హైదరాబాద్ లో ప్రతియేటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన – నుమాయిష్ ఇవాళ సాయంత్రం ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఎగ్జిబిషన్ ను ప్రారంభించనున్నారు. సాధారణంగా జనవరి ఒకటో తేదీన నుమాయిష్ ను ప్రారంభిస్తారు. అయితే, ఈ యేడాది భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సంతాప దినాల కారణంగా నుమాయిష్ ప్రారంభోత్సవాన్ని శుక్రవారానికి వాయిదా వేశారు.
ఈ యేడాది నుమాయిష్ లో రెండువేల స్టాల్స్ ను ఎగ్జిబిషన్ సొసైటీ ఏర్పాటు చేయనుంది. దీనికోసం దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు వచ్చి తమ తమ స్టాల్స్ సిద్ధం చేసుకున్నారు. ఈ స్టాళ్లలో ప్రధానంగా దుస్తులు, రకరకాల వస్తువుల, తినుబండారాలు విక్రయించనున్నారు. ప్రతియేటా ఉండే మినీ ట్రెయిన్ కు తోడు ఈ యేడాది డబుల్ డెక్కర్ బస్సు నుమాయిష్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు నుమాయిష్ కొనసాగుతుంది. వీకెండ్ లు , సెలవు రోజుల్లో అయితే రాత్రి 11 గంటల వరకు నుమాయిష్ పనిచేస్తుంది. నుమాయిష్ లో ఎంట్రన్స్ ఫీజు 50 రూపాయలుగా నిర్ణయించారు. నుమాయిష్ ఫిబ్రవరి 15వ తేదీ వరకు కొనసాగుతుంది.