- మొన్న అతుల్ సుభాష్.. ఇవాళ పునీత్ ఖురానా..
- డైవోర్స్ కేసుల్లో పెరుగుతున్న ఆత్మ హత్యలు
మొన్నామధ్య బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ తరహాలోనే ఢిల్లీకి చెందిన వ్యాపార వేత్త ఒకరు భార్య, అత్తింటి వారి వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం వెలుగు లోకి వచ్చింది. విడాకులకు దరఖాస్తు చేసుకున్న ఈ వ్యాపార వేత్త అది ఇంకా ప్రోసెస్ లో ఉండగానే ఆత్మహత్య చేసుకున్నాడు. అతుల్ సుభాష్ కేసులోలాగే విడాకులిచ్చేందుకు భార్య డిమాండ్ చేస్తున్నఅదనపు భరణమే ఇతగాడి మరణానికి కారణమని తెలుస్తోంది. పరస్పర అంగీకారంతో (మ్యూచువల్ కన్సెంట్) భార్యనుంచి విడాకులు పొందే క్రమంలో భార్య, అత్తింటి వారు తనను దుర్భాష లాడారని, వీలుకాని డిమాండ్లు తెరపైకి తేవడమే కాక సోషల్మీడియా వేదికలపై పరువు తీసారనే మనస్తాపంతో పునీత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడి ఆరోపణలకు, ఆవేదనకు కొన్ని వీడియో సాక్ష్యాలు కూడా బయట పడ్డాయి. ఓ కేఫ్ ఓనరైన పునీత్, భార్య మనీకా పావాకు అభిప్రాయ బేధాల కారణంగా పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకునేందుకు నిర్ణయించుకున్నారు. ఈ ఒప్పంద పత్రంలో చెప్పిన షరతులకు లోబడి ఆమెకు భరణం చెల్లించేందుకు పునీత్ అంగీకరించాడు. అయితే ఆ తర్వాత అతని భార్య, ఆమె కుటుంబ సభ్యులు మరో పది లక్షలు అదనంగా ఇవ్వాలని ఒత్తిడి చేశారని, క్షణానికో రకంగా డిమాండ్లు మారుస్తూ పునీత్ ను దుర్భాషలాడారని సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. అందుకు సాక్ష్యంగా తన భార్య తనను దూషిస్తున్న ఆడియో సాక్ష్యం కూడా జత చేశాడు. భరణం కింద ఇప్పటికే పెద్ద మొత్తం చెల్లించేందుకు అంగీకరించినా ఇంకా డిమాండ్ చేస్తున్నారని ఇప్పటికే తన తల్లి దండ్రులపైనా ఆర్థిక భారం పడిందని పునీత్ ఆ లేఖలో పేర్కొన్నాడు. తన సోషల్ మీడియా అక్కౌంట్లలోకి చొరబడి పరువు తీసే వ్యాఖ్యలు చేశారని అందుకు భార్య, ఆమె సోదరి ప్రధాన కారకులని ఆరోపించాడు.
ఆత్మ హత్యకు దారి తీసిన కారణాలివే…
గత నెల 30న పునీత్, మనీకా పావా ఫోన్లో తీవ్ర ఘర్షణ పడినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన ఆడియో, వీడియో సంభాషణలు కీలకంగా మారాయి, 15 నిమిషాల ఆ ఫోన్ సంభాషణలో వ్యాపారాలలో వాటా విషయమై ఇద్దరికీ తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఉన్న కేఫ్ తో పాటు అనుబంధంగా ఉన్నబేకరి, ఇతర వ్యాపారాల్లోనూవాటా ఇవ్వాలని భార్యడిమాండ్ చేయడమేకాక అసభ్యపదజాలంతో దూషించింది. డైవర్స్ నడుస్తుంటే వ్యాపారాల నుంచి ఎలా తొలగిస్తావంటూ మనీకా ప్రశ్నించింది. అంతేకాదు ఎదురుగా ఉంటే చెంప వాయించేదాన్ని అని దుర్భాషలాడింది. పైగా గట్టిగా అడిగితే సూసైడ్ చేసుకుంటానని బెదిరిస్తావా అని మనీకా ప్రశ్నించడం ఆ ఫోన్ కాల్ లో రికార్డయ్యింది. అయితే ఇదంతా అనవసరం నీకేం కావాలో చెప్పు అని పునీత్ ఖురానా తిరిగి ప్రశ్నించినట్లుగా కూడా ఆ ఫోన్ కాల్ లో ఉంది. ఈ వాగ్వాదం అయిన కాసేపటికే పునీత్ ఆత్మ హత్య చేసుకున్నట్లు ఢిల్లీ పోలీసులకు సమాచారం వచ్చింది. ఉరేసుకుని చనిపోయినట్లు గొంతుపై మచ్చలు కనిపించాయి. కాల్ రికార్డింగ్స్, మృతుడి చివరి వీడియో సందేశం ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.
2016లో ఈజంటకు పెళ్లి అయ్యింది. అయితే పెళ్లికి ముందునుంచే వీరిద్దరూ జాయింట్ గా ఒక కేఫ్ ను నడుపుతున్నారు. పెళ్లయిన రెండేళ్లకే వీరి బంధం దెబ్బతింది. విడిపోడానికి కోర్టు పెట్టిన షరతులకు అంగీకరించినప్పటికీ ఆతర్వాత మనీకా మాట మార్చిందని పునీత్ ఆరోపణ. అయితే ఒప్పుకున్న మొత్తం కాకుండా గొంతెమ్మ కోర్కెలు తెరపైకి తెచ్చి దుర్భాషలాడటమే కాదు, సోషల్మీడియాలో పరువు తీయడంతో మనస్తాపంతోనే పునీత్ చనిపోయాడని తల్లిదండ్రులు అంటున్నారు.