిచ్చింది.

బెంగళూరు, మైసూరు మౌలిక వసతుల కల్పన కారిడార్ ప్రాజెక్టు భూ సేకరణ కోసం 2003లో తొలిసారి నోటిఫికేషన్ జారీ చేశారు. 2005 నవంబర్ లో భూ సేకరణ చేపట్టారు. అప్పటినుంచి భూ యజమానులకు ఎలాంటి పరిహారం చెల్లించలేదు. పదే పదే చేసిన విజ్ఞప్తులనూ పట్టించుకోలేదు. అనేక దఫాల వినతుల అనంతరం 16 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు 2019లో నిర్వాసితులకు పరిహారం ఇచ్చారు. అయితే 2011 నాటి మార్కెట్ రేటు ప్రకారం పరిహారం ఇవ్వడంతో వారంతా కోర్టును ఆశ్రయించారు. భూ యజమానులు 22 ఏళ్లుగా పోరాడుతుంటే ప్రభుత్వాలు పట్టించుకోకపోగా, చెల్లింపులు ఆలస్యంగా జరపడం ముమ్మాటికీ తప్పేనని అందుకు ప్రభుత్వాలదే బాధ్యత అనీ సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. అదీ నిర్వాసితులంతా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అస్త్రం ప్రయోగించాకే ప్రభుత్వాలు కదిలాయని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ ప్రాజెక్టులో భూ సేకరణ 2003లోనే మొదలైనా భూమికి ఇవ్వాల్సిన మార్కెట్ ధరను 2019లో అధికారులు నిర్ణయించారని, కాబట్టి 2019 మార్కెట్ ధరల ప్రకారమే పరిహారం ఇవ్వాలనీ ఆదేశించింది. భూములు కోల్పోయిన వారికి 2003 నాటి ధరల ప్రకారం పరిహారం ఇస్తే అది వారి ఆస్తి హక్కు రక్షణకు ఉద్దేశించిన రాజ్యాంగంలోని 300 ఏ అధికరణాన్ని ఉల్లంఘించినట్లేనని సుప్రీం ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రాజెక్టు సందర్భంగా భూములు కోల్పోయే వారికి 2019 మార్కెట్ రేటు ప్రకారమే మొత్తం పరిహారం లెక్కించి ఇవ్వాలని, దీనిని రెండు నెలల్లో పూర్తి చేయాలని కర్ణాటక ప్రభుత్వ ఉన్నతాధికారిని ఆదేశించింది. ఈ తీర్పుపై అటు ప్రభుత్వం, ఇటు భూ యజమానులు కూడా మళ్లీ సవాల్ చేయచ్చునని వెల్లడించింది.

రాజ్యాంగంలోని 44వ అధికరణం ద్వారా ఆస్తి హక్కును ప్రాధమిక హక్కుల జాబితా నుంచి తొలగించినా సంక్షేమ రాజ్యంలో దీనిని మానవ హక్కు, అధికరణం 300 ఏ ప్రకారం రాజ్యాంగం ఇచ్చిన హక్కుగానే పరిగణించాలని ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ తీర్పు తెలుగు రాష్ట్రాల్లోనూ భూ సేకరణ సందర్బంగా భూములు కోల్పోయే వారికి మంచి చేసే అవకాశముంది. అటు పోలవరం నిర్మాణంలోనూ, ఇటు తెలంగాణలో పలు ప్రాజెక్టుల సందర్భంగానూ నిర్వాసితుల పరిహారం సరిగా అమలు కాక,చాలామంది అగచాట్లు పడుతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com