ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేసే విషయంలో అధ్యయనం చెయ్యడానికి ప్రభుత్వం నియమించిన క్యాబినేట్ సబ్ కమిటీ శుక్రవారం కర్నాటక రాష్ట్రంలో పర్యటించింది. సబ్ కమిటీ అధ్యక్షుడు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నేతృత్వంలో సభ్యులు హోంమంత్రి వంగలపూడి అనిత, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, సబ్ కమిటీ కన్వీనర్ ఏపీ రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి కాంతిలాల్ దండేలు బెంగుళూరు నగరంలో పర్యటించి ప్రజా రవాణా వ్యవస్ధ పనితీరును పరిశీలించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం కర్నటకలో అమలవుతున్న విధాన్ని అధ్యయనం చేశారు. క్యాబినేట్ సబ్ కమిటీ కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణ సంస్ధ బస్సుల్లో ప్రయాణించి పలువురు మహిళా ప్రయాణికులతో మాట్లాడి పథకం అమలవుతున్న తీరును తెలుసుకున్నారు. ఈ పథకం మహిళలకు ఎంతవరకూ ఉపయోగపడుతోందో అడిగి తెలుసుకున్నారు. అనంతరం కర్ణాటక రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డితో పాటు కర్ణాటక ఆర్టీసీ అధికారులతో ఏపీ మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంలో లోటు పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉండగా కర్నాటకలో గడచిన రెండు సంవత్సరాలుగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చెయ్యడం ద్వారా ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోయిందని అందువల్ల బస్సు ఛార్జీలు పెంచాలని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకం అమలు ద్వారా వచ్చిన నష్టాన్ని పూడ్చుకోవాలంటే కనీసం 15 శాతం ఆర్టీసీ టిక్కెట్ ధరలను పెంచుతామని కర్నాటక ప్రభుత్వం ప్రకటించింది.